Mamitha Baiju: బన్నీని చూసి అలా తయారైపోయా 

ABN , Publish Date - May 05 , 2024 | 10:26 AM

లవ్‌డ్రామా, మలయాళ సూపర్‌హిట్‌ ‘ప్రేమలు’తో కుర్రకారుకు బాగా కనెక్ట్‌ అయ్యింది మమితా బైజు. ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటూ దూసుకెళ్తోందీ చిన్నది. మాంచి జోరుమీదున్న ఈ మలయాళ కుట్టి చెబుతున్న కబుర్లివి...

Mamitha Baiju: బన్నీని చూసి అలా తయారైపోయా 

లవ్‌డ్రామా(love Drama), మలయాళ సూపర్‌హిట్‌ ‘ప్రేమలు’తో (Premalu) కుర్రకారుకు బాగా కనెక్ట్‌ అయ్యింది మమితా బైజు (Mamitha Baiju) ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటూ దూసుకెళ్తోందీ చిన్నది. మాంచి జోరుమీదున్న ఈ మలయాళ కుట్టి చెబుతున్న కబుర్లివి...

చదువుకుంటూనే...

నేను పుట్టింది కేరళలోని కొట్టాయంలో. నాన్న వృత్తిరీత్యా డాక్టర్‌. అమ్మ గృహిణి. నాకొక అన్నయ్య ఉన్నాడు. తనే నా నటనకు పెద్ద విమర్శకుడు. నేను ఏ సీన్‌ బాగా చేయకపోయినా మొహం మీదే చెప్పేస్తాడు. నన్ను డాక్టర్‌గా చూడాలన్నది నాన్న ఆశ. కానీ నాకేమో చిన్నతనం నుంచి సాంస్కృతిక కార్యక్రమాలంటే ఇష్టం. కూచిపూడిలో శిక్షణ కూడా తీసుకున్నా. ప్రస్తుతం బీఎస్సీ సైకాలజీ చదువుతున్నా.

Mamitha (2).jpeg

చిన్న తప్పుతో అలా...

చాలామంది నా పేరు గమ్మత్తుగా ఉందంటుంటారు. మమిత అంటే మిఠాయి అని అర్థం. ఈ పేరు వెనుక ఓ బుల్లి కథ ఉంది. నా అసలు పేరు నమిత. కానీ ఆసుపత్రి సిబ్బంది నా బర్త్‌ సర్టిఫికెట్‌లో మమిత అని తప్పుగా రాశారు. మా వాళ్లు సరిగ్గా గమనించలేదు. తీరా స్కూల్‌లో చేర్పించడానికి తీసుకెళ్లాక పేరు తప్పుగా పడిందని గుర్తించారు. చేసేదేమీలేక మమిత కూడా కొత్తగా ఉందని అలాగే ఉంచేశారు. అలా నాది కానీ పేరు నాదైపోయింది.

పరీక్షలున్నా...

తెలుగు సినిమాలతో చిన్నప్పటి నుంచే పరిచయం ఉంది. కొన్ని అనువాదాలు... మరికొన్ని డైరెక్ట్‌ తెలుగు సినిమాలే చూశా. ‘మగధీర’ నా ఫేవరేట్‌ సినిమా. మలయాళంలో ‘ధీర’గా డబ్‌ అయ్యింది. సుమారు యాభైసార్లు చూసుంటా. పరీక్షలున్నా ఆ సినిమా కోసం టైమ్‌ కేటాయించేదాన్ని. నాకు నచ్చిన సినిమాల్లో ‘ఈగ’ కూడా ఉంది. అది ఎన్నిసార్లు చూశానో లెక్కేలేదు.

Mamitha (3).jpeg

మొదటిది కాదు...

‘ప్రేమలు’ నా మొదటి సినిమా అనుకుంటారు కానీ, ఇది నా పదహారో సినిమా. తొమ్మిదో తరగతిలోనే నా నట ప్రస్థానాన్ని మొదలెట్టా. ఓసారి స్కూల్‌లో ఇచ్చిన నృత్య ప్రదర్శన ఫొటోలు చూసి నాన్న స్నేహితుడైన ఓ నిర్మాత ‘సర్వోపరి పాలక్కారన్‌’ చిత్రంలో చిన్న పాత్ర ఇచ్చారు. ఆ తరువాత వరుసగా ‘హనీ బీ 2: సెలబ్రేషన్స్‌’, ‘డాకినీ’, ‘కృష్ణం’, ‘వరతన్‌’, ‘స్కూల్‌ డైరీ’ లాంటి విభిన్న చిత్రాల్లో సహాయక పాత్రలు చేశా. 2021లో వచ్చిన ‘ఖో ఖో’లో నేను చేసిన టీమ్‌ కెప్టెన్‌ పాత్రకు మంచి గుర్తింపు లభించింది. ఆ చిత్రానికి ఉత్తమ సహాయనటిగా ‘కేరళ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అవార్డు’ అందుకున్నా. అలాగే ‘రెబల్‌’ తో తమిళంలో అరంగేట్రం చేశా. దానికి ముందు తమిళంలో సూర్య సర్‌తో ఓ సినిమా చేశాను కానీ అది మధ్యలోనే ఆగిపోయింది.

బోర్‌ కొడితే...

అల్లు అర్జున్‌కి (Allu Arjun)నేను వీరాభిమానిని. ఆయన నటించిన ప్రతీ సినిమాని పదిసార్లకు మించే చూశా. ఇప్పటికీ బోర్‌ కొట్టినప్పుడల్లా బన్నీ సినిమాలే చూస్తుంటా. ఒకానొక సమయంలో బన్నీపై నాకున్న పిచ్చి పీక్‌లో ఉండేది. గజపొక్కిరి (జులాయి), రోమియో జూలియట్‌ (ఇద్దరమ్మాయిలతో) వంటి సినిమాల్లో బన్నీ ‘క్యాసియో వాచ్‌’ ధరించడం చూశాకే నాకు వాటిపై మక్కువ ఏర్పడింది. వెంటనే అలాంటి వాచ్‌ కొని పెట్టుకున్నా. పాఠశాల రోజుల్లో బన్నీ డ్రెస్సింగ్‌ స్టైలే అనుకరించేదాన్ని. టామ్‌బాయ్‌లా స్కూల్‌కి వెళ్లేదాన్ని.

Mamitha (2).jpeg

వారికి నచ్చితే ఓకే...

స్కూల్‌లో చదువుతున్న రోజుల్లో కొందరిపై క్రష్‌ ఉండేది. ఆ వయసులో అదో ఆకర్షణ అని ఆ తర్వాత అర్థం చేసుకున్నా. కాలేజీలోకి అడుగుపెట్టాక ఓ అబ్బాయి నా దగ్గరకు వచ్చి ‘నేనంటే ఇష్టం’ అన్నాడు. ‘నీ సినిమాలన్నీ చూశానని, తెలియకుండానే ఆసక్తి ఏర్పడింద’ని చెప్పాడు. నన్ను కలిసేందుకు మా కాలేజీ గేటు బయటే వేచి ఉండేవాడు. వాటిని గుర్తుచేసుకుంటే నవ్వొస్తుంది. నా పెళ్లి బాధ్యత నా తల్లిదండ్రులదే. వారికి నచ్చితే నాకు నచ్చినట్టే.

Mamitha-(4).jpg

Updated Date - May 05 , 2024 | 11:07 AM