Kasthuri Actress: మూడు రోజుల జైలు జీవితం ఎలా ఉందంటే..
ABN , Publish Date - Dec 08 , 2024 | 01:33 PM
నటి కస్తూరి ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదంగా మారిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యల నిమిత్తం ఆమెను హైదరాబాద్‌లో తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేయటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అరెస్ట్ అనంతరం ఆమె మూడు రోజుల పాటు జైలు జీవితం అనుభవించారు. ఈ జైలు జీవితంపై తాజాగా కస్తూరి స్పందించారు. ఆమె ఏమన్నారంటే..
కస్తూరి.. తెలుగు సినిమాలు, సీరియల్స్ చూసేవారికి సుపరిచితమైన పేరు. ఇటీవల ఓ పొలిటికల్ ఈవెంట్‌లో తెలుగువారిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారనే అభియోగంపై ఆమెను హైదరాబాద్‌లో తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేయటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వృత్తిరీత్యా మళ్లీ హైదరాబాద్‌కు వచ్చిన కస్తూరి.. తన జైలు జీవితం గురించి ఆంధ్రజ్యోతితో పంచుకున్నారు. ఆమె మాట్లాడుతూ..
Also Read- Breaking News: మంచు ఫ్యామిలీలో మంటలు.. మోహన్ బాబు వర్సెస్ మనోజ్
‘‘ఆదివారం అరెస్ట్ చేశారు. బుధవారం బయటకు వచ్చేశా. నేను జైలు లోపలికి వెళ్లక ముందే అక్కడున్న వారందరికీ నేను వస్తున్నానని తెలిసిపోయింది. ‘స్టాలిన్ ఈమెను లోపలికి పంపాడట’ అని వాళ్లు అనుకుంటూ ఉంటే విన్నా. అక్కడ నాకు ఒక స్పెషల్ సెల్ ఇచ్చారు. తొలిసారి వచ్చిన ఖైదీలందరూ దానిలోనే ఉంటారట. నాకు కొత్త పళ్లెం, కొత్త లోటా ఇచ్చారు. జైలు సిబ్బంది బాగా చూసుకున్నారు. ఇక్కడో విషయం చెప్పాలి. జైలు జీవితం సినిమాలో చూపించినట్లు ఉండదు. నేను అనేక సినిమాల్లో, సీరియల్స్‌లో జైలు సీన్లు చేశాను. కానీ నిజమైన జైలు వేరుగా ఉంటుంది.
మరో విషయం ఏమిటంటే... తమిళ ‘బిగ్‌బాస్’లోకి నేను ఒకసారి స్పెషల్ ఎంట్రీగా వెళ్లాను. ఆ సమయంలో ‘బిగ్‌బాస్ జైలు’లో ఉండాల్సి వచ్చింది. వాస్తవానికి అక్కడ కన్నా నిజమైన జైలులోనే బాగుంది. నిజమైన జైలులో ప్రమాదకరమైన వారు ఉంటారు. అమాయకులు కూడా ఉంటారు. భర్తలు చేసిన నేరాలకు జైలుకు వచ్చిన భార్యలు కూడా ఉన్నారు. జైలుకు వెళ్తున్నప్పుడు మొదట్లో నాకు అవమానంగా అనిపించింది. కానీ స్నేహితులు... ‘నువ్వు నేరం చేసి జైలుకు వెళ్లలేదు.. ఒక సిద్ధాంతం కోసం వెళ్తున్నావు’ అన్నారు. నిజమే కదా అని అనిపించింది. ఇక్కడొక విషయం చెప్పాలి. నేను జైలుకు వెళ్లకపోతే నా తెలుగు కుటుంబ సభ్యులు ఏమనుకుంటున్నారో తెలిసేది కాదు. ఆ విధంగా చూస్తే నాకు మంచే జరిగింది..’’ అని చెప్పుకొచ్చారు.