Sandhya Theatre Stampede: వీడియో వదిలి.. అల్లు అర్జున్‌కి షాకిచ్చిన పోలీసులు
ABN , Publish Date - Dec 22 , 2024 | 05:44 PM
సంధ్య థియేటర్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను అల్లు అర్జున్ తప్పుడు వ్యాఖ్యలుగా కొట్టేయడంతో.. తాజాగా పోలీసులు అసలు ఆరోజు ఏం జరిగిందో తెలిపేలా ఓ వీడియోను విడుదల చేసి అల్లు అర్జున్‌కు షాక్ ఇచ్చారు.
‘పుష్ప 2’ ప్రీమియర్ నిమిత్తం సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ ఘటనలో హీరో అల్లు అర్జున్ నిర్లక్ష్యం ఉందని శనివారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పాగా.. రేవంత్ రెడ్డి తనపై తప్పుడు ఆరోపణలు చేశారని అల్లు అర్జున్ మీడియా సమావేశంలో వివరణ ఇవ్వడంతో.. అంతా కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్‌గా మారింది. అయితే అసలు ఆ రోజు ఏ జరిగిందో.. సీఎం రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ చెబుతున్న విషయంలో వాస్తవం ఎవరిదో తెలిపేలా పోలీసులు ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోతో నిజంగా అల్లు అర్జున్‌కి పోలీసులు షాకిచ్చారు.
Also Read-Allu Arjun Press Meet: సీఎం రేవంత్ వ్యాఖ్యలపై అల్లు అర్జున్ ఏమన్నారంటే..
థియేటర్‌లో ఉన్న అల్లు అర్జున్‌కు పోలీసులు ఓ మహిళ మృతి చెందిందనే విషయాన్ని తెలియజేశారని సీఎం రేవంత్ రెడ్డి శాసనసభ వేదికగా ప్రకటించగా.. అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. తనకు మహిళ చనిపోయిన విషయం మరుసటి రోజు తెలిసిందని చెప్పారు. ఈ విషయంపై పోలీసులు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆరోజు విధుల్లో ఉన్న ఏసీపీ, డీసీపీతో కలిసి సీపీ సీవీ ఆనంద్ మీడియా సమావేశం నిర్వహించారు. డిసెంబర్4 రాత్రి సంథ్య థియేటర్ సమీపంలో భారీగా ఫ్యాన్స్ తరలిరావడంతో తొక్కిసలాట జరిగిందని, ఆ సమయంలో థియేటర్ మేనేజర్ నిర్లక్ష్యంగా వ్యవహారించారని పోలీసులు తెలిపారు. ఘటన నేపథ్యంలో బాలుడికి పోలీసులు సీపీఆర్ చేసిన తీరును వీడియోలో చూపించారు. కేసుకు సంబంధించి విచారణ జరుగుతోందని హైకోర్టులో కేసు ఉండటంతో ఎక్కువ విషయాలు కేసు గురించి మాట్లాడలేమని సీపీ తెలిపారు.
పోలీసులు ఏం చెప్పారంటే..
డిసెంబర్ 4వ తేదీన సంధ్య థియేటర్‌కు అల్లు అర్జున్ రావడంతో భారీగా అభిమానులు తరలివచ్చారు. థియేటర్ లోపలకు వెళ్లేందుకు, హీరోను చూసేందుకు ఫ్యాన్స్ ప్రయత్నించడంతో తోపులాట జరిగింది. ఈ తోపులాటలో దురదృష్టవశాత్తు ఓ మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారనే విషయాన్ని అల్లు అర్జున్ మేనేజర్ సంతోష్‌కు చెప్పాం. అల్లు అర్జున్‌కు విషయం చెప్పేందుకు ప్రయత్నించగా థియేటర్ యాజమాన్యం, మేనేజర్ అంగీకరించలేదు, తాము సమాచారం చేరవేస్తామని చెప్పి చేరవేయలేదు. అక్కడ తొక్కిసలాట తర్వాత థియేటర్ నుంచి బయటకు వెళ్లిపోవాలని అల్లు అర్జున్‌కు ఎంత చెప్పినా వినిపించుకోలేదు. డీసీపీ ఆదేశాలతో మేము అల్లు అర్జున్ దగ్గరకు వెళ్లి విషయం చెప్పాం. సినిమా చూసిన తర్వాత వెళ్తానని చెప్పారు. ఆ తర్వాత 10 నుంచి 15 నిమిషాల సమయం ఇచ్చాం. చివరకు డీసీపీతో వెళ్లి అల్లు అర్జున్‌ను బయటకు తీసుకువచ్చాం’’ అని పోలీసులు తెలిపారు.