సర్దుకుపోవడం.. రాజీపడటం...
ABN , Publish Date - Aug 21 , 2024 | 01:46 AM
మలయాళ పరిశ్రమలో ఈ రెండూ చాలా ఫేమస్ ఫ మల్లూవుడ్‌లో మహిళల సమస్యలపై హేమ కమిటీ రిపోర్ట్ పిలిచినప్పుడల్లా పక్కలోకి రావాలని కండిషన్ అంగీకరిస్తే కోడ్‌నేమ్, ఎదురు తిరిగితే అప్రకటిత నిషేధం మలయాళ చిత్రసీమలో...
మలయాళ పరిశ్రమలో ఈ రెండూ చాలా ఫేమస్ ఫ మల్లూవుడ్‌లో మహిళల సమస్యలపై హేమ కమిటీ రిపోర్ట్ పిలిచినప్పుడల్లా పక్కలోకి రావాలని కండిషన్ అంగీకరిస్తే కోడ్‌నేమ్, ఎదురు తిరిగితే అప్రకటిత నిషేధం మలయాళ చిత్రసీమలో మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నారని జస్టిస్ హేమ కమిటీ నివేదిక స్పష్టం చేసింది. మల్లూవుడ్‌లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటికి పరిష్కారాలను సూచించేందుకు ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. మహిళలపై వేధింపులు, శ్రమ దోపిడి, అసభ్యంగా ప్రవర్తించడం లాంటివి సాధారణంగా మారాయని, క్రిమినల్ గ్యాంగ్స్ కనుసన్నల్లో మలయాళ చిత్రపరిశ్రమ నడుస్తోందని కమిటీ ఆరోపించింది. సమస్య పరిష్కారానికి పటిష్ఠ చట్టం అవసరమని, ట్రిబ్యూనల్ ఏర్పాటు చేయాలని కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. నివేదిక ఇచ్చి నాలుగేళ్లయినా చర్యలు శూన్యమన్న ప్రతిపక్షాలు విమర్శల నేపథ్యంలో కమిటీ సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. మహిళలపై వేధింపులను అడ్డుకునేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామని పేర్కొన్నారు.
కమిటీ గుర్తించిన ముఖ్యమైన అంశాల్లో కొన్ని
షూటింగ్ సమయంలో మహిళలకు మరుగుదొడ్డి సదుపాయాల కొరత ఉంది. ఈ-టాయ్‌లెట్‌లు సరిపడా స్థాయిలో ఉండడం లేదు. అలాగే దుస్తులు మార్చుకునేందుకు సరైన గదులు ఉండడం లేదు. దీనివల్ల మహిళలు భయపడాల్సి వస్తోంది.
ప్రొడక్షన్ మేనేజర్లు అవకాశాల కోసం తమను కలిసే మహిళలను లొంగదీసుకుంటున్నారు. ‘పరిస్థితులను బట్టి సర్దుకుపోండి, కొన్ని విషయాల్లో రాజీపడండి అలాగైతేనే మీకు మా సినిమాలో అవకాశం ఇస్తాం’ అని కండీషన్ పెడుతున్నారు. ‘పిలిచినప్పుడల్లా పక్కలోకి రావాలి’ అని షరతుడు పెడుతున్నారు. సర్దుకుపోవడం, రాజీపడడం... అనే ఈ రెండు మలయాళ చిత్రసీమలో చాలా ఫేమస్ అని కమిటీ నివేదికలో పేర్కొంది.
షూటింగ్‌లో తమకు కేటాయించిన వసతి గృహాల్లో ఒంటరిగా ఉండాలంటే మహిళా నటీమణులు భయపడుతున్నారు. ఎవరు ఎప్పుడు తాగి వచ్చి తలుపు కొడతారో అనే భయంతో స్నేహితులనో, బంధువులనో తోడు తెచ్చుకుంటున్నారు. తాము బస చేసిన హోటళ్లలో, షూటింగ్స్‌లో ఉన్న మగవాళ్లు ఎక్కువ సార్లు మత్తులో జోగుతూ తమ తలుపు తట్టారని కమిటీ ముందు చెప్పారు. వారించినా పదే పదే తలుపులు కొడుతున్నారనీ, వాళ్లు తలుపులు బద్దలు కొట్టుకొని లోపలకి వచ్చి తమను ఏమైనా చేస్తారేమోనని చాలాసార్లు భయపడినట్లు తెలిపారు. చిత్రీకరణకు ముందే ఓ హీరో, హీరోయిన్‌ను లైంగికంగా వేధించాడు. ఆ ప్రభావం ఆమె నటనపై పడింది. అతనిపైన ఉన్న ద్వేషమే ఆమె ముఖంలో ప్రతిఫలించింది. దీనివల్ల ఒక్కషాట్‌కు ఆమె 17 టేక్‌లు తీసుకోవాల్సి వచ్చింది. దీంతో డైరెక్టర్ ఆమెను తిట్టాడు.
స్టార్‌డమ్‌తో ఇబ్బందులు
లైంగికవేధింపులకు గురైన నటీమణులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు. తమతో పాటు తమ కుటుంబ సభ్యులు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందనే భయమే దీనికి కారణం. సామాన్య మహిళలతో పోల్చితే సెలబ్రిటి స్థాయిలో ఉన్నవాళ్లు ఎక్కువగా ఇలాంటి ఇబ్బందులు ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. సైబర్ దాడులు సహా పలు రూపాల్లో వారిపై దాడి చేస్తున్నారు. తమ కుటుంబం పరువు పోతుందనే భయంతో పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదని మహిళలు చెబుతున్నారు. కోర్టు, పోలీసులను ఆశ్రయిస్తే, ప్రాణహానితో పాటు కుటుంబం మొత్తం దారుణమైన పరిస్థితులు చవిచూడాల్సి వస్తుందని భయపడుతున్నారు.
పలుకుబడి పనిచేస్తోంది
కొందరు పలుకుబడి ఉన్న నిర్మాతలు, దర్శకులు, నటీనటులు ప్రొడక్షన్ కంట్రోలర్స్ లాంటి పవర్‌ఫుల్ వ్యక్తులు పరిశ్రమను నియంత్రిస్తున్నారని నివేదిక పేర్కొంది. తమ పలుకుబడిని ఉపయోగించి పరిశ్రమలో అవకాశాలు రాకుండా చేస్తారని మహిళలు భయపడుతున్నారు. లైంగిక వేధింపులకు గురైనప్పుడు ఫిర్యాదు చేస్తే, వారిపైన అప్రకటిత నిషేధం కొనసాగుతుంది. తర్వాత మరో సినిమాలో అవకాశం రాకుండా చేస్తున్నారు. దీనివల్ల తమ కెరీర్ బుగ్గి అవుతుందని మహిళలు ఫిర్యాదు చేయడానికి వెనుకాడుతున్నారు.
అగ్రతారలకు మినహా ఇతర నటీనటులకు పారితోషికానికి సంబంధించి ఎలాంటి రాతపూర్వక ఒప్పందాలు ఉండడం లేదు. దీనివల్ల మహిళలు, జూనియర్ యాక్టర్స్‌కు పూర్తి పారితోషికం అందడం లేదు. డిమాండ్ చేసే వీలు కూడా ఉండడం లేదు.
ట్రిబ్యూనల్ ఏర్పాటు చేయాలి
రిటైర్డ్ జిల్లా జడ్జి ఆధ్వర్యంలో ట్రిబ్యూనల్ పనిచేయాలి. కనీసం ఐదేళ్ల అనుభవం ఉన్న మహిళా న్యాయమూర్తులను నియమించాలి. మహిళలకు సురక్షితమైన వసతి, రవాణా, టాయిలెట్‌లు, ఉండే దుస్తులు మార్చుకునే గదులు ఏర్పాటు చేయాలి. షూటింగ్‌లో డ్రగ్స్, మద్యంపై నిషేధం విధించాలి. జూనియర్ ఆర్టిస్టులకు వర్క్ కాంట్రాక్ట్‌లను అమలు చేయాలి. మహిళలకు వారి ప్రతిభ, శ్రమకు తగ్గ పారితోషికం అందేలా చూడాలి. సమాన అవకాశాలతో పాటు అందరినీ కలుపుకోని పోయే వాతావరణాన్ని పరిశ్రమలో సృష్టించాలని నివేదిక సూచించింది.
2017లో నటి భావన కారులో లైంగిక దాడికి పాల్పడిన సంఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. కారులో ఆమెను పలు చోట్లకు తిప్పుతూ దుండగులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ ఘటనలో మలయాళ అగ్రహీరో దిలీప్ కీలక నిందితుడు. ఆ ఘటన తర్వాత మలయాళ పరిశ్రమలో మహిళలపై వేధింపులకు సంబంధించి నివేదిక ఇవ్వాలని 2019లో అప్పటి ప్రభుత్వం జస్టిస్ హేమ కమిటీని ఏర్పాటు చేసింది. మాజీ హైకోర్టు న్యాయమూర్తి కే హేమ ఈ కమిటీకి చైర్ పర్సన్‌గా ఉన్నారు. సీనియర్ నటి శారద, ఐఏఎస్ అధికారిణి కేబీ వల్సల కుమారి సభ్యులుగా ఉన్నారు. కమిటీ తమ నివేదికను నాలుగేళ్ల క్రితమే ప్రభుత్వానికి సమర్పించినా, సున్నితమైన అంశాలున్నాయనే సాకుతో అందులోని విషయాలు బయటక రాకుండా ఇన్నాళ్లూ ప్రభుత్వం తొక్కిపట్టింది. సమాచార హక్కు చట్టం కింద బయటకు వచ్చిన ఈ నివేదికలో పలు విస్తుగొలిపే విషయాలు బయటకు వచ్చాయి.