Elections: ఈ ముగ్గురు నటులే భారత రాజకీయాల్లో చరిత్ర సృష్టించారు
ABN , Publish Date - May 08 , 2024 | 06:29 PM
సినీ నటులు రాజకీయాల్లోకి అడుగుపెట్టడం కొత్తేమీ కాదు, కానీ అందులో కేవలం ముగ్గురు మాత్రమే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిస్థించి చరిత్ర సృష్టించారు. తమిళనాడు ముఖ్యమంత్రులుగా చేసిన ఎంజీ రామచంద్రన్, జయలలిత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ఈ ముగ్గురూ చిత్ర పరిశ్రమలోనే కాకుండా, రాజకీయాల్లో కూడా సంచలనం సృష్టించారు.
చలన చిత్ర పరిశ్రమనుండి ఎక్కువగా నటీనటులు రాజకీయాల్లోకి ప్రవేశించినా అందులో ముఖ్యమంత్రి పదవిని అధిష్టించింది కేవలం వేళ్లపైనే లెక్కపెట్టవచ్చు. ఆసక్తికర అంశం ఏంటంటే, ఎక్కువగా దక్షిణాదికి చెందిన నటీనటులే రాజకీయాల్లో ఎక్కువగా వస్తున్నారు, రాణించారు కూడా. బాలీవుడ్ నుండి అప్పుడప్పుడూ ఇద్దరో ముగ్గురో నటీనటులు రాజకీయాల్లో అడుగుపెడుతున్నా, దక్షిణాదితో పోలిస్తే చాలా తక్కువ అని చెప్పాలి.
అయితే దక్షిణాదిలో నటులకి అభిమానులు ఎక్కువ, వాళ్ళని ఒక్క నటులుగానే కాకుండా, అభిమానులు ఆ నటుల్ని ఆరాధిస్తారు. అందుకే దక్షిణాదిలో నటీనటులు ఎక్కువగా రాజకీయాల్లో రాణించగలుగుతున్నారని ఒక అంచనా. అయితే ఎంతమంది రాజకీయాల్లో అడుగుపెట్టినా కేవలం కొంతమంది మాత్రమే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి శెభాష్ అనిపించుకున్నారు.
ఎంజీ రామచంద్రన్
తమిళ చిత్ర పరిశ్రమలో ఎంజీ రామచంద్రన్ లేదా ఎంజీఆర్ కి ఎంతపేరుందో అందరికీ తెలిసిన విషయమే. అతని సినిమాల్లో ఎక్కువగా రాబిన్ హుడ్ లాంటి పాత్రలనే ఎక్కువ చేశారు. అప్పట్లోనే అతని సినిమాల్లోని మాటల్లో అంతర్లీనంగా తాను ప్రజలకి సేవ చేయడానికి, వారి బాగోగులు చూడటానికి రాజకీయాల్లోకి వస్తాను అన్నట్టుగా చూపించేవారు. తమిళ సినిమా పరిశ్రమలో మాస్ నటుడు ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం ఎంజీఆర్ మాత్రమే అని చెప్పాలి. అందుకే అతను రాజకీయాల్లో కూడా విజయం సాధించారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా పదేళ్లు చేయగలిగారు. సుమారు 150కి పైగా సినిమాలు చేసిన ఎంజీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక సినిమాల్లో నటించడం మానేశారు.
ఆసక్తికరం ఏంటంటే ఎంజీఆర్ కి అతి పెద్ద విజయం అందించిన సినిమా 'మళైక్కల్లన్' 1954లో. ఈ సినిమాకి రచయిత ఎంజీఆర్ కన్నా ముందు తమిళనాడు ముఖ్యమంత్రిగా పని చేసిన ఎం. కరుణానిధి. నటుడిగా కాకుండా కరుణానిధి రచయితగా పరిశ్రమలో కొన్ని సినిమాలకి పనిచేశారు. అయితే కరుణానిధి, ఎంజీఆర్ కలిసే ఉండేవారు, కానీ కొన్ని విభేదాల కారణంగా ఇద్దరూ విడిపోయారు, ఎంజీఆర్ వేరే పార్టీ పెట్టారు, తరువాతి కాలంలో ముఖ్యమంత్రి అయ్యారు.
జయలలిత
అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న నటి జయలలిత. అప్పట్లోనే ఆమె అగ్ర నటీమణుల్లో ఒకరిగా చలామణి అయ్యారు. తరువాత ఎం.జి.రామచంద్రన్ తో కొన్ని సినిమాలు చేశాక, ఈ ఇద్దరి జంట హిట్ పెయిర్ గా అభివర్ణించారు. జయలలితని రాజకీయాల్లోకి తీసుకు వచ్చింది కూడా ఎంజీఆర్ అనే చెప్పాలి. మొదట రాజ్యసభలో పార్లమెంట్ సభ్యురాలిగా ప్రవేశించి, తరువాత పార్టీలో ముఖ్యమైన పాత్రని పోషించారు జయలలిత. ఎంజీఆర్ మరణం తరువాత ఆ పార్టీ పగ్గాలు పుచ్చుకొని, ప్రజల అభిమానాన్ని చూరగొని తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన మొదటి మహిళా ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. ప్రజలు అందరూ అభిమానంతో 'అమ్మ' అని పిలుచుకునే జయలలిత, తమిళ నాడు రాజకీయాల్లో ఒక చరిత్ర సృష్టించారు.
ఎన్.టి. రామారావు
ఈ ఇద్దరు తరువాత, తెలుగు చలన చిత్ర పరిశ్రమకి చెందిన ఎన్.టి. రామారావు రాజకీయాల్లోకి రావటమే కాకుండా అతి తక్కువ కాలంలో పార్టీ పెట్టి, ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన ఘనత సాధించి చరిత్ర సృష్టించిన వ్యక్తిగా పేరుపొందారు. కృష్ణుడిగా, రాముడిగా ప్రజల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఎన్టీఆర్ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక అద్వితీయమైన స్థానాన్ని సంపాదించారు. పౌరాణిక, జానపద, సాంఘీక చిత్రాలు ఎన్నో చేసి తెలుగువాళ్ళకు ఎంతో దగ్గరైన నటుల్లో ఎన్టీఆర్ మొదటి స్థానంలో వుంటారు. అంతే కాకుండా ఎన్నో విజయవంతమైన వ్యాపారాత్మక చిత్రాల్లో కూడా నటించి, తనకంటూ ఒక మాస్ ని క్రియేట్ చేసుకున్న నటుడు ఎన్టీఆర్.
అటువంటి ఎన్టీఆర్, 1982 మార్చిలో తెలుగు దేశం పార్టీ స్థాపించి, 1983 జనవరి ఎన్నికల్లో విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి చరిత్ర సృష్టించారు. అప్పటివరకు ఆంధ్రప్రదేశ్ ని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు పరిపాలించారు. ఎన్టీఆర్ మొదటి సారిగా వేరే పార్టీకి చెందిన ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారు. అంతే కాదు ప్రచారాల్లోనూ ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారు. 'చైతన్య రధం' అని ఒక మినీ బస్సులాంటి వెహికల్ ని తయారు చేసి అందులో ప్రజలవద్దకు నేరుగా ప్రయాణించి, ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు పెట్టుకొని, ఆంధ్రప్రదేశ్ మొత్తం తన పార్టీ ప్రచారాలు చేస్తూ తిరిగారు. ఆ చైతన్య రథం నడపటానికి తన కుమారుడు హరికృష్ణనే ఎంచుకున్నారు ఎన్టీఆర్. తెలుగు ప్రజలందరూ అభిమానంగా 'అన్న' గా పిలుచుకునే ఎన్టీఆర్ సినిమా పరిశ్రమలో ఎంత చరిత్ర సృష్టించారో, రాజకీయాల్లో కూడా అంతే చరిత్ర సృష్టించారు.