Manchu Vishnu: మంచు విష్ణుకు అనుకూలంగా కోర్టు తీర్పు.. ఇక ఉంటది ఒక్కొక్కడికి..
ABN , Publish Date - Oct 09 , 2024 | 10:54 AM
మంచు విష్ణుకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడైన మంచు విష్ణుకు దిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. గత కొంతకాలంగా మంచు ఫ్యామిలీని, మంచు విష్ణును టార్గెట్ చేస్తూ కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో ప్రసారమయ్యే వీడియోలపై దిల్లీ హైకోర్టు కొరడా ఝళిపించింది. విషయంలోకి వస్తే..
మంచు విష్ణు (Manchu Vishnu)కు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడైన (MAA President) మంచు విష్ణుకు దిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయన ప్రతిష్ఠను దిగజార్చేలా యూట్యూబ్‌లో ఉంచిన వీడియోలను తొలగించాలని పలు యూట్యూబ్ ఛానళ్ల (Youtube Channels) నిర్వాహకులను న్యాయస్థానం ఆదేశించింది. అప్రతిష్ఠ పాలుజేసేందు చేసే ప్రచురణలు, వీడియో కంటెంట్లను వ్యాప్తి చేయవద్దని కోర్టు తేల్చిచెప్పింది. విష్ణు మంచు పేరు, స్వరం, చిత్రాలను ప్రత్యక్షంగా, పరోక్షంగా దుర్వినియోగం చేయవద్దని స్పష్టం చేసింది. పిటిషనర్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ఘటనలకు పాల్పడుతున్న ఎవరిపై అయినా చట్టప్రకారం చర్యలు తీసుకునేందుకు విష్ణుకు వెసులుబాటు ఇచ్చింది.
Also Read- Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో షాయాజీ షిండే భేటీ.. ప్రయత్నం ఫలిస్తుందా
మంచు విష్ణుపై పోస్ట్ చేసిన పది యూఆర్ఎల్ యూట్యూబ్ లింక్స్‌ను తొలగించాలని కేంద్ర సమాచారశాఖ, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖను దిల్లీ హైకోర్టు ఆదేశించింది. సంబంధిత లింక్స్‌ను వెంటనే తొలగించాలని ఆయా యూట్యూబ్ ఛానళ్లకు హెచ్చరిక చేసింది. ఛానళ్లు 48 గంటల్లో తొలగించకపోతే వాటి తొలగింపునకు చర్యలు తీసుకోవాలని యూట్యూబ్ సంస్థను సైతం కోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మిని పుష్కర్ణ ఈనెల 1న ఉత్తర్వులు జారీ చేశారు. తన ప్రతిష్ఠను దిగజార్చేలా పలు యూట్యూబ్ ఛానళ్లు వీడియోలు ప్రసారం చేయడాన్ని సవాలు చేస్తూ మంచు విష్ణు ఈ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
గత కొంతకాలంగా మంచు ఫ్యామిలీని, మంచు విష్ణును టార్గెట్ చేస్తూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పనిగట్టుకుని మరీ ఫేక్ ప్రచారం చేస్తున్నారు. దీనిపై మంచు విష్ణు అండ్ టీమ్ ఎప్పటికప్పుడు సీరియస్ అవుతూనే ఉన్నారు. ఈ మధ్య తన ఫ్యామిలీపైనే కాకుండా.. ఇండస్ట్రీలోని నటీనటులపై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు, థంబ్స్‌తో వీడియోలు చేస్తే.. వెంటనే వాటిని తీయించేస్తున్నారు. అలా తీయించేసిన చానళ్ల వివరాలను పోస్ట్ చేసేందుకు కూడా ‘మా’ తరపున అధికారికంగా ఓ ట్విట్టర్ హ్యాండిల్‌ను రెడీ చేశారు. అయినా కూడా కొందరు వికృత చేష్టలు చేస్తుండటంతో ఆయన పలు యూబ్యూబ్ ఛానళ్లపై పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు కోర్టు తీర్పు ఆయనకు అనుకూలంగా వచ్చింది కాబట్టి.. ఇకపై యూట్యూబ్ ఛానళ్లలో ఎవరైనా ఆర్టిస్ట్‌లను, తన ఫ్యామిలీని టార్గెట్ చేస్తే మాత్రం మంచు విష్ణు విశ్వరూపం చూపించనున్నారు.