Kavundampalayam: ‘గౌండంపాళెయం’ విడుదలకు సీఎం చొరవ చూపాలి
ABN , Publish Date - Jul 09 , 2024 | 09:34 PM
తన స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన ‘గౌండంపాళెయం’ చిత్రం విడుదలకు ముఖ్యమంత్రి స్టాలిన్ చొరవ చూపాలని దర్శక నటుడు రంజిత్ విజ్ఞప్తి చేశారు.
తన స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన ‘గౌండంపాళెయం’ (Kavundampalayam)చిత్రం విడుదలకు ముఖ్యమంత్రి స్టాలిన్ చొరవ చూపాలని దర్శక నటుడు రంజిత్ (Ranjith) విజ్ఞప్తి చేశారు. ఆయన హీరోగా నటించి దర్శకత్వం వహించిన చిత్రం ‘గౌండంపాళెయం’. ఈ నెల 5వ తేదీ విడుదల కావాల్సి ఉండగా, బెదిరింపుల కారణంగా చిత్రాన్ని విడుదల చేయలేదు.
దీనిపై ఆయన మాట్లాడుతూ.. ‘ఈ చిత్రం విడుదలకు కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు వ్యతిరేకిస్తూ, థియేటర్ యజమానులను బెదిరిస్తున్నారు. ఈ విషయంపై కోయంబత్తూరు పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాం. ఈ సినిమా విడుదలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి సాఫీగా విడుదల చేసేందుకు చొరవ చూపించాలని ముఖ్యమంత్రి స్టాలిన్, సినిమాటోగ్రఫీ మంత్రిని కలిసి విజ్ఞప్తి చేయనున్నామన్నారు.
కపట ప్రేమ, తల్లిదండ్రుల మనోవేదన వంటి అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాను. సినిమాను నిర్మించిన నాతో పాటు మిగిలిన నిర్మాతలంతా రైతులే. ఎవరూ కోటీశ్వరులు కాదు. నేను జన్మించిన నేలలో నా చిత్రం విడుదల చేయలేక పోవడం మనోవేదన కలిగిస్తుంది. నన్ను వ్యతిరేకించే వారికి ఈ చిత్రం విజయం సరైన సమాధానం చెబుతుంది. సెన్సార్ సర్టిఫికెట్ మంజూరు చేసిన తర్వాత కూడా విడుదల చేయలేక పోవడం బాధాకరం. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ సినిమాను త్వరలోనే విడుదల చేస్తాం’ అని పేర్కొన్నారు.