48 గంటల్లో యూట్యూబ్‌ లింకులు తొలగించండి

ABN , Publish Date - Oct 11 , 2024 | 06:43 AM

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) అధ్యక్షుడు, సినీ హీరో, నిర్మాత మంచు విష్ణు పేరు, ఆయన గొంతు, తీసిన సినిమాలను ప్రత్యక్షంగా, పరోక్షంగా దుర్వినియోగం చేయొద్దని యూట్యూబర్లను ఢిల్లీ హైకోర్టు హెచ్చరించింది. మంచు విష్ణుకు సంబంధించి...

  • మంచు విష్ణుపై అభ్యంతరకర వీడియోలు, కటెంట్‌ను తొలగించండి

  • ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) అధ్యక్షుడు, సినీ హీరో, నిర్మాత మంచు విష్ణు పేరు, ఆయన గొంతు, తీసిన సినిమాలను ప్రత్యక్షంగా, పరోక్షంగా దుర్వినియోగం చేయొద్దని యూట్యూబర్లను ఢిల్లీ హైకోర్టు హెచ్చరించింది. మంచు విష్ణుకు సంబంధించి అభ్యంతరక విడియోలు, కంటెంట్‌ 48 గంటల్లో తొలగించాలని కేంద్ర టెలి కమ్యూనికేషన్స్‌, ఎలక్ర్టానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలను న్యాయస్థానం ఆదేశించింది. తన పేరు, గొంతు, సినిమాలను ప్రత్యక్షంగా, పరోక్ష్యంగా యూట్యూబర్లు వాడుతూ తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని ఆరోపిస్తూ ఢిల్లీ హైకోర్టులో మంచు విష్ణు పరువు నష్టం దావా కేసు వేశారు. ఆ పిటిషన్‌పై గురువారం జస్టిస్‌ మిని పుష్కర్ణ విచారణ చేపట్టారు. ఇరుపక్షాల వాదనల తర్వాత మంచు విష్ణుకు మధ్యంతర రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఒక వ్యక్తి ప్రతిష్టకు భంగం కలిగించే హక్కు మరొకరికి లేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. మంచు విష్ణుకు అభ్యంతరకరంగా ఉన్న కంటెంట్‌ను వెంటనే తొలిగించాలని తీర్పులో స్పష్టం చేశారు.


ఆయన స్వరం, పేరు, నిర్మించిన సినిమాలను ప్రత్యక్షంగా, పరోక్షంగా దుర్వినియోగం చేయడం సరికాదని హెచ్చరించారు. మంచు విష్ణు వ్యక్తిత్వ, ప్రచార హక్కులను అపహరించడం, దుర్వినియోగం చేయడం వంటివి చేయకూడదని ఆదేశించారు. ఈ తీర్పుతో ప్రముఖ వ్యక్తుల డిజిటల్‌ హక్కులను రక్షించడంలో ఒక కీలక ముందడుగు పడిందని విష్ణు తరపు న్యాయవాది ప్రవీణ్‌ ఆనంద్‌ తెలిపారు.

న్యూఢిల్లీ (ఆంధ్రజ్యోతి)

Updated Date - Oct 11 , 2024 | 08:22 AM