మానవత్వపు మట్టిని వొళ్ళంతా పూసుకుందాం! చిన వీరభద్రుడి రచనలకే అగ్ర తాంబూలం

ABN , Publish Date - Mar 19 , 2024 | 08:30 AM

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఆస్కార్ సినిమా ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం ప్రారంభ సమయంలో పురాణపండ శ్రీనివాస్ ఒక్కరికే ఫోటో పెట్టి మరీ స్పెషల్ థాంక్స్ చెప్పడం మామూలు విషయం కాదని... పన్నెండు సినిమాలతో ఘన విజయాలు పొందిన రాజమౌళి పురాణపండ శ్రీనివాస్ ఒక్కడికే కృతజ్ఞతలు చెప్పడం కనిపిస్తుందని... ఆ స్థాయికి శ్రీనివాస్ పేరు తెచ్చుకోవడం గొప్ప విషయం.

మానవత్వపు మట్టిని వొళ్ళంతా పూసుకుందాం! చిన వీరభద్రుడి రచనలకే అగ్ర తాంబూలం

రాజమహేంద్రవరం: కవిత్వాన్ని వెతుక్కుంటూ వచ్చే వారికి రాజమహేంద్రవరం గౌతమీ గ్రంధాలయంలో నడిచినంతమేరా కవిత్వం దొరికేది. గ్రంధాలయ సమయాలు మాత్రమే కాకుండా వేకువ నుండి నడి రాత్రి వరకూ విభిన్న వాదాల కవులందరూ గ్రంధాలయం ముందున్న బొగడ చెట్టు క్రింద ఇజాలకు తావులేకుండా ఆత్మీయంగా కవిత్వాన్ని రాశులు రాశులుగా పోసేవారు. ఆ సౌందర్యం నుంచి వచ్చిన వారే విఖ్యాత కవులు సన్నిధానం శర్మ, క్రొత్తపల్లి సత్య శ్రీమన్నారాయణ, వాడ్రేవు చినవీరభద్రుడు (Vadrevu Chinaveera Bhadrudu), గంధం నాగ సుబ్రహ్మణ్యం, కవులూరి గోపీచంద్, మల్లాప్రగడ, సి.వి.ఎస్. మహేశ్వర్, ఎమ్మెస్ సూర్యనారాయణ, తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి , వసీరా, సతీష్ చందర్ (Satish Chander), నామాడి శ్రీధర్ (Namadi Sreedhar), కొప్పర్తి, పురాణపండ శ్రీనివాస్, పెమ్మరాజు గోపాలకృష్ణ, వంక బాల సుబ్రహ్మణ్యం, సూర్యవంశీ, ముప్పిడి ప్రభాకర్ రావు, ఒమ్మి రమేష్ బాబు, శక్తి, సాధనాల వెంకట స్వామి నాయుడు, బమ్మిడి జగదీశ్వర రావు, కె. ఎం. వెస్లీ, చాగంటి శరత్ బాబు, ఎర్రాప్రగడ రామకృష్ణ , వాసిరెడ్డి పద్మ, గౌరీ చందర్, ఎంవీఎస్ పద్మావతి తదితర ప్రముఖులెందరో ఈ చెట్టు క్రింద నుంచే కవిత్వ అనుభూతుల్ని, కథా సంతోషాల్ని ఎంతో ప్రేమగా తెలుగు రాష్ట్రాల నలుదిక్కులా పంచేవారని, ఇప్పుడు ఆ జ్ఞాపకాలతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది గానీ, తరువాతి కాలంలో అద్భుతాలు చేసే వ్యక్తులు కరువయ్యారని... ఇటీవల గతకాలపు మేధో సమాజం రాజమహేంద్రవరం పుష్కరఘాట్లో ఆవేదనని వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇప్పటి మనుషుల్లో డెబ్భై శాతం స్వచ్చతలు శుష్కించి పోయాయని, మళ్ళీ గౌతమీ గ్రంధాలయ సూర్యకాంతిలో కవిత్వాన్ని మూటకట్టుకుని జీవన సాఫల్యం పొందే రోజులు వస్తాయా? అనిపిస్తోందని పెద్దతరం సమాజం విచారం వ్యక్తం చేస్తోంది.

విశ్వనాధ జగన్నాధ ఘనాపాటి, రేమెళ్ళ సూర్యప్రకాశ శాస్త్రి, మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి, మల్లంపల్లి శరభేశ్వర శర్మ ఆర్ . ఎం. చల్లా, పురాణపండ రాధాకృష్ణమూర్తి, మధిర కృష్ణ మూర్తి శాస్త్రి, ఆరెస్ సుదర్శనం, పోతుకూచి సూర్యనారాయణమూర్తి, పడాల రామారావు, ఆర్బీ పెండ్యాల, కొత్తపల్లి వీరభద్రరావు, బేతవోలు రామ బ్రహ్మం, ఆవంత్స సోమసుందర్, అద్దేపల్లి రామ మోహన రావు , మిరియాల రామకృష్ణ చిర్రావూరి శ్రీరామశర్మ, గాడేపల్లి కుక్కుటేశ్వర రావు, ఆర్వీయస్ సుందరం, యాకూబ్ వంటి అద్భుత కవి దిగ్గజాలతో, ఘనాపాఠీలతో, ఆధ్యాత్మిక వేత్తలతో, అనుష్టానపరులతో, జ్యోతిష పండితులతో, విజ్ఞాన వేత్తలతో, సాహితీ వేత్తలు అప్పుడప్పుడిచ్చే అతి విలువైన ప్రసంగాలతో గౌతమీ గ్రంధాలయపు (Gowthami Library) బాబాయమ్మ హాల్ ప్రాంగణం పులకించిపోయేదని ... ఇప్పుడు సగం శాతం సభలు సొంత డబ్బాలకే పరిమితమయ్యాయని విజ్ఞులైన రసజ్ఞులు పేర్కొంటున్నారు.

Vadrevu-chinaveera-bhadrudu.jpg

‘సాహితీ వేదిక’ సంస్థ అత్యద్భుతమైన సాహితీ సమావేశాలు నిరాడంబర వాతావరణంలో నిర్వహించి చరిత్రకెక్కింది. ఈ చర్చలు, కవిత్వగోష్టులు గ్రంధాలయం వెనుక వున్న వ్యాయామ కళాశాలలో తేనెమరకల్లా నిలిచిపోయాయి. ఆరెస్ సుదర్శనం మాస్టారి ప్రోత్సాహం, ఆయన సాహిత్య విద్వత్తు కొలవలేనిది. సన్నిధానం శర్మ, శ్రీమన్నారాయణ సారధ్యంలో పాత కొత్తల మేలుకలయికగా శరన్మండలి సంస్థ నిర్వహించిన వికసించే పుష్పాల సువాసనల్లాంటి సభలు మరువగలమా అని సీనియర్ సిటిజన్స్ వాపోయారు. ఆంధ్రకేసరి యువజన సమితి ద్వారా వై.ఎస్. నరసింహారావు చేసిన కృషి అసాధారణం. గౌతమీ గ్రంధాలయ స్పర్శకోసం వచ్చిన ఆరుద్ర, వెల్చేరు నారాయణ రావు, ఆచార్య సి.నారాయణ రెడ్డి, చలసాని ప్రసాద్, భైరవయ్య, నగ్నముని వంటి యోధులైన కవులిచ్చిన ప్రసంగాల్ని మర్చిపోలేమంటున్నారు. ఈ సభల కోసం సన్నిధానం శర్మ (Sannidhanam Sarma) పడే తపన మరువలేనిది.

తరువాయి క్రమంలో పురాణపండ శ్రీనివాస్, మోచెర్ల సురేష్‌ల సారధ్యంలో వచ్చిన ‘జీవన సాహితి’ సంస్థ చేసిన సందడి అంతా ఇంతా కాదనే చెప్పాల్సొస్తుందంటున్నారు. నిశ్శబ్దంలోంచి శబ్దంలా వచ్చే పురాణపండ శ్రీనివాస్ స్వచ్ఛమైన గల గలల అలజడితో గ్రంధాలయమంతా విభిన్న సిద్ధాంతాలవారితోనూ కలియ తిరిగి సభలు, సమావేశాలు ఉత్సాహంతో నిర్వహించేవాడని, లౌక్యం తెలియక శ్రీనివాస్ సొంత ఊరినే వదులుకున్నాగానీ ... ఇప్పుడు దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి (SS Rajamouli) ఆస్కార్ సినిమా ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం ప్రారంభ సమయంలో పురాణపండ శ్రీనివాస్ (Puranapanda Srinivas) ఒక్కరికే ఫోటో పెట్టి మరీ స్పెషల్ థాంక్స్ చెప్పడం మామూలు విషయం కాదని... పన్నెండు సినిమాలతో ఘన విజయాలు పొందిన రాజమౌళి పురాణపండ శ్రీనివాస్ ఒక్కడికే కృతజ్ఞతలు చెప్పడం కనిపిస్తుందని... ఆ స్థాయికి శ్రీనివాస్ ఎదిగి... తనని వెక్కిరించే వారి గూబ గుయ్యి మనిపించాడని ముచ్చటించుకుంటున్నారు. పురాణపండ శ్రీనివాస్ బుక్స్ భారతదేశ హోమ్ శాఖామంత్రి అమిత్ షా వరకూ వెళ్లడం, అభినందనల ప్రసంగాలు అందుకోవడం కూడా మామూలు విషయం కానేకాదు. అతని నిర్విరామ ఒంటరి ప్రయాణంలోని ఘన విజయాలు దైవబలము, స్వయంప్రతిభేనంటున్నారు.

Puranapanda.jpg

నడిచే విజ్ఞాన సర్వస్వంగా రాజమహేంద్రవరంలోని అన్ని తరాలవారూ పిలుచుకునే పోతుకూచి సూర్యనారాయణమూర్తి స్థాపించిన ‘సాహిత్య గౌతమీ’ నిర్వహించిన సభలూ అజరామరం. చైతన్య వేదిక సంస్థ ద్వారా వాసిరెడ్డి పద్మ నిర్వహించిన విప్లవాత్మక సభలు కూడా ఇంకా గుర్తేనంటున్నారు. ఇప్పటికీ, ఎప్పటికీ వీరిలో ఎక్కువ కవుల ఫాలోయింగ్ వున్నది వాడ్రేవు చిన వీరభద్రుడికే అనేది నిర్వివాదాంశంగా పేర్కొనాల్సిందే. గత రెండు దశాబ్దాలుగా గౌతమీ గ్రంధాలయంలో సాహిత్య సభలు సరైన కాంతిని ప్రసరింప చెయ్యలేకపోతున్నాయన్న వాదనా వినిపిస్తోంది. ఇరవై ఏళ్ళ వెనుక ఎన్ని పనులున్నా వదిలిపెట్టి ... సాయంకాలమైతే చాలు గౌతమీ గ్రంథాలయానికి చేరి కవిత్వ సాహిత్య భాషలో స్థిరపడి సంతోష సంరంభాల్ని పంచేవారనేకులుండేవారు.

యదార్ధం చెప్పాలంటే మనం అద్భుతమైన బంధాల్ని వదులుకుని బ్రతుకుతున్నామని, కవిత్వ సాహిత్య సభలకోసం చేతులు చాచి... సొంత డబ్బాలకు దూరంగా గౌతమీ గ్రంధాలయ సరస్వతిని ప్రార్ధించాలని పెద్దలు పదే పదే చెబుతున్నారు. ఇలాంటి సభల్లో, చర్చల్లో, కవి సమ్మేళనాలలో మానవత్వం దొరుకుతుందని... ఈ మానవత్వపు మట్టిని వొళ్ళంతా పూసుకున్న వారికి వుండే ఆనందం మరే రంగంలో రాదనీ బాహాటంగా చెబుతున్నారు.

veera.jpg

ఈ తరం ఈ ఫాల్గుణ మాసపు సాయంకాలాల్లో కవిత్వపు పూతతో గౌతమీ గ్రంధాలయ ఆవరణలోని బొగడ చెట్టు చుట్టూ సాహిత్యపు పరిమళాల్ని వెదజల్లడం వారికే ఆరోగ్యకరమని పెద్దతరం ఉవాచ. సరిహద్దులు చెరుపుకుని ఈ సౌందర్య గ్రంధాలయ సీమలో సభల సంరంభానికి తెరలేపమని పెద్దలు విజ్ఞప్తి చేయడం క్రొత్త తరాలకు వేసవి చందనం లాంటి అందమైన పిలుపే!

Updated Date - Mar 19 , 2024 | 08:53 AM