Vishal: విజయ్ బాటలో విశాల్.. త్వరలో రాజకీయాల్లోకి?
ABN , Publish Date - Feb 06 , 2024 | 03:26 PM
రాజకీయాలలోకి వస్తున్నట్లు ఈమధ్యే ప్రకటించి సంచలనం సృష్టించిన తమిళ హీరో దళపతి విజయ్ బాటలోనే తమిళ, తెలుగు నటుడు విశాల్ కూడా త్వరలోనే రాజకీయ ప్రవేశం చేయనున్నారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
రాజకీయాలలోకి వస్తున్నట్లు ఈమధ్యే ప్రకటించి సంచలనం సృష్టించిన తమిళ హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay) బాటలోనే మరో తమిళ నటుడు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ‘తమిళ వెట్రి కళగం’ పేరిట పార్టీని ప్రకటించిన విజయ్ మరో రెండేండ్లలో రానున్న తమిళనాడు (Tamil Nadu) అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. దీంతో తమిళనాట రాజకీయాలు వేడెక్కాయి.
ఇప్పటికే విజయ్ పొలిటికల్ ఎంట్రీని జనం మరువక ముందే తమిళ, తెలుగు నటుడు విశాల్ (Actor Vishal) కూడా త్వరలోనే రాజకీయ ప్రవేశం చేయనున్నారని, వేరే ఏ ఇతర పార్టీలో చేరకుండా స్వయంగా ఓ పార్టీని స్థాపించనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ మేరకు క్షేత్ర స్థాయిలో ఏర్పాట్లు కూడా మొదలు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. రానున్న లోక్ సభ బరిలోను నిలిచేందుకు సన్నాహాలు చేస్తున్నారని, త్వరలోనే అధికారికంగా పార్టీ పేరును ప్రకటించి తదుపరి కార్యాచరణను మీడియా ఎదుట వెల్లడించనున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా గత ఐదేండ్లుగా తమిళనాట ఏదో ఒక సందర్భంలో విశాల్ పొలిటికల్ ఎంట్రీపై చర్చ జరుగుతూనే ఉంది. ఈ క్రమంలోనే దక్షిణ భారత నటీనటుల నడిగర్ సంఘం ఎన్నికల్లో నిలబడి శరత్ కుమార్‌తో వాగ్వాదం ఆ తర్వాత జనరల్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన విశాల్ (Actor Vishal) ఇక అప్పటినుంచి పలు సందర్భాలలో తన వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాకు చెందిన విశాల్ కుటుంబం చెన్నైలోనే స్థిర పడడంతో అక్కడే జన్మించిన విశాల్ ఉన్నత చదవులు పూర్తి చేశారు. తర్వాత అప్పటికే స్టార్ హీరోగా పేరున్న అర్జున్ సర్జా దగ్గర అసిస్టెంట్ దర్శకుడిగా కెరీర్ మొదలు పెట్టి ప్రేమచదరంగం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత వరుస విజయాలతో తమిళనాట ప్రజలతో ‘పురట్చి దళపతి’ (Puratchi Thalapathi) అనే బిరుదు దక్కించుకున్నాడు.
గతంలో ఓసారి విశాల్ (Actor Vishal) మాట్లాడుతూ రాజకీయాల్లోకి తప్పనిసరిగా వస్తానని, సమయం చూసి ప్రకటిస్తానంటూ ఇచ్చిన స్టేట్‌మెంట్.. ఈ సారి విశాల్ పొలిటికల్ ఎంట్రీ జరగొచ్చనే వార్తలకు బలం చేకూర్చినట్టైంది. దేశ రాజకీయాలపై చాలా యాక్టివ్‌గా ఉండే విశాల్ గతంలో చెన్నై ఆర్కే నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ వేయగా వివాదాస్పదంగా తిరస్కరణకు గురైంది.
ఆ తర్వాత అడపాదడపా ఏదో ఓ విషయంలో తన వాయిస్ స్ట్రాంగ్‌గా వినిపిస్తున్నాడు. ప్రస్తుతం ‘విశాల్ పీపుల్స్ హెల్త్ మూమెంట్’ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆయన చెన్నైలో వరదల సమయంలో ప్రజలకు ఇతోధికంగా సాయం అందించి మంచి పేరు తెచ్చుకున్నాడు. మరి కొద్దిరోజుల్లోనే విశాల్ (Actor Vishal) రాజకీయ ప్రవేశంపై అధికారికంగా క్లారిటీ రానుంది.