Gautami: రూ.25 కోట్ల ల్యాండ్ ఇష్యూ.. కోర్టుకు నటి గౌతమి! వారిని వదలను
ABN , Publish Date - Oct 18 , 2024 | 04:25 PM
సీనియర్ నటి, అలనాటి సౌత్ స్టార్ హీరోయిన్ గౌతమి ఏడాదిగా తన కబ్జాకు గురైన తన భూమి కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు.
సినిమాలలో నటించి మంచి సంపాదనతో పాటు పేరు తెచ్చుకుంటున్న నటులకు బయట మాత్రం తిప్పలు తప్పడం లేదు. తాజాగా సీనియర్ నటి, అలనాటి సౌత్ స్టార్ హీరోయిన్ గౌతమి (Gautami) ఏడాదిగా తన కబ్జాకు గురైన తన భూమి కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. తన ల్యాండ్‌ను అమ్మి పెడతానంటూ సినీ ఫైనాన్సియర్ డబ్బు తీసుకుని మోసం చేయడంతో కోర్టు మెట్లెక్కింది. గత సంవత్సరం కాలంగా జరుగుతున్న ఈ కేసు తాజాగా వార్తల్లోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..
గౌతమి (Gautami)కి.. శ్రీపెరుంబూర్ సహా తమిళనాడులోని రామనాథపురం జిల్లా ముతుకులత్తూర్ సమీపంలో మొత్తంగా రూ.50 కోట్లకు పైగా విలువైన సుమారుగా 150 ఎకరాల స్థిరాస్తులు ఉన్నాయి. అయితే ఆమె తన అనారోగ్యం కారణంగా కొంత ఆస్తిని అమ్మేయాలని నిశ్చయించుకుని కారైక్కుడికి చెందిన సినీ ఫైనాన్సియర్, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే అళగప్పన్ (Alagappan)ను ఆశ్రయించింది. అయితే ముతుకులత్తూర్ సమీపంలోని స్థలం కొనుగోలు చేస్తానని చెప్పి రూ.3.1 కోట్లు తీసుకుని మోసానికి పాల్పడ్డాడు. ఆపై ఫోర్జరీ సంతకాలు, నకిలీ పత్రాలతో రూ.25 కోట్ల విలువైన స్థలాన్ని కబ్జా చేశాడు.
ఈ నేపథ్యంలోనే గత డిసెంబర్‌లో గౌతమి చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో పాటు. కోర్టుకు సైతం వెళ్లింది. రూ. 3.1 కోట్లు తీసుకుని మోసం చేసినట్టు గౌతమి ఆరోపించింది. ఆయన నుంచి తన డబ్బులు తనకు ఇప్పించాలని, తన భూమిని కబ్జా నుంచి విడిపించాలని కోరుతూ రామనాథపురం ఎస్పీకి సైతం ఫిర్యాదు చేయగా ఆమెను మోసం చేసిన సినీ ఫైనాన్సియర్ అళగప్పన్ (Alagappan)ను పోలీసులు అరెస్ట్ చేశారు.
అయితే ఈ కేసులో అళగప్పన్ (Alagappan) పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై తాజాగా నిన్న విచారణ జరిగింది. ఈ క్రమంలో భాగంగా గౌతమి గురువారం కోర్టుకు హాజరై న్యాయమూర్తి ఎదుట వివరణ ఇచ్చింది. అంతేగాక అళగప్పన్ (Alagappan) కు బెయిలు ఇవ్వొద్దని గౌతమి తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. అనంతరం గౌతమి విలేకరులతో మాట్లాడుతూ.. తన భూమిని అమ్మిపెడతానని చెప్పి మోసం చేసిన కేసులో న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటానని, దీనిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది.