Chiru - Bunny: మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో అల్లు అర్జున్.. పిక్ వైరల్.. ఇక ఫుల్‌స్టాప్ పెట్టినట్టేనా!
ABN , Publish Date - Dec 15 , 2024 | 04:21 PM
అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత టాలీవుడ్‌లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మధ్యంతర బెయిల్‌తో విడుదలై ఇంటికి చేరుకోగానే టాలీవుడ్ అంతా ఆయన ఇంట్లో వాలిపోయింది. ఆదివారం చిరు ఇంట్లో బన్నీ ప్రత్యక్షమవడంతో.. మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య గత కొంతకాలంగా జరుగుతున్న యుద్ధాలకు కూడా ఈ అరెస్ట్ బ్రేక్ వేసిందనే చెప్పుకోవచ్చు. మ్యాటర్ ఏమిటంటే..
మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ వేరు వేరు. అల్లు అర్జున్ మెగా హీరో కాదు.. ఆయన అల్లు హీరో. ఆయనకు మెగాభిమానులు కాదు.. అల్లు ఆర్మీ ఉంది.. ఇది గత కొన్ని రోజులుగా వినిపిస్తూ వస్తున్న మాట. ఏపీలో జరిగిన ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ చేసిన ఓ పని.. ఈ మాటని మరింత పటిష్టం చేసింది. అప్పటి వరకు అల్లు అర్జున్ అంటే ఇష్టపడే కొందరు మెగాభిమానులు కూడా ఆయన చేసిన పనితో ఆయనకు దూరం అయ్యారు. ఆయన ఏం చేశాడనేది పక్కన పెడితే.. చేసిన పని మాత్రం.. అల్లు అర్జున్‌పై నెగిటివ్‌కి కారణమైంది. ఇక అప్పటి నుండి మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అనేలా ఆ ఫ్యామిలీల వ్యక్తులు, అభిమానులు మారిపోయారు. ఆ ప్రభావం ‘పుష్ప 2’ సినిమాపై కూడా పడింది. అయితే ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ముఖ్యంగా రాజకీయాలలో చెప్పినట్లుగా శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనేలా.. మెగా, అల్లు ఫ్యామిలీలలో కూడా ఇప్పుడు మార్పు వచ్చింది.
Also Read- Bunny-Balayya: బన్నీకి బాలయ్య ఫోన్..
మరీ ముఖ్యంగా సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత మెగా, అల్లు ఫ్యామిలీలలో అప్పటి వరకు ఉన్న కోపాలు మొత్తం దూరమయ్యాయి. ఎంత కాదన్నా.. అల్లు అర్జున్‌కి మెగాస్టార్ చిరంజీవి కూడా తండ్రిలాంటి వారే. తన చిన్నప్పటి నుండి చిరు ఎంత కేర్ తీసుకున్నారో.. వాళ్ల ఫ్యామిలీలకు తెలుసు. మరీ ముఖ్యంగా రామ్ చరణ్‌ని, అల్లు అర్జున్‌ని ఆయన ఎప్పుడూ వేరు చేసి చూడలేదు. అల్లు అర్జున్ ఎదుగుదలను చిరంజీవి తన బిడ్డ ఎదుగుదలగానే చూశారు. ఆ విషయం ఎన్నో స్టేజ్‌ల మీద స్పష్టంగా కనిపించింది కూడా. అందుకే అల్లు అర్జున్.. చిరుని బాబా అని పిలుస్తారు. పవన్ కళ్యాణ్‌ని బాబాయ్ అని పిలుస్తుంటారు. కొన్నిసార్లు.. సక్సెస్ తాలుకూ ప్రభావం అన్ని మరిచిపోయేలా చేసినా.. మళ్లీ గుర్తుకు రావడానికి చిన్న ఝలక్ చాలు. అల్లు అర్జున్ లైఫ్‌లో ఇప్పుడదే జరిగింది.
ఇక విషయంలోకి వస్తే.. మధ్యంతర బెయిల్‌తో జైలు నుండి విడుదలైన అల్లు అర్జున్‌ని చూసి, పరామర్శించేందుకు శనివారం టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఆయన ఇంట్లోనే ఉంది. అయితే బన్నీ అరెస్ట్ అని తెలిసినప్పుడు వెంటనే షూటింగ్ ఆపేసుకుని వచ్చిన మెగాస్టార్, శనివారం మాత్రం ఎక్కడా కనిపించలేదు. కట్ చేస్తే.. ఆదివారం చిరంజీవి ఇంట్లోనే అల్లు అర్జున్ ప్రత్యక్షమయ్యారు. చిరంజీవి ఇంట్లో అల్లు అర్జున్ దంపతులు ఉన్న పిక్ ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ పిక్ చూసిన వారంతా.. ఇది కదా.. మెగాస్టార్ అంటే. గత కొన్ని సంవత్సరాలుగా అల్లు అర్జున్ ఏం కోల్పోయారో.. ఇప్పటికైనా తెలుసుకుంటే బాగుంటుంది. ఈ పిక్ చాలు.. ఇప్పటి వరకు వారి ఫ్యామిలీలో జరుగుతున్న అంతర్యుద్ధాలకు ఫుల్ స్టాప్ పడిందని చెప్పడానికి అంటూ ఇటు మెగా, అటు అల్లు అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈ పిక్‌కు కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా ఈ పిక్ అలాంటి సందేశమే ఇస్తే.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాబోయే రోజుల్లో ఎన్నో గొడవలకు ముందే ఫుల్ స్టాప్ పడినట్లుగా భావించవచ్చనేది టాలీవుడ్ అభిమానుల మాట.
నాగబాబు ఇంటికి కూడా..
మెగాస్టార్ చిరంజీవి ఇంటి నుండి నేరుగా అల్లు అర్జున్ మెగా బ్రదర్ నాగబాబు ఇంటికి చేరుకున్నారు. అక్కడ కొంచెం సేపు ఉన్న తర్వాత మళ్లీ వెంటనే ఇంటికి బయలు దేరారు. అల్లు అర్జున్ కోసం నాగబాబు వెయిట్ చేస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.