Ilayaraja: అయితే ఏంటి.. ఇళయరాజాకు మద్రాస్ హైకోర్ట్ ‘రాయల్టీ’ షాక్
ABN , Publish Date - Apr 26 , 2024 | 07:19 AM
ఒక సినిమాకు ఆ చిత్ర నిర్మాత నుంచి రెమ్యునరేషన్ తీసుకున్న తర్వాత సంగీత దర్శకులు రాయల్టీ పొందే హక్కు మినహా మిగిలిన హక్కులను కోల్పోతారని మద్రాసు హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఉండే సంగీత దర్శకులు ఒక సినిమాకు ఆ చిత్ర నిర్మాత నుంచి రెమ్యునరేషన్ తీసుకున్న తర్వాత రాయల్టీ పొందే హక్కు మినహా మిగిలిన హక్కులను కోల్పోతారని మద్రాసు హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. కాపీ రైట్స్ చట్ట ప్రకారం పాటల యజమానిగా ఇళయరాజా (Ilayaraja) వస్తారా? లేదా? అనేది తదుపరి విచారణలో నిర్ణయిస్తామని ధర్మాసనం పేర్కొంది. సంగీత దర్శకుడు ఇళయరాజా సమకూర్చిన పాటల్లో సుమారుగా 4500 పాటలను (Songs) ఉపయోగించుకునేందుకు ఎకో ఆడియో రికార్డింగ్ కంపెనీ గతంలో అనుమతి పొందింది. అయితే, ఈ అనుమతుల గడుపు పూర్తైనప్పటికీ ఆ కంపెనీ పాటలను ఉపయోగిస్తుండడంతో తన పాటలకు కాపీ రైట్స్ తీసుకోకుండా ఉపయోగిస్తున్నారంటూ ఇళయరాజా హైకోర్టు (Madras High Court) లో పిటిషన్ వేశారు.
దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. నిర్మాతల అనుమతి తీసుకున్న తర్వాత ఇళయరాజా (Ilayaraja) పాటలను ఉపయోగించుకునేందుకు ఆడియో కంపెనీలకు పూర్తి హక్కులున్నాయంటూ తీర్పునిచ్చారు. అదేసమయంలో ఈ పాటలపై ఇళయరాజాకు ధార్మికంగా ప్రత్యేక హక్కులు ఉన్నాయంటూ 2019లో ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ ఆయన హైకోర్టు (Madras High Court) ద్విసభ్య ధర్మాసనంలో అప్పీల్ చేయగా, ఎంపిక చేసిన 4500 పాటలను ఉపయోగించకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, సినిమా కాపీ రైట్ హక్కులు నిర్మాత వద్ద ఉన్న కారణంగా ఆయా చిత్రాల్లోని పాటల (Songs) ను ఉపయోగించుకునేందుకు తమకు అధికారం ఉందని పేర్కొంటూ ఎకో కంపెనీ హైకోర్టుకు తెలిపింది.
ఈ కేసు విచారణ బుధవారం మరోమారు జరిగింది. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తులు మహాదేవన్, మహ్మద్ సఫీక్‌లతో కూడిన ధర్మాసనం.. ‘గీత రచన, నేపథ్యగాయకుడు కలిస్తేనే పాటగా రూపాంతరం చెందుతుంది. సాహిత్యం లేకుంటే పాట (Songs) లేదు. ఈ కోణంలో ఆలోచిస్తే గేయ రచయిత కూడా ఆ పాటకు రైట్స్ కోరితే పరిస్థితి ఏంటి? భారతీయ చిత్రపరిశ్రమలో ఒక చిత్రానికి ఆ చిత్ర నిర్మాత నుంచి రెమ్యునరేషన్ తీసుకున్న తర్వాత అన్ని హక్కులు కోల్పోతారని, కేవలం రాయల్టీపై మాత్రమే హక్కుగా ఉంటుందని స్పష్టం చేశారు. పైగా ఈ పాటల విక్రయం ద్వారా ఇళయరాజా (Ilayaraja) పొందిన సొమ్ము ఎవరికి సొంతం అనే విషయాన్ని తర్వాతి విచారణలో వెల్లడిస్తామంటూ ఈ కేసు తదుపరి విచారణను జూన్ 2వ తేదీకి ద్విసభ్య ధర్మాసనం (Madras High Court) వాయిదా వేసింది.