Devil: రెండు వారాలకే కళ్యాణ్ రామ్ సినిమా ఓటిటి లోకి వచ్చేస్తోంది, ఇంట్లోనే చూసెయ్యండి
ABN , Publish Date - Jan 13 , 2024 | 05:10 PM
ఇంకా విడుదలైన రెండు వారాలు అయ్యాయి, అప్పుడే 'డెవిల్' సినిమా ఓటిటి లోకి వచ్చేస్తోంది. కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 29న విడుదలైంది, మిశ్రమ స్పందన వచ్చింది. ఇప్పుడు ఇంట్లోనే చూసుకోవచ్చు, ఎక్కడ, ఎప్పుడు అంటే...
నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన 'డెవిల్' సినిమా గత సంవత్సరం ఆఖరి సినిమాగా డిసెంబర్ 29న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా కొంచెం వివాదంలో కూడా వుండింది. ఈ సినిమాకి దర్శకుడిగా మొదటి నవీన్ మేడారం పేరు వేశారు, కానీ తరువాత అతనితో వచ్చిన విభేదాల కారణంగా ఈ సినిమా నిర్మాత అయిన అభిషేక్ నామ, తనే దర్శకత్వం చేశానని తన పేరే వేసుకున్నారు. విడుదలయ్యాక ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చింది. అలాగే ఈ సినిమాకి భారీగానే నిర్మాత ఖర్చు పెట్టారని కూడా తెలిసింది. (Kalyan Ram's Devil is going to stream on Amazon Prime for this Sankranthi)
అయితే విడుదలై ఇంకా రెండు వారాలు అయింది, అప్పుడే ఈ సినిమా ఓటిటి లోకి వచ్చేస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఈ సినిమా జనవరి 14న స్ట్రీమింగ్ అవుతోంది. సంక్రాంతి పండగ సందర్భంగా ఈ సినిమాని ఓటిటి లో స్ట్రీమింగ్ చేస్తున్నారని అంటున్నారు. అయితే విడుదలై రెండు వారాలు అయిందో లేదో అప్పుడే ఓటిటి లో స్ట్రీమింగ్ అవడం ఆశ్చర్యకరంగా వుంది.
ఈ సినిమా కథ ఒక పీరియడ్ డ్రామా. భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం వున్నప్పుడు ఒక సంస్థానంలో జరిగిన హత్య గురించి డెవిల్ అనే గూఢచారిని పరిశోధించడానికి బ్రిటిష్ ప్రభుత్వం పంపిస్తుంది. అయితే అతన్ని పంపడానికి ఇంకో కారణం కూడా ఉంటుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించిన ఆచూకీ తెలిసిన వ్యక్తులు ఆ సంస్థానంలో వున్నారని, ఆ సమాచారం కూడా తెలుసుకొని తమకి చెప్పాలని బ్రిటిష్ ప్రభుత్వం అతన్ని అడుగుతుంది.
అయితే డెవిల్ హత్య ఎవరు చేశారు కనుక్కున్నాడా, దాని వెనకాల వుండే రహస్యం ఏంటి, నేతాజీ అనుచరులు ఎవరున్నారు, వారి రహస్యాలు ఏంటి అన్నదే కథ. నందమూరి కళ్యాణ్ రామ్ డెవిల్ పాత్రలో చక్కగా చేశారు. సంయుక్త కథానాయిక, మాళవిక నాయర్, కమెడియన్ సత్య ఇంకొన్ని ముఖ్య పాత్రల్లో కనపడతారు.