ప్రభాస్ 'సలార్' ఇక ఇంట్లో చూసెయ్యండి, ఎక్కడ, ఎప్పుడు అంటే...
ABN , Publish Date - Jan 19 , 2024 | 12:38 PM
'సలార్' సినిమా ఇక ఇంట్లోనే చూసుకోవచ్చు. ప్రభాస్, పృథ్విరాజ్ సుకుమారన్, శృతి హాసన్ నటించి, ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓటిటిలో ప్రసారం కానుంది.
ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన 'సలార్' సినిమా గత సంవత్సరం డిసెంబర్ 22న విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో మలయాళం నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ ఒక ముఖ్య పాత్ర పోషించిన సంగతి కూడా అందరికీ తెలిసిన విషయమే. విడుదలైన తరువాత ఈ సినిమా వసూళ్ళలో బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం సృష్టించింది. ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన లభించింది, అదీ కాకుండా ప్రభాస్ కేవలం నాలుగు పోరాట సన్నివేశాల్లో ప్రధానంగా కనిపించినా, ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరధం పట్టారు. (Prabhas Salaar film is streaming on Netflix from January 20)
శృతి హాసన్ కథానాయిక కాగా ఈశ్వరి రావు ప్రభాస్ తల్లిగా నటించారు. శ్రీయ రెడ్డి ఒక విలన్ పాత్రలో కనపడితే, జగపతి బాబు, షఫీ, టిను ఆనంద్, ఝాన్సీ మిగతా పాత్రల్లో కనపడతారు. ఈ సినిమాకి రెండో పార్టు కూడా ఉందని, అది వచ్చే సంవత్సరం విడుదలవుతుందని కూడా చిత్ర నిర్వాహకులు ప్రకటించారు. ఈ సినిమాని హోంబలే ఫిలిమ్స్ సంస్థ మీద కిరగండూర్ నిర్మించారు.
ఇప్పుడు ఈ 'సలార్' సినిమాని ఇంట్లో చూసుకోవచ్చు, ఎందుకంటే ఇది ఓటిటి లో ప్రసారం కానుంది. ఎక్కడ చూడొచ్చు అంటే, నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమాని జనవరి 20వ తేదీనుండి చూడొచ్చు అని ప్రకటించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాని చూడొచ్చు అని కూడా ప్రకటించారు. (Salar is streaming on Netflix)