Pawan Kalyan: రామ్ గోపాల్ వర్మ అరెస్ట్‌కై.. నేను చేయాల్సింది చేస్తా..
ABN , Publish Date - Nov 26 , 2024 | 05:01 PM
ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ కోసం పోలీసులు గాలిస్తున్న విషయం తెలిసిందే. వర్మ పోలీసులకు దొరకకుండా పరారీలో ఉన్నారు. అయితే ఈ విషయంపై తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే..
సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) కోసం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా పోలీసులు రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా గాలిస్తున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ మినిస్టర్ నారా లోకేష్‌లపై అసభ్యకర పోస్టుల కేసులో రామ్‌గోపాల్ వర్మ ఒంగోలు రూరల్ పోలీసు స్టేషన్‌లో హాజరుకావాల్సి ఉండగా.. డుమ్మా కొట్టారు. దీంతో ప్రకాశం జిల్లా పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి వర్మను అరెస్టు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు. పలువురు కేంద్రమంత్రులను కలుస్తున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ వేదికగా మీడియాతో ప్రసంగిస్తూ.. వర్మ అరెస్ట్‌కు సంబంధించి జరుగుతున్న ప్రయత్నాలపై కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారు.
Also Read- Samantha Fire: విడాకులు తీసుకుంటే.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా..
ఆయన మాట్లాడుతూ.. ‘‘రామ్ గోపాల్ వర్మతో పాటు పలువురికి నోటీసులు ఇచ్చినా విచారణకు రాకపోవడంపై ఇప్పుడే స్పందించను. ఈ కేసు విషయంలో పోలీసులను పని చేసుకొనివ్వండి. నా పని నేను చేస్తాను... పోలీసుల సామర్థ్యంపై నేనేమీ స్పందించను. హోంశాఖ, లా అండ్ ఆర్డర్ నా పరిధిలో లేవు. మీరు అడగాల్సింది ముఖ్యమంత్రిని. నేను ఏం మాట్లాడినా బాధ్యతగా మాట్లాడాలి. మీరు చెప్పిన అన్ని అంశాలు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారిని పట్టుకోవడానికి ఎందుకు తటపటాయిస్తున్నారని ఢిల్లీ మీడియా నన్ను అడిగిందని సీఎం చంద్రబాబుకు చెబుతాను’’ అని పవన్ కళ్యాణ్ అక్కడి మీడియాకు సమాధానమిచ్చారు.
పరారీలో రామ్ గోపాల్ వర్మ
ఇదిలా ఉండగా.. రామ్ గోపాల్ వర్మ పరారీలో ఉన్నట్లుగా తెలుస్తుంది. వర్మను అరెస్ట్ చేయడానికి ఆయన నివాసం వద్దకు వెళ్లగా.. అక్కడ వర్మ లేకపోవడంతో పోలీసులు వెనుదిరిగారు. ప్రస్తుతం ఆయన కోసం పోలీసులు గాలిస్తుండగా.. పోలీసులు ఇచ్చిన నోటీసులకు వర్మ తన లాయర్ ద్వారా ముందస్తు బెయిల్‌గా అప్లయ్ చేశారు. ముందుస్తుగా ఉన్న షూటింగ్ షెడ్యూల్స్ వల్ల తాను హాజరుకాలేక పోతున్నానని తెలిపిన వర్మ.. తనకు రెండు వారాల పాటు సమయం ఇవ్వాలని కోరారు. ఆర్జీవీ ముందస్తు బెయిల్‌పై హైకోర్టులో విచారణ జరుగుతోంది.