చరిత్ర సిగలో ‘శ్రీ అమృతేశ్వర ఆలయం’.. రాజమౌళి నైతిక బలం, పురాణపండ మంత్రబలంతో సాయి పయనం
ABN , Publish Date - Jun 10 , 2024 | 12:56 AM
జీవనపోరాటంకోసం... జీవన వ్యాపారం కోసం చలనచిత్ర నిర్మాణం చేపట్టి ప్రశంసలు, ఆర్ధిక అంశాలు అందుకోవడం ఒక ఎత్తయితే.., జీవితానికి ఏది లక్ష్యమో.. లక్షల భక్తుల ప్రయోజనాలు నెరవేర్చడానికి ఏది అవసరమో.. ఆ దిశగా ఎన్నో కష్టాలకోర్చి సాయి కొర్రపాటి ‘శ్రీ అమృతేశ్వర ఆలయం’ను ఈ జాతికి అంకితం చేయడం మామూలు విషయం కానేకాదు. ఇందుకు పెద్దన్నగా భుజం చరిచి మేమున్నామని ముందుకు నడిపించే రాజమౌళి, రమా రాజమౌళి దంపతుల ఆదర్శంతో పాటు, సాయి కొర్రపాటిలో శివసంకల్పం కలగడానికి కారణమైన రచయిత పురాణపండ శ్రీనివాస్‌లను అభినందించక తప్పదు.
‘ఈగ’ వంటి విలక్షణ చిత్రాన్ని సృజించిన నిర్మాతగా, వారాహి చలన చిత్రం అధినేతగా లక్షలమందికి చిరపరిచితులైన సాయి కొర్రపాటి తన అనితరసాధ్యమైన సంకల్పంతో శివ భక్తి బాట పట్టి, జీవకళ ఉట్టిపడే కళాత్మక శిల్పాలతో బళ్లారి మహానగరంలో నిర్మించిన ‘శ్రీ అమృతేశ్వర ఆలయం’ కన్నడ తెలుగు సీమల్లో ఒక భక్తి సౌందర్యపు అనర్ఘరత్నంగా కాంతులీనుతోందని రెండురోజులుగా ఢిల్లీ నగరంలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో సైతం రాజకీయనేతలు, అధికారులు చర్చించుకోవడం గమనార్హం.
దీనికి కారణమేమంటే... ప్రముఖ రచయిత, కార్యదక్షాశీలి పురాణపండ శ్రీనివాస్ అమోఘ రచనా సంకలనం ‘స్మరామి ... స్మరామి’ గ్రంధాన్ని తెలుగువారికి ఆంధ్రప్రదేశ్ భవన్‌లో తెలుగుదేశం పార్టీ ప్రముఖులు పంచిన సందర్భంలో ఈ పవిత్ర వార్తకు ప్రాధాన్యత ఏర్పడి సాయి కొర్రపాటి దేశంలో మొదటిసారిగా కృష్ణ శిలతో నిర్మించిన ఏకైక ఆలయంగా ‘శ్రీ అమృతేశ్వర ఆలయం’ వైభవం గురించిన చర్చ జరగడం ప్రత్యేకతను సంతరించుకుంది.
ఆస్కార్ వేదికపై ప్రత్యేక ముద్రవేసిన దర్శక ధీరోదాత్తుడు, సామాజిక నిబద్ధతకు కళాత్మకంగా పట్టంకట్టే సృజనాత్మక పరిశోధనాత్మక ప్రతిభాశాలి, అలుపెరుగక పరిశ్రమించే ఎస్ఎస్ రాజమోళి, రమా రాజమౌళి దంపతులను అమృతమయ హృదయమున్న ఆత్మబంధువులుగా సాయి కొర్రపాటి ఎంతో గౌరవిస్తారన్న విషయం యావత్ తెలుగు చలన చిత్ర పరిశ్రమకే కాదు కన్నడ సీమకు కూడా తెలుసున్న విశేషమే. రాజమౌళి, రమా రాజమౌళి దంపతులు సైతం సాయి కొర్రపాటి ఫ్యామిలీని కూడా బంధువులకంటే మిన్నగా చూస్తారనేది కూడా తెలిసిన విషయమే.
నూటికి నూరు పాళ్ళూ మనసు ఉవ్విళ్లూరే ఆకర్షణీయ మసాలా ప్రపంచంలో సినిమాలు నిర్మించే సాయి కొర్రపాటి ఈ ఉదాత్త కార్యాన్ని భుజాలపై ఎత్తుకుని.. ఒక తపనతో ఈ ‘శ్రీ అమృతేశ్వర ఆలయం’ను అతి అరుదైన కృష్ణ శిలతో నిర్మించారని, ఈ ఆలయ నిర్మాణం కోసం సాయి కొర్రపాటి చేసిన కృషి, అహోరాత్రాలు పట్టుదలతో శ్రమించి వందకు పైగా కార్మికులతో ఈ అద్భుతాన్ని అందించినట్లు సన్నిహితులు చెబుతున్నారు.
సుమారు ఇరవై ఐదు కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ అమృతేశ్వర ఆలయాన్ని ఇంత అమోఘంగా, పవిత్రంగా నిర్మించాలన్న గట్టి సంకల్పం సాయి కొర్రపాటికి కలగడానికి ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ పరిచయమే కారణమని ఇటీవల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కమిటీలో కొందరు ప్రముఖులు సైతం ఫిలింనగర్‌లో ప్రశంసలతో చర్చించుకోవడం గమనార్హం.
సుమారు దశాబ్దకాలంనుంచీ సాయి కొర్రపాటికి అత్యంత సన్నిహిత స్నేహితులైన ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ ఎన్నెన్నో వేదాది విద్యల బలాల మంత్రపేటికలను వందలకొలది దేవాలయాలకు అత్యంత ప్రతిభా సంపన్నంగా అందించి.. జ్ఞానమహాయజ్ఞకేంద్రం ఆధ్యాత్మిక ప్రచురణల సంస్థకు దైవీయ చైతన్యంతో ఊపిరి పోసిన పవిత్ర వ్యక్తిత్వ విజేతగా లక్షలకొలది భక్త పాఠకులకు ఎరుకే.
అత్యద్భుత రచనల్ని, సంకలనాల్ని యజ్ఞభావనతో అందించే పురాణపండ శ్రీనివాస్ పుస్తకాల్లోని జీవితానందాన్ని అన్వేషించి.. ఆస్వాదించి.. స్వశక్తినే దైవబలంగా నమ్ముకుని ముందుకు నడిచే అక్షరశ్రామికులని పాఠకులకు తెలుసున్న అంశమే. ‘ప్రతిభ, మేధ, కార్యకుశలత, దక్షత, కఠోర పరిశ్రమ, బలమైన వ్యక్తిత్వం, మానవత్వం’.. ఇవే పురాణపండ శ్రీనివాస్‌కి ఆకర్షణీయమైన పరిమళాలు. ఎప్పటికప్పుడు ఉన్నత, ఉత్తమ లక్ష్యాల్ని దైవగ్రంధాలకోసం నిర్దేశించుకునే పురాణపండ శ్రీనివాస్‌కి ప్రధానమైన కవచం ఆయనలోని నిస్వార్థసేవ. ఈ సుదృఢమైన వెలుగు వల్లనే శ్రీనివాస్ రచనల్ని వివిధ సందర్భాల్లో తెలుగునాట నాటి నుంచి నిన్నటి వరకు సమర్ధ సేవలతో కీర్తి గడించిన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖరరెడ్డి, కొణిజేటి రోశయ్య, కేసీఆర్, జగన్ మోహన్ రెడ్డిలు ఆవిష్కరించి అభినందించారు కూడా.
జీవనయానంలో అడుగడుగునా సవాళ్లెదుర్కొన్న పురాణపండ శ్రీనివాస్ పరిచయ సమృద్ధి వల్లనే సాయి కొర్రపాటి ఈ అపురూప ఆలయ నిర్మాణానికి తెర లేపారని వారాహి చలన చిత్రం ఉద్యోగులు సైతం గొంతెత్తి చెబుతున్నారు. తనకి చలన చిత్రవైభవాలతో దిశానిర్దేశం చేసిన రాజమౌళి వల్ల సాయి కొర్రపాటి ఈ దేశానికి ‘ఈగ’ ద్వారా గొప్ప నిర్మాతగా పరిచయమైతే.. దైవబలం మాత్రమే ఉండి, ఆర్ధిక బలం అస్సలు లేని పవిత్ర అఖండ గ్రంధాల రచయిత, సంకలనకర్త పురాణపండ శ్రీనివాస్ స్నేహబలం కారణంగానే సాయి కొర్రపాటి కొన్నాళ్ళు తన సినీ ప్రయాణాన్ని కూడా ప్రక్కకు పెట్టి.. ఈ ఘనతల, శిల్పసౌందర్యాల అరుదైన మహాలయాన్ని నిర్మించడం గొప్ప విషయంగానే కాకుండా.. రేపటి చరిత్ర కూడా సాయి కొర్రపాటి వంశాన్ని కీర్తిస్తుందని చెప్పక తప్పదు.
‘చలన చిత్రాలు తియ్యకుండా ఏమిటీ భక్తి పిచ్చి’.. అని సాయి కొర్రపాటిని ప్రక్కనే, వెనుకనే విమర్శించిన వారూ లేకపోలేదు. అయినా మొక్కవోని సంకల్పంతో ఈ కృష్ణ శిలల నిర్మాణాన్ని అద్భుతంగా అందించారు సాయి. చలనచిత్రరంగంలో సాయి కంటే బడా నిర్మాతలున్నారు. సాయి కంటే గొప్ప సినిమాలు తీసిన వారున్నారు. కానీ.. ఒక తెలుగు సినీ నిర్మాత దక్షిణ భారతదేశ చరిత్రలో నిలిచేలా చాలా గొప్ప ఆలయాన్ని ‘శ్రీ అమృతేశ్వర ఆలయం’గా అందించిన ఘనత నిస్సందేహంగా సాయి కొర్రపాటిదే.
ఇటీవల బృహదీశ్వరాలయాన్ని.. ఈ ఆలయ మహా వైభవాన్ని ప్రశంసిస్తూ రాజమోళి పెట్టిన ట్వీట్ సంచలనం సృష్టించిందన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ తరువాత రాజమౌళి ఎంతో ప్రశాంతంగా పాల్గొన్న భక్తి కార్యక్రమం సాయి కొర్రపాటి నిర్మించిన ‘శ్రీ అమృతేశ్వర ఆలయం’ ప్రారంభోత్సవమే కావచ్చు. ఈ ఆలయ ప్రారంభవేడుకలో నిగ నిగలాడుతున్న ఆలయ గోపుర విశేషాన్ని రాజమౌళి ఎంతో భక్తితో మోస్తూన్న రమణీయ దృశ్యాన్ని పురాణపండ శ్రీనివాస్ ‘స్మరామి ... స్మరామి’ గ్రంధంలో భక్తిరసభరితంగా ప్రచురించడంతో న్యూ ఢిల్లీలో తెలుగుదేశం వర్గీయులు, అధికారులు, కొందరు భారతీయ జనతాపార్టీ ప్రముఖులు ఈ ఆలయం గురించి సుమారు అరగంటకు పైగా చర్చించుకోవడం విశేషం.
ఏది ఏమైనా జీవనపోరాటంకోసం.. జీవన వ్యాపారం కోసం చలనచిత్ర నిర్మాణం చేపట్టి ప్రశంసలు, ఆర్ధిక అంశాలు అందుకోవడం ఒక ఎత్తయితే అవ్వచ్చు. కానీ.. జీవితానికి ఏది లక్ష్యమో.. లక్షల భక్తుల ప్రయోజనాలు నెరవేర్చడానికి ఏది అవసరమో.. ఆ దిశగా ఎన్నో కష్టాలకోర్చి సాయి కొర్రపాటి ఇంతటి ఘనమైన శివాలయాన్ని ఈ జాతికి అంకితం చెయ్యడం మామూలు విషయం కానేకాదు. సాయి కొర్రపాటికి పెద్దన్నగా భుజం చరిచి మేమున్నామని ముందుకు నడిపించే రాజమౌళి, రమా రాజమౌళి దంపతుల ఆదర్శం సాక్షిగా.. ఏ స్వార్ధం లేకుండా ఈ మహోన్నత మహా కార్యానికి సాయి కొర్రపాటిలో శివసంకల్పం కలగడానికి బలమైన కారణంగా ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్‌ని కూడా అభినందించక తప్పదు.
భారతదేశ ఆలయాల చరిత్రలో నిస్సందేహంగా ఒక పేజీ సాయి కొర్రపాటి నిర్మించిన అతి అరుదైన ‘శ్రీ అమృతేశ్వర ఆలయం’కు శివుడు కేటాయిస్తాడని ఇప్పటికే విజ్ఞులంటున్నారు. ఇది శివాజ్ఞ కాక మరేమిటని కొందరు సినీ ప్రముఖులు సైతం చర్చించుకుంటున్నారు. నిజం చెప్పాల్సి వస్తే.. ఇరవై ఐదు కోట్లతో నిర్మించిన దివ్య దేవాలయంలో అద్భుతాల స్వచ్ఛ స్పటిక లింగ వైభవాన్ని, ప్రాభవాన్ని ఒక తెలుగు సినీ నిర్మాత నిర్మించడం సంచలనాత్మకమే. సాయి కొర్రపాటి ఈ అదృష్టం సాధించడాన్ని రేపటి భక్త జన సముద్రం ఉవ్వెత్తున లేచి మరీ సంతోషంగా చెబుతుందనేది చరిత్ర చెప్పబోయే సత్యం. ఇప్పడిప్పుడే ఈ ఆలయానికి వందల్లోంచి భక్త జనం వేలల్లోకి చేరి ఆలయ మహిమను కీర్తిస్తూ వస్తున్నారుట. ఇంతకంటే సాయి కొర్రపాటి ఏం కావాలి?
ఈ నెల పన్నెండవతేదీన ముఖ్యమంత్రిగా నాల్గవసారి ప్రమాణ స్వీకారం చెయ్యబోయే తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు, ఆయన సతీమణి భువనేశ్వరికి శుభాకాంక్షగా ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ కలం నుండి వర్ణాభరితంగా, స్వర్ణభరితంగా రూపుదిద్దుకున్న ‘స్మరామి ... స్మరామి’ గ్రంథ వితరణ న్యూఢిల్లీ ఆంధ్రప్రదేశ్ భవన్ వద్ద జరగడం వల్ల.. విజ్ఞుల, రాజకీయ మేధావుల చర్చల ‘శ్రీ అమృతేశ్వర ఆలయం’ అందాలన్నీ ఆవిష్కృతమయ్యాయనేది ఆకాశమంత నిజం.