Tabu: టాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు..‘టబు’ సరికొత్త చరిత్ర
ABN , Publish Date - May 14 , 2024 | 06:36 PM
మన హైదరాబాదీ నటి కథానాయిక టబు. ఓ అరుదైన ఘనతను దక్కించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా హై పాపులారిటీ, భారీ వ్యూవర్ షిప్ ఉన్న హాలీవుడ్ టెలివిజన్ ఒరిజినల్ మ్యాక్స్ సిరీస్ డ్యూన్: ప్రాఫెసీ వెబ్ సిరీస్‌లో భాగం కానుంది.
మన హైదరాబాదీ నటి కథానాయిక టబు (Tabu) ఓ అరుదైన ఘనతను దక్కించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా హై పాపులారిటీ, భారీ వ్యూవర్ షిప్ ఉన్న హాలీవుడ్ టెలివిజన్ ఒరిజినల్ మ్యాక్స్ సిరీస్ డ్యూన్: ప్రాఫెసీ వెబ్ సిరీస్‌లో (Hollywood Web Series) భాగం కానుంది. ఈ విషయాన్ని ప్రముఖ ఆంగ్ల మ్యాగ్ జైన్ ప్రచురించడంతో ఇప్పుడు ఈ అంశం సర్వత్రా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. ఇప్పటికే ప్రియాంకా చోప్రా హాలీవుడ్ సిరీస్‌లలో నటిస్తుండగా ఇప్పుడు టబు కూడా ఆ లిస్ట్‌లో చేరింది.
తెలుగులో రాఘవేంద్ర రావు దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్ హీరోగా వచ్చిన కూలీ నం1 చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన టబు ఆ తర్వాత బాలీవుడ్ లో టాప్ స్టార్లతో నటించి అగ్ర తారగా రాణించింది. సినిమా ఇండస్ట్రీకి వచ్చి 40 సంవత్సరాలు పూర్తైనప్పటికీ టబు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగానే ఉంటోంది. ఇటీవలే తాను ఓ కథానాయికగా నటించిన క్రూ అనే బాలీవుడ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని దక్కించుకోవడం విశేషం.
అయితే తాజాగా టబు హాలీవుడ్ ఫేమస్ సైన్స్ ఫిక్షన్ వెబ్ సిరీస్ ఫ్రాంఛైజీ ‘డ్యూన్: ప్రాఫెసీ’ (Dune: Prophecy) లో సిస్టర్ ఫ్రాన్సెస్కా పాత్రలో టబు నటిస్తున్నట్లు ప్రముఖ అమెరికన్ మ్యాగజైన్ వెళ్లడించింది. దీంతో ఈ వార్త ఈ రోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఓ భారతీయ నటి ఇలాంటి ప్రెస్టీజియస్ సిరీస్‌లో నటించడం మన దేశానికి ఎంతో గర్వ కారణమంటూ టబుపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తెలుగులో మొదలు పెట్టి హాలీవుడ్ స్థాయి వరకు వెళ్లిందంటూ అభినందనలు తెలుపుతున్నారు.
2012లో విడుదలైన సిస్టర్ హుడ్ ఇన్ డ్యూన్ అనే నవల ఆధారంగా ఈ సిరీస్‌ను రూపొందించారు. అదేవిధంగా ఇటీవల వచ్చిన డ్యూన్ పార్ట్ 1, పార్ట్ 2 సినిమాలకు ఫ్రీక్వెల్‌గా ఈ ‘డ్యూన్: ప్రాఫెసీ’ (Dune: Prophecy) సిరీస్ ఉండనుంది. టబుతో పాటు ఈ సిరీస్‌లో ఇంకా ఎమిలీ వాట్సన్ (Emily Watson), ఒలివియా విలియమ్స్ వంటి అగ్ర నటులు ఇందులో నటించనున్నారు.