Dhanush: 16 ఏళ్ల వెంకటేశ ప్రభుకి ఇచ్చిన గిప్ట్‌ అది!

ABN , Publish Date - Jul 24 , 2024 | 02:05 PM

పోయస్‌గార్డెన్‌లో ఇల్లు కొనుగోలు చేయడంపై ‘రాయన్‌’ ప్రెస్‌మీట్‌లో నటుడు ధనుష్‌  స్పందించారు. ఇల్లు కొనడం కూడా చర్చనీయాంశంగా మారుతుందని ఊహించలేదు అని ఆయన అన్నారు.

పోయస్‌గార్డెన్‌లో (Poes Garden) ఇల్లు కొనుగోలు చేయడంపై ‘రాయన్‌’ (Raayan) ప్రెస్‌మీట్‌లో నటుడు ధనుష్‌ (Dhanush) స్పందించారు. ఇల్లు కొనడం కూడా చర్చనీయాంశంగా మారుతుందని ఊహించలేదు అని ఆయన అన్నారు. ఆ ఏరియాలో ఇల్లు ఉండాలన్నది ఎప్పటి నుంచో ఉన్న కల అని తెలిపారు. ధనుష్‌ మాట్లాడుతూ ‘‘పోయస్‌గార్డెన్‌లో నేను ఇల్లు కొనుగోలు చేయడం ఇంత హాట్‌ టాపిక్‌గా మారుతుందని తెలిసి ఉంటే.. వేరే ఎక్కడైనా చిన్న అపార్ట్‌మెంట్‌ తీసుకునేవాడిని. ఆ ప్రాంతంలో నేను ఇల్లు కొనుగోలు చేయకూడదా? ఉన్నచోటనే నేను మిగిలిపోవాలా? అక్కడ ఇల్ల్లు కొనడం వెనక చిన్న కథ ఉంది. నేను ఏ హీరోకి (రజనీకాంత్)  వీరాభిమానినో మీ అందరికీ తెలుసు. కేవలం ఆయన ఇల్లు చూడటం కోసమే చిన్నతనంలో ఓసారి పోయస్‌ గార్డెన్‌కు వెళ్లా. ఆ ప్రాంతంలోనే జయలలితమ్మ ఇల్లు కూడా ఉందని అప్పుడే తెలిసి ఆశ్చర్యపోయా. ఏదో ఒకరోజు తప్పకుండా ఈ ప్రాంతంలో ఇల్లు కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నా. పదహారేళ్ల వెంకటేశ్‌ ప్రభు (ధనుష్‌ అసలు పేరు)కు ఇప్పుడు నేనిచ్చిన బహుమతే ఆ ఇల్లు’’ అని అన్నారు. దాదాపు రూ.150 కోట్లు పెట్టి పోయస్‌ గార్డెన్‌లో ధనుష్‌ ఇల్లు కట్టించుకున్నట్లు కొన్నాళ్ల క్రితం కథనాలు వచ్చాయి. 2023లో అది పూర్తైందని తెలిసింది.

ధనుష్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రాయన్‌’. ఇది ఆయన నటించిన 50వ సినిమా. సెల్వరాఘవన్‌, ప్రకాశ్‌రాజ్‌, సందీప్‌ కిషన కీలక పాత్రధారులు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూ.100 కోట్ల బడ్జెట్‌తో సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై కళానిధి మారన్‌  ఈ చిత్రాన్ని నిర్మించారు. జులై 26న ఈ సినిమా ఇది ప్రేక్షకుల ముందుకురానుంది.

Updated Date - Jul 24 , 2024 | 02:11 PM