ARM OTT: 2నెలల తర్వాత ఓటీటీకి.. టొవినో థామస్ అదిరిపోయే యాక్షన్ అడ్వెంచర్! ఎందులో ఎప్పటినుంచంటే
ABN , Publish Date - Nov 01 , 2024 | 12:07 PM
తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు టొవినో థామస్. ఇటీవల ఆయన నటించిన కొత్త చిత్రం ‘ఏఆర్‌ఎమ్’ రెండు నెలల గ్యాప్ తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది.
తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు టొవినో థామస్ (Tovino Thomas). లూసిఫర్‌లో మోహన్‌లాల్‌కి తమ్ముడిగా, కేరళ వరదల నేపథ్యంలో తెరకెక్కిన ‘2018’ చిత్రంతో, ఓటీటీలో కాళి, మహా నది, వంటి సినిమాలతో అలరించాడు. 2021లో వచ్చిన 'మిన్నల్ మురళీ’ చిత్రంతో ప్రేక్షకులకు మరింతగా చేరువయ్యాడు. ఈక్రమంలో ఇటీవల ఆయన నటించిన కొత్త చిత్రం ‘ఏఆర్‌ఎమ్’ (ARM). మన బేబమ్మ కృతి శెట్టి (Krithi shetty) కథానాయిక. టొవినో 50వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మలయాళంతో పాటు, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైన మంచి ఆదరణను దక్కించుకుని విజయం సాధించి రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఇప్పుడు రెండు నెలల గ్యాప్ తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది.
కథ విషయానికి వస్తే.. అజయన్ (టోవినో థామస్) కేరళలోని ఓ ఊరిలో ఎలక్ట్రీషియన్ వృత్తిగా పని చేస్తుంటాడు. తన తాత మణియన్ బతికున్న కాలంలో చేసిన ఓ దొంగతనం ఆ తర్వాతి తరమైన అజయన్‌కు చుట్టుకుంటుంది. ఆ కారణంగా అతనికీ, అతని కుటుంబానికి ఆ గ్రామంలో గౌరవం ఇవ్వరు. అక్కడ ఎప్పుడు ఏ దొంగతనం జరిగినా పోలీసులు ముందుగా అజయ్‌నే అనుమానిస్తుంటారు. అయితే ఓరోజు ఆ ఊరి గుడిలో మరో పది రోజుల్లో ఉత్సవాలు ప్రారంభమవుతాయనగా ఆలయంలోని మహిమాన్వితమైన శ్రీభూతి దీపం (అమ్మవారి ప్రతిమ) ను ఎవరో దొంగిలిస్తారు. ఆ దొంగతనాన్ని అజయ్ మీదకు నెట్టే ప్రయత్నం చేస్తారు. అసలు ఆ విగ్రహం వెనక ఉన్న చరిత్ర ఏంటి? దానిని అప్పట్లో అజయ్ తాత ఎందుకు దొంగిలించాడు? మణియన్, కేలు ఏం చేశారు? ఊరిలో అసలు దొంగ ఎవరు? మరో పక్క గ్రామ పెద్ద నంబియార్ కూతురితో అజయ్ ప్రేమ ఏ పరిస్థితులకు దారి తీసింది. ఈ కథలో అజయ్ తల్లి (రోహిణి) పాత్ర ఏంటి? ఆ ఊరి ఉత్సవాలను డాక్యుమెంటరీగా చేయడానికి సుదేవ్ వర్మ (హరీష్ ఉత్తమన్) ఎందుకు వచ్చాడు? అతని రాకకు కారణమేంటి? అన్న ఆసక్తికరమైన కథకథనాలతో సినిమా సాగుంది. (ARM )
‘ఏఆర్‌ఎమ్’ (అజయంతే రంధం మోషణమ్) అంటే తెలుగులో అజయ్ చేసిన రెండో దొంగతనం అని అర్థం. కేలు, మణియన్, అజయన్ అనే మూడు తరాల ముగ్గురు వ్యక్తులకు లింక్ చేస్తూ తీసిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా ఇది. కింజ కేలు అనే యోధుడు తన ప్రతిభతో అక్కడి రాజును మెప్పించి కానుకగా తన గ్రామానికి తీసుకువచ్చిన ఓ విగ్రహం చుట్టూ ఈ సినిమా సాగుతుంది. రెండో తరంలో మణియన్ దొంగిలించిన విగ్రహం కోసం మూడో తరంలో మనుమడు అజయన్ చేసిన హంట్ అదిరిపోతుంది. అదేవిధంగా మణియన్ మనవడు అజయన్‌కు ఇద్దరికీ సమాజం నుంచి ఒకే తరహా పరిస్థితులు ఎదుర్కోవాల్సి రావడం అది చూయించిన విధానం కూడా ఆకట్టుకుంటుంది. ఆ రెండు పాత్రల్ని ఒకే ప్రాంతానికి తీసుకొచ్చే సన్నివేశాల్లో రేకెత్తే సంఘర్షణ హత్తుకుంటుంది. ఆ సమయంలో రోహిణి నటన పలికించిన ఎమోషన్స్ అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడీ సినిమా నవంబర్8 నుంచి డిస్నీ ఫ్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. సో ఎవరైతే థియేటర్లలో ఈ ‘ఏఆర్‌ఎమ్’ మూవీని మిస్సయ్యారో, మంచి థ్రిల్లర్ సినిమా చూడాలనుకుంటున్నారో వారు ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయకండి. ఇంటిల్లి పాది కలిసి హాయిగా చూడవచ్చు.