ఆ రోజులు మళ్లీ రాకూడదు
ABN , Publish Date - Jul 17 , 2024 | 06:33 AM
‘గడచిన మూడేళ్లు ఎన్నో ఆటుపోట్లు చవిచూశాను. నా జీవితం తీవ్రమైన ఒడిదుడుకులతో గడిచింది. ఆ రోజులు నా జీవితంలో మళ్లీ రాకూడదు అని కోరుకుంటున్నాను’ అని హీరోయిన్ సమంత అన్నారు. ఆమె ఇటీవలే ఓ మీడియా ఇంటర్వ్యూలో తన సినిమాలు, వ్యక్తిగత జీవితం...
‘గడచిన మూడేళ్లు ఎన్నో ఆటుపోట్లు చవిచూశాను. నా జీవితం తీవ్రమైన ఒడిదుడుకులతో గడిచింది. ఆ రోజులు నా జీవితంలో మళ్లీ రాకూడదు అని కోరుకుంటున్నాను’ అని హీరోయిన్ సమంత అన్నారు. ఆమె ఇటీవలే ఓ మీడియా ఇంటర్వ్యూలో తన సినిమాలు, వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు. ‘మన జీవితాల్లో కొన్ని సంఘటనలు చేదు అనుభవాలుగా మిగిలిపోతాయి. ఎంత ప్రయత్నించినా మనం వాటిని ఆపలేం. అలాంటప్పుడు వాటిని అంగీకరించి, అధిగమిస్తూ ముందుకెళ్లడమే మనం చేయాల్సింది. కష్టకాలంలో ఆధ్యాత్మికత నాకు స్ఫూర్తినిచ్చింది. వ్యక్తిగతంగా, కెరీర్ పరంగా నాలో మంచి మార్పులకు కారణమైంది. ఈతరం ఎక్కువగా మానసిక అనారోగ్యానికి గురవుతోంది. ఆధ్యాత్మిక చింతన అలవరుచుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండొచ్చు. ప్రస్తుతం నా జీవితం బావుంది. నేను మునుపటిక న్నా బావున్నాను’ అని సమంత చెప్పారు. కొత్త సినిమాల గురించి మాట్లాడుతూ ‘ఈ ప్రపంచంలో నాకు బాగా ఇష్టమైన విషయం కెమెరా ముందు నిల్చోవడమే. ఆగస్టు నుంచి కొత్త సినిమా షూటింగ్లో పాల్గొంటాను. నా పాత్ర కోసం తర్ఫీదు అవుతున్నాను.
విలువిద్య, గుర్రపు స్వారీలో శిక్షణ తీసుకుంటున్నాను. నేను నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. అందుకే కొత్త నైపుణ్యాలు నేర్చుకునే అవకాశం ఉన్న కథలనే ఎంపిక చేసుకుంటున్నాను’ అని ఆమె చెప్పారు. సమంత స్వీయ నిర్మాణంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మా ఇంటి బంగారం’లో నటిస్తున్నారు. ఆమె నటించిన ‘హనీ-బన్నీ’ వెబ్ సిరీస్ త్వరలో స్ట్రీమింగ్ అవనుంది.