Allu Arjun: అల్లు అర్జున్‌కి శిక్ష తప్పదా..

ABN , Publish Date - Dec 06 , 2024 | 03:16 PM

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌పై చిక్కడపల్లి పిఎస్‌లో కేసు నమోదైంది. బిఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ 105 ప్రకారం హత్య కాని ప్రాణనష్టం కేసు, 118(1) వంటి నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ తరహా కేసుల్లో నేరం రుజువైతే ఐదు నుంచి గరిష్ఠంగా పదేళ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశముందనేలా వార్తలు వైరల్ అవుతున్నాయి.

Allu Arjun

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ సినిమా డిసెంబర్ 5న గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే విడుదలకు ముందురోజు రాత్రి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో ప్రదర్శించబడిన ప్రీమియర్‌కు అల్లు అర్జున్ రావడంతో తొక్కిసలాట జరిగి ఓ కుటుంబంలో విషాదం నింపింది. ‘పుష్ప2’ సినిమాను చూసేందుకు వచ్చిన రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమారుడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌పై చిక్కడపల్లి పిఎస్‌లో కేసు నమోదైంది. బిఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ 105 ప్రకారం హత్య కాని ప్రాణనష్టం కేసు, 118(1) వంటి నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ తరహా కేసుల్లో నేరం రుజువైతే ఐదు నుంచి గరిష్ఠంగా పదేళ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశముంది. అల్లు అర్జున్ వస్తున్న విషయంపై తమకు ఎవరూ సమాచారం ఇవ్వలేదని పోలీసులు ఇప్పటికే వెల్లడించారు.


ఈ ఘటనపై మృతురాలి భర్త భాస్కర్ ఏమన్నారంటే.. ‘‘మా బాబు అల్లు అర్జున్‌కు అభిమాని. వాడి కోసమే మేము సినిమాకి వచ్చాము. అందరూ మా బాబుని పుష్పా అని పిలుస్తారు. వాడి కోసమే అంతా సినిమాకు వచ్చాం.. కానీ ఇలా తొక్కిసలాట జరిగి నా భార్యను కోల్పోవడం తట్టుకోలేక పోతున్నాను. పోలీసులు CPR చేసినపుడు మా బాబు స్పృహలోకి వచ్చాడు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. మొదట నా భార్య పిల్లలు లోపలికి వెళ్లారు. అప్పటికి అభిమానులు మాములుగానే ఉన్నారు. ఎప్పుడైతే అల్లు అర్జున్ వచ్చారో.. ఒక్కసారిగా క్రౌడ్ పెరిగింది. తొక్కిసలాట జరిగింది. మా బాబు పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్స్ చెప్పారు. మమ్మల్ని అల్లు అర్జున్‌గానే ఆదుకోవాలి’’ అని రేవతి భర్త భాస్కర్ తెలిపారు.

అయితే ఇప్పటి వరకు ఈ ఘటనసై అల్లు అర్జున్ స్పందించలేదు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు స్పందించారు కానీ, అల్లు అర్జున్ నుండి ఇంకా ఎటువంటి స్పందన రాలేదు. ఈ ఘటనపై వెంటనే అల్లు అర్జున్ స్పందించి, భాస్కర్ కుటుంబానికి అండగా ఉండాలని డిమాండ్ చేస్తున్నారు భాస్కర్ తరపు బంధువులు.

Updated Date - Dec 06 , 2024 | 05:37 PM