Mollywood: లైంగిక సన్నిహిత్యం ఉంటేనే అవకాశం.. హేమ కమిటీ నివేదిక!
ABN , Publish Date - Aug 19 , 2024 | 08:53 PM
మలయాళ చిత్రసీమ పరిశ్రమ క్రిమినల్ గ్యాంగ్ చేతిలో ఉందని తాజా నివేదిక వెల్లడించింది. మలయాళ సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేసేందుకు కేరళ ప్రభుత్వం 2019లో జస్టిస్ హేమ నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటు చేసింది
మలయాళ చిత్రసీమ (Mollywood)పరిశ్రమ క్రిమినల్ గ్యాంగ్ చేతిలో ఉందని తాజా నివేదిక వెల్లడించింది. మలయాళ సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేసేందుకు కేరళ ప్రభుత్వం 2019లో జస్టిస్ హేమ (Justice Hema Committee) నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటు చేసింది. 2017లో మలయాళ నటి కిడ్నాప్ కేసు సంచలనం రేపిన సంగతి తెలిసిందే! కారులో ఆమెపై లైంగిక దాడులకు జరిపినట్లు నటుడు దిలీప్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో అతడు అరెస్టయ్యాడు. అదే సమయంలో మాలీవుడ్‌లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ప్ఘ్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ అధ్యయనం (Justice Hema Committee report) ప్రారంభించింది. ఇండస్ట్రీలో చోటుచేసుకునే నేరాలపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయాలని సూచించింది. ఇండస్ట్రీలో పనిచేసే మహిళలు వివిధ రకాల వేధింపులకు గురవుతున్నారని, కాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని జస్టిస్ హేమ కమిటీ నివేదికలో స్పష్టం చేసింది. సినిమా పనులు మొదలు కాకముందే లైంగిక దాడులకు పాల్పడుతున్నారని అనేకమంది బాధితులు ఆరోపించినట్లు తాజా నివేదికలో తెలిపారు.
ఆ నివేదిక ప్రభుత్వానికి అందినప్పటికీ అందులోని విషయాలు గోప్యంగా ఉంచారు. తాజాగా సమాచార హక్కు చట్టం కింద బయటకు వచ్చిన ఆ నివేదికలో అనేక దిగ్ర్భాంతి కర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మాలీవుడ్‌లో పని చేసే మహిళా నటులపై వేధింపులు విషయాన్ని ఎత్తి చూపించింది. డ్రగ్స్ మత్తులో మునుగుతూ బాధిత మహిళల రూమ్ తలుపులు తట్టేవారని.. వారిలో అనేక మంది లైంగిక వేధింపులకు గురయ్యారని పేర్కొంది. భయం కారణంగా వారు పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదని వెల్లడించింది. తమ డిమాండ్లకు సిద్థంగా ఉండే మహిళలకు కోడ్ ఇచ్చేవారని, తిరస్కరించిన వారికి అవకాశాలు లేకుండా చేసేవారని నివేదికలో తెలిసింది. సినిమాలో నటించాలన్నా, మరే పని చేయాలన్నా లైంగికంగా సన్నిహితంగా మెలిగితేనే అవకాశాలు ఇస్తున్నట్లు గుర్తించామని హేమ కమిటీ పేర్కొంది.