Pawan Kalyan: అల్లు అర్జున్ అరెస్ట్‌పై పవన్ కళ్యాణ్ ఎలా స్పందించారంటే..
ABN , Publish Date - Dec 28 , 2024 | 04:22 PM
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్‌పై ఇప్పటి వరకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించలేదంటూ కొందరు కామెంట్స్ చేస్తున్న నేపథ్యంలో.. శనివారం కడప టూర్లో ఉన్న పవన్ కళ్యాణ్ ఈ విషయంపై స్పందిస్తూ.. చురకలు అంటించారు. విషయంలోకి వస్తే..
ఇటీవల సంధ్య థియేటర్ ఘటనపై అల్లు అర్జున్‌ని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి షూటింగ్ ఆపుకుని మరీ అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు, మెగా బ్రదర్ నాగబాబు కూడా వెళ్లారు. అరెస్ట్ అయిన మరుసటి రోజు విడుదలైన అల్లు అర్జున్.. చిరంజీవి ఇంటికి, నాగబాబు ఇంటికి ప్రత్యేకంగా వెళ్లివచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ అరెస్ట్‌పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం ఎక్కడా స్పందించలేదు. అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు, పవన్ కళ్యాణ్ కూడా హైదరాబాద్ వస్తున్నారనేలా వార్తలు వచ్చాయి కానీ, ఆయన రాలేదు.
తాజాగా కడప పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్.. కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబును పరామర్శించడానికి వెళ్లారు. ఎంపీడీవో, కుటుంబీకులను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ అరెస్ట్‌పై స్పందించాలంటూ ఓ మీడియా పర్సన్ కోరాడు. దానికి ఆయన స్పందిస్తూ.. ‘‘ఇక్కడ సందర్భం ఏమిటి? దానికి సంబంధించిన రిలవెంట్ ప్రశ్నలు అడగండి.. ఇక్కడ జనాలు చచ్చిపోతే సినిమా గురించి మాట్లాడతారా? కొంచెం పెద్ద మనసుతో ఆలోచించండి.. పెద్దగా ఆలోచించండి. సినిమాల కంటే పెద్ద విషయాలు చాలా ఉన్నాయి.. వాటి గురించి అడగండి. సినిమాలు కాకుండా వేరే విషయాలపై డిబెట్ పెట్టండి. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న అరాచకాల గురించి మాట్లాడండి’’ అంటూ పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు.
Also Read-Tammareddy Bharadwaj: ఎవరో ఒక్కరు చేసిన తప్పుకు.. సీఎంల ముందు ఇండస్ట్రీ చేతులు కట్టుకోవాల్సి వస్తుంది
‘పుష్ప 2’ ప్రీమియర్ నిమిత్తం సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన తెలంగాణ పోలీసులు అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేయడం, ఆ తర్వాత మధ్యంతర బెయిల్‌తో అల్లు అర్జున్ విడుదలవడం అందరికీ తెలిసిన విషయాలే. అల్లు అర్జున్ విడుదలై వచ్చిన తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా ఆయన ఇంటికి చేరుకుని పరామర్శించారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి, హైదరాబాద్ పోలీసులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవడంతో.. పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఇకపై బెనిఫిట్ షోలు, టికెట్ల ధర పెంపు ఉండదని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అల్టీమేటం జారీ చేశారు. ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాల తర్వాత దిల్ రాజు రంగంలోకి దిగి.. పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాలు మొదలు పెట్టారు. సినీ ప్రముఖులు కొందరు గురువారం సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. అంతకు ముందు రోజు దిల్ రాజుని వెంటబెట్టుకుని హాస్పిటల్లో ఉన్న శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్.. ఆ బాబు కుటుంబానికి రెండు కోట్ల రూపాయల పరిహారం ఇస్తున్నట్లుగా ప్రకటించారు. ప్రస్తుతం అల్లు అర్జున్‌పై కేసు మాత్రం అలానే ఉంది.