Chitra: అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ.. సింగర్ చిత్రపై నెటిజన్ల అటాక్
ABN , Publish Date - Jan 17 , 2024 | 06:11 PM
కవిత్వానికి కాదేది అనర్హం, విమర్శించడానికి అవసరం లేదు సందర్భం అన్నట్లుగా తయారైంది ప్రస్తుత వివాదాన్ని చూస్తుంటే, వింటుంటే. సింగర్ చిత్ర విషయంలో నెట్టింట జరుగుతున్న రచ్చ కూడా అలాంటిదే.
కవిత్వానికి కాదేది అనర్హం, విమర్శించడానికి అవసరం లేదు సందర్భం అన్నట్లుగా తయారైంది ప్రస్తుత వివాదాన్ని చూస్తుంటే, వింటుంటే. సింగర్ చిత్ర (Chithra) విషయంలో నెట్టింట జరుగుతున్న రచ్చ కూడా అలాంటిదే. ఇక అసలు విషయానికి వస్తే మరో ఐదు రోజుల్లో అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ (RamMandirPranPratishta) జరుగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ వేడుకకు హజరావ్వాలంటూ దాదాపు 7వేల మంది ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. ఇందులో రాజకీయ, సాహిత్య, సామాజిక ప్రముఖులతో పాటు టాలీవుడ్ నుంచి చిరంజీవి, రామ్‌చరణ్, బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్ ఫ్యామిలీలకు ఇన్విటేషన్స్ పంపడం జరిగింది.
ఈ క్రమంలో తాజాగా ప్రముఖ సింగర్ చిత్ర (Chithra)కు కూడా ఆహ్వానం అందింది. అయితే ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ‘అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ రోజున శ్రీరాముడి కీర్తనలు ఆలపించండి, సాయంత్రం ఇళ్లలో ప్రమిదలతో 5 దీపాలు వెలిగించండి’ ‘లోకా సమస్తా సుఖినోభవంతు’ అంటూ రెండు రోజుల కిందట చిత్ర (Chithra) ఓ వీడియో సందేశాన్ని సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. ఇప్పుడు ఈ వీడియోనే వివాదానికి దారి తీసింది. ఆమెకు రాజకీయాలను ఆపాదిస్తూ కొందరు నెటిజన్లు తీవ్రంగా విమర్శల దాడికి దిగారు. దీంతో ఇప్పుడు చిత్ర (Chithra) పేరు సోషల్ మీడియాల్లో ట్రెండింగ్ అవుతున్నది.
అయితే అయోధ్యలో జరగనున్న రామమందిర ప్రాణప్రతిష్ఠ (RamMandirPranPratishta) కార్యక్రమం ఓ రాజకీయ పార్టీ ప్రయోజనాల కోసం జరుగుతున్న కార్యక్రమమని, దానికి సమాజంలో మంచి స్థాయిలో ఉన్న వారు, గుర్తింపు ఉన్న మీలాంటి వాళ్లు ప్రమోట్ చేయడమేంటంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలాఉండగా గాయని చిత్రపై జరుగుతున్న దాడిని ఖండిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్, బీజేపీ ఇతర స్థానిక పార్టీలు చిత్ర (Chithra)కు మద్దతుగా నిలుస్తున్నాయి. తన మనోభావాలను తెలిపే హక్కు చిత్రకు ఉందని అన్నారు. ఈ విధంగా దాడి చేస్తున్న వారిపై కఠిన చర్యల తీసుకోవాలంటూ కోరాయి. ఇంకా మున్ముందు ఈ వివాదం ఎటు దారి తీస్తుందో వేచి చూడాలి.