Mahesh Babu : ముఫాసాకు వాయిస్.. ఎంతో ప్రత్యేకం అంటున్న మహేశ్!
ABN , Publish Date - Aug 26 , 2024 | 12:56 PM
ప్రముఖ హాలీవుడ్ నిర్మాణసంస్థ డిస్నీ తెరకెక్కిస్తున్న ‘ముఫాసా’: ది లయన్ కింగ్’ (Mufasa: The lion king). ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.
ప్రముఖ హాలీవుడ్ నిర్మాణసంస్థ డిస్నీ తెరకెక్కిస్తున్న ‘ముఫాసా’: ది లయన్ కింగ్’ (Mufasa: The lion king). ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఆరోన్ స్టోన్, కెల్విన్ హ్యారిసన్ జూనియర్ తదితరులు నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో కీలకమైన ముఫాసా పాత్రకు మహేశ్ బాబు (Mahesh Babu) డబ్బింగ్ చెప్పారు. ‘‘అప్పుడప్పుడు ఈ చల్లని గాలి.. నా ఇంటి నుంచి వచ్చే జ్ఞాపకాలను గుర్తుచేస్తున్నట్టు అనిపిస్తుంది. అంతలోనే అవి మాయమవుతున్నాయి’’ అంటూ మహేశ్ చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి. అద్భుతమైన విజువల్స్‌తో మహేశ్ డైలాగ్స్‌తో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.
ఈ మేరకు మహేశ్ ట్వీట్ చేశారు. ‘ముఫాసా’కు వాయిస్ ఓవర్ ఇవ్వడంపై మహేశ్ ఆనందం వ్యక్తంచేశారు. ‘‘మనకు తెలిసిన, ఇష్టపడే పాత్రకు కొత్త అంకం. తెలుగులో ‘ముఫాసా’కు వాయిస్‌ని అందించినందుకు చాలా సంతోసంగా ఉంది. ఈ క్లాసిక్‌కి నేను విపరీతమైన అభిమానిని కావడంతో ఇది నాకెంతో ప్రత్యేకంగా ఉంది’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమా హిందీ వెర్షన్‌లో ముఫాసా పాత్రకు షారుక్‌ఖాన్ (Shah Rukh Khan) , ముఫాసా చిన్నప్పటి పాత్రకు ఆయన తనయుడు అబ్రం వాయిస్ ఓవర్ అందించారు. ‘‘ముఫాసాకు అద్భుతమైన వారసత్వం ఉంది. అడవికి అతడే రారాజుగా ఉంటాడు. ఒక తండ్రిగా ఆ పాత్ర నా మనసుకు చేరువైంది. బాల్యం నుంచి రాజుగా ఎదగడం వరకూ ముఫాసా జీవితం ఎలా సాగిందనే విషయాన్నిఈ సినిమా చెబుతుంది. 2019లో వచ్చిన ‘ది లయన్ కింగ్’ తర్వాత మరోసారి ఈ పాత్ర కోసం వర్క్ చేయడం ప్రత్యేకంగా ఉంది. మరీ ముఖ్యంగా నా పిల్లలతో కలిసి వర్క్ చేయడం ఆనందంగా అనిపిస్తుంది’’ అని షారుక్ తెలిపారు. ఇందులోని సింబా పాత్రకు షారుక్ పెద్ద తనయుడు ఆర్యన్ ఖాన్ (Aryan khan) వాయిస్ ఇచ్చారు.