ఓటీటీకి వ‌చ్చేసిన‌ మ‌ల‌యాళ క్రైమ్ థ్రిల్ల‌ర్‌.. చివ‌రి అరగంట ర‌చ్చ రచ్చే

ABN , Publish Date - Sep 26 , 2024 | 06:24 PM

ఈ ఏడాది మార్చిలో మ‌ల‌యాళంలో కేర‌ళ థియేట‌ర్ల‌లో విడుద‌లై పాజిటివ్ తెచ్చుకున్న అంచక్కల్లకొక్కన్ అనే సినిమాను తెలుగులో చాప్రా మ‌ర్డ‌ర్ కేసుగా తీసుకు వ‌చ్చారు.

Chapra Murder Case

తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు తాజాగా మ‌రో మ‌ల‌యాళ క్రైమ్ చిత్రం ఓటీటీకి వ‌చ్చింది. ఈ ఏడాది మార్చిలో మ‌ల‌యాళంలో కేర‌ళ థియేట‌ర్ల‌లో విడుద‌లై పాజిటివ్ తెచ్చుకున్న అంచక్కల్లకొక్కన్ (Anchakkallakokkan) అనే సినిమాను తెలుగులో చాప్రా మ‌ర్డ‌ర్ కేసు (Chapra Murder Case) గా అనువ‌దించి డిజిటల్ స్ట్రీమింగ్‌కు తీసుకు వ‌చ్చారు. ఈ సినిమాలో లుక్మ‌న్ అవ‌ర‌న్ (Lukman Avaran) హీరోగా న‌టించ‌గా చెంబ‌న్ వినోద్ జోష్ (Chemban Vinod Jose), మ‌ణికంద‌న్ ఆచారి, శ్రీజిత్ ర‌వి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

Chapra Murder Case

క‌థ విష‌యానికి వ‌స్తే.. 1986 సంవ‌త్స‌రంలో జ‌రిగే క‌థ‌గా ఈ సినిమా ఉంటుంది. క‌ర్ణాట‌క‌, కేర‌ళ బోర్డ‌ర్‌లోని ఓ కొండ ప్రాంతంలో ఓ ఎస్టేట్‌లో ఉండే చాప్రా ఓ రోజు రాత్రి అడ‌వి పంది కోసం వెళ్ల‌గా గుర్తు తెలియ‌ని వారు అత‌న్ని హ‌త్య చేస్తారు. పోలీసులు ఆ కేసును విచారిస్తున్న స‌మ‌యంలోనే వాసుదేవ‌న్ అనే కొత్త కానిస్టేబుల్ విధుల్లో చేరి అప్ప‌టికే అక్క‌డ ప‌లుకుబ‌డి ఉన్న‌ మ‌రో కానిస్టేబుల్ పీట‌ర్‌తో క‌లిసి ఉంటుంటాడు. స‌రిగ్గా అప్పుడే చాప్రా కుమారులు ఆ ఊరికి వ‌చ్చి త‌మ తండ్రిని చంపిన వారిని వెతుకుతూ చంపేస్తుంటారు. ఈ క్ర‌మంలో.. పైనుంచి వ‌స్తున్న‌ ఒత్తిడి కార‌ణంగా చాప్రా కేసును క్లోజ్ చేయాల‌ని పోలీసులు చూస్తుండ‌గా స‌డ‌న్‌గా శంక‌ర్ అనే వ్య‌క్తి నేనే చాప్రాను చంపానంటూ లొంగిపోతాడు.


ఈ నేప‌థ్యంలో అనేక కొత్త విష‌యాలు వెలుగులోకి వస్తాయి. చివ‌ర‌కు అస‌లు నిందితుడిని ప‌టుకున్నారా, శంక‌ర్ స‌రెండ‌ర్ అయ్యాక‌ కానిస్టేబుల్ వాసుదేవ‌న్‌కు చిక్కులెందుకు వ‌చ్చాయి, మ‌రో కానిస్టేబుల్ పీట‌ర్‌కు ఈ కేసుతో ఉన్న లింకేంటి, అస‌లు శంక‌ర్ ఎందుకు స‌రెండ‌ర్ అయ్యాడు, చాప్రా కుమారులు ఏం చేశారు, వాసుదేవ‌న్ గ‌తం ఏంటి, అత‌ను ఎలా బ‌య‌ట ప‌డ్డాడ‌నే ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌క‌థ‌నాల‌తో సినిమా ఆక‌ట్టుకుంటుంది.

Chapra Murder Case

సినిమాకు సెకండాఫ్ బ‌లం. మూవీ ఆరంభం ఇంట్రెస్టింగ్‌గా ఉన్న‌ప్ప‌టికీ త‌ర్వాత క‌థ సాగ‌దీసిన‌ట్టు, ప్ర‌తి క్యారెక్ట‌ర్‌కు స్లో మోష‌న్‌లో ఎలివేష‌న్ ఇవ్వ‌డం ఓవ‌ర్‌గా అనిపిస్తుంది. ఫ‌స్టాప్ అంతా అస‌లు ఏం చూస్తున్నామో అర్థం కాక త‌ల ప‌ట్టుకోనే ప‌రిస్థితి వ‌స్తుంది. ఒక్క‌సారిగా శంక‌ర్ స‌రెండ‌ర్ అయ్యాక స్టోరీ దారిలోకి వ‌స్తుంది.

Chapra Murder Case

ఇక సెకండాఫ్ నుంచి అస‌లు స్టోరీ రివీల్ అవుతూ మ‌న‌కు అదిరిపోయే థ్రిల్‌ను ఇస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వ‌చ్చే 20 నిమిషాల పోరాట దృశ్యాలు చూసే వారికి హై ఇస్తాయి. అలాగే చాప్రా కుమారులు ఉండే ప్ర‌తి సీన్ హైలెట్‌గా అనిపించినా వీళ్ల‌కు ఇంత బిల్డ‌ప్ అవ‌స‌ర‌మా అని కూడా అనిపించ‌క మాన‌దు. ఫ‌స్టాప్‌లో కేవ‌లం వీరిద్ద‌రు ఓ సారాయి కొట్టులో చేసే ఫైటింగ్ 5 నిమిషాలు ఉండ‌ట‌మే కాక‌, దానికి వ‌చ్చే ఓ బ్యా గ్రౌండ్ సాంగ్ మ‌న‌ల్ని పిచ్చోల్ని చేయ‌డం ఖాయం.

Chapra Murder Case

ఇక సినిమాటోగ్ర‌ఫీ, అక్క‌డి అందాలు, సంగీతం సూప‌ర్‌గా ఉన్నాయి. ప్ర‌స్తుతం ఈ సినిమా అహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మంచి యాక్ష‌న్ సినిమాలు ఇష్ట‌ప‌డే వారు ఈ యాక్ష‌న్‌, క్రైమ్, థ్రిల్ల‌ర్ మూవీని ఎంజాయ్ చేయ‌వ‌చ్చు.

Updated Date - Sep 26 , 2024 | 06:33 PM