Tammareddy Bharadwaj: ఎవరో ఒక్కరు చేసిన తప్పుకు.. సీఎంల ముందు ఇండస్ట్రీ చేతులు కట్టుకోవాల్సి వస్తుంది
ABN , Publish Date - Dec 27 , 2024 | 06:08 PM
ఒక్క మనిషి కోసం, ఒకే ఒక్కడి కోసం, ఒకడి ఈగో కోసం ఇంతమంది తలవంచాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన కామెంట్స్ చేశారు. సినిమా ఇండస్ట్రీ పెద్దలు కొందరు గురువారం సీఎం రేవంత్ రెడ్డిని కలవడంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ భేటీపై ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ తమ్మారెడ్డి భరద్వాజ ఏమన్నారంటే..
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఏర్పడిన పరిణామాలపై దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఓ వీడియోను విడుదల చేశారు. సంధ్య థియేటర్ ఘటనను ప్రస్తావిస్తూ, సీఎం రేవంత్ రెడ్డిని సినీ పెద్దలు కలవడంపై ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఆయన ఏమన్నారంటే..
Also Read-Devi Sri Prasad: 'దమ్ముంటే పట్టుకోరా షెకావత్' వెనుక ఏం జరిగిందంటే..
‘‘ఇప్పుడు సినీ ఇండస్ట్రీ అంతా వెళ్లి సీఎంగారి ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సిన అవసరం ఏమోచ్చింది. ఒక్క మనిషి కోసం. ఆ మనిషి సొంతంగా చేశాడా? వేరేలా చేశాడా? అనేది పక్కన పెడితే.. తప్పయితే జరిగింది. ఆయన మర్డర్ చేశాడని నేను అనడం లేదు. ఆయన రోడ్ షో చేయడం కానీ, రోడ్ షోగా వెళ్లడం కానీ, ఇలా ఆయనకు తెలియకుండానే బాధ్యుడయ్యాడు. ఏదయినా కానివ్వండి.. తప్పు తప్పే. ఈ తప్పు జరిగిన తర్వాత దానిని కవర్ చేయడానికి మళ్లీ కొన్ని అబద్దాలు ఆడటంతో.. గవర్నమెంట్ కూడా దీనిని ప్రెస్టీజీయస్‌గా తీసుకోవడం, అలాగే ఆయన కూడా ప్రెస్టీజీయస్‌గా తీసుకోవడంతో పెద్ద వివాదంగా మారిపోయింది. ఫైనల్‌గా ఇండస్ట్రీ పెద్దలందరూ ఇవాళ సీఎం దగ్గరకు వెళ్లాల్సి వచ్చింది. దీనిని కాంప్రమైజ్ అనాలో, లేక తలవంపులు అనాలో.. ఏమనాలో నాకు తెలియదు. ఒక్క మనిషి కోసం, ఒకే ఒక్కడి కోసం, ఒకడి ఈగో కోసం ఇంతమంది తలవంచాల్సిన పరిస్థితి ఏర్పడింది’’ అని తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘‘సినిమా వాళ్లను ఫ్యాన్స్ దేవుళ్లుగా చూస్తారు. దానికి అనుగుణంగా హీరోలు ఎక్కడికి వెళ్లినా నాలుగు కారుల్లో వెళ్లాలి.. రోడ్ షో చేయాలని భావిస్తున్నారు. ఇలాంటివి ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. అలా కాకుండా సైలెంట్‌గా వెళ్లి సినిమా చూసి వచ్చేస్తే ఇలాంటి ఘటనలు జరగడానికి ఆస్కారం తక్కువ ఉంటుంది. గతంలో హీరోలు ఇలాగే చేసేవారు. చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, బాలకృష్ణ వంటి అగ్ర హీరోలు అభిమానులతో సినిమాలు చూసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వాళ్లు సైలెంట్‌గా ఏదో ఒక మల్టీప్లెక్స్‌కు వెళ్లేవారు. సినిమా చూసేవారు. బయటకు వచ్చే సమయంలో అక్కడ ఉన్నవారితో కాసేపు మాట్లాడేవారు. ఒకవేళ సింగిల్ స్క్రీన్ థియేటర్‌కు వెళ్లాల్సి వచ్చినా.. ఎవరికీ చెప్పకుండా థియేటర్‌కు వెళ్లి సినిమా చూసి వచ్చేసేవారు. ఇప్పుడలాంటి పరిస్థితి లేదు.. సామాజిక మాధ్యమాల వల్ల ఏ హీరో ఎప్పుడు ఎక్కడ ఉంటున్నాడు అనే విషయం అభిమానులకు త్వరగా తెలిసిపోతుంది. దీంతో హీరోలను చూసేందుకు భారీ స్థాయిలోనే అభిమానులు తరలివస్తున్నారు. ఫ్యాన్స్, ప్రజా శ్రేయస్సు గురించి కూడా హీరోలు ఆలోచించాలి..’’ అంటూ హీరోలకు ఆయన హితబోధ చేశారు.