OTT ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న.. జర్నీ దర్శకుడి ఎమోషల్ డ్రామా ‘నాడు’
ABN , Publish Date - Jun 03 , 2024 | 09:43 AM
దర్శకడు శరవణన్ కాస్త గ్యాప్ తర్వాత తమిళంలో తెరకెక్కించిన చిత్రం నాడు. ఇటీవలే డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చి ఆకట్టుకుంటోంది. ప్రేక్షకులతో ఎమోషనల్ జర్నీ చేయిస్తోంది.
తెలుగులో రామ్ హీరోగా గణేశ్, శర్వానంద్, అంజలిల జర్నీ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకడు శరవణన్ (M. Saravanan) మళ్లీ కాస్త గ్యాప్ తర్వాత తమిళంలో తెరకెక్కించిన చిత్రం నాడు (Naadu). మహిమా నంబియార్ (Mahima Nambiar), తర్సన్ (Tharshan) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఇటీవలే డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చి ఆకట్టుకుంటోంది. ఎలాంటి వల్గారిటీ లేకుండా, సింపుల్ కథతో గిరిజన వాసుల నేపథ్యంలో చుట్టూ ప్రకృతి సోయగాల మధ్య రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులతో ఎమోషనల్ జర్నీ చేయిస్తోంది. అంతేగాక తమిళనాడులోని కొలి హిల్స్ Kolli Hillsలో చిత్రీకరించిన మొదటి సినిమాగా ఇది నిలిచింది.
కథ విషయానికి వస్తే.. ఓ ఎత్తైన కొండపై గ్రామంలో చాలామంది ప్రజలు నివసిస్తుంటారు. అయితే ఆ ఊరిలో ఆస్పత్రి ఉన్నప్పటికీ ఎవరికైనా ప్రమాదం జరిగితే రక్షించేందుకు వైద్యులు ఉండరు. పర్వత ప్రాంతం, నగరానికి దూరంగా ఉండడంతో అక్కడికి రావడానికి ఏ డాక్టర్ ఇష్టపడడు.
ఈక్రమంలో అక్కడ వైద్యం అందుబాటులో లేక మరణాలు జరుగుతుండడంతో ఆ గ్రామ ప్రజలంతా కలిసి దీక్ష చేస్తారు. కలెక్టర్ రావాలని, పర్మినెంట్‌గా వైద్యుడిని నియమించాలని కోరతారు. అయితే కలెక్టర్ వచ్చి వారిని సముదాయించి అక్కడికి వైద్యుడిని పంపిస్తాను గానీ వాళ్లు వెళ్లకుండా మీరే ప్రేమగా చూసుకోనే బాధ్యత మీదే అంటూ హితవు పలుకుతాడు.
ఈక్రమంలో శోభన అనే వైద్యురాలు, తన సహాయకురాలితో కలిసి అక్కడికి వస్తుంది. డాక్టర్ వచ్చాక అక్కడి ప్రజలకు రెగ్యులర్‌గా అందుబాటులో ఉంటూ తన ట్రీట్‌మెంట్‌తో మంచి పేరు తెచ్చుకుంటుది. అయితే సిటీ లైఫ్‌స్టైల్ బాగా అలవాటైన ఆ డాక్టర్ కొద్ది రోజులు మాత్రమే ఇక్కడ ఉంటానని అంటుంది.
ఈ విషయం తెలుసుకున్న అక్కడి ప్రజలు ఆ ఊరంతటికి తలలో నాలుకలాగా ఉండే రామన్ సూచనల మేరకు ఆయన కుమారుడు మారా , ఆ గ్రామ ప్రజలు డాక్టర్‌ను జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. నిత్యం ఆమెకు కాపాలాగా ఉండడమే కాకుండా ఆమెకు ఇష్టమైన వాటిని తెచ్చి పెడుతుంటారు. వాళ్ల ఇండ్లలో విషాదాలు జరిగినా డాక్టర్ దాకా వెళ్లనీయకుండా ఆమె సంతోషంగా ఉండేలా చూసుకుంటారు.
ఈక్రమంలో చివరకు ఏమైంది.. గ్రామస్తులు డాక్టర్ తో ఎలా వ్యవహరించారు. డాక్టర్ అక్కడ ఉండి పోయిందా, లేదా ? రామన్ కూతురు ఎలా చనిపోయింది, లక్షణ్ ఎవరు? చివరకు మారి తన తండ్రికిచ్చిన మాట నెరవేర్చాడా, కలెక్టర్ ఈ డాక్టర్‌నే ఎందుకు పంపించాడు అనే కథకథనాలతో సినిమా సాగుతూ మంచి ఎమోషనల్ ఫీల్ ఇస్తుంది. సినిమా అసాంతం ఎక్కడా అరుపులు, హింసా సన్నివేశాలు లేకుండా ఫ్లాట్‌గా సాగుతూ మనల్ని అ కొండ ప్రాంతాలలోకి తీసుకెళుతుంది.
వాళ్లు చేసే పనులతో నవ్వులు తెప్పిస్తుంది. ఇప్పుడీ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుండగా తెలుగు భాషలోనూ అందుబాటులో ఉంది. ఇంకెందుకు ఆలస్యం ఇంటిల్లిపాది హాయిగా ఈ చిత్రాన్ని చూసి ఆస్వాదించండి. ఇదిలాఉండగా ఈ చిత్రంలో రామన్, లక్షణ్‌గా ద్విపాత్రాభినయం చేసిన శివాజీ (R. S. Shivaji)కి ఇదే అఖరు చిత్రం కావడం విషాదకరం.