వామ్మో! సైంధవ్ కి ఇంత ఖర్చు చేశారా?

ABN , Publish Date - Jan 17 , 2024 | 12:39 PM

వెంకటేష్ తన 75వ సినిమా కోసం, దర్శకుడు శైలేష్ కొలనుతో చేతులు కలిపి 'సైంధవ్' అనే సినిమాతో సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి నిర్మాత పెట్టిన బడ్జెట్ తెలిస్తే షాకవ్వాల్సిందే.

వామ్మో! సైంధవ్ కి ఇంత ఖర్చు చేశారా?
Venkatesh from Saindhav

వెంకటేష్ 75వ సినిమా 'సైంధవ్' సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 13న విడుదలైన సంగతి తెలిసిన విషయమే. ఈ సినిమాని ఏకగ్రీవంగా అటు ప్రేక్షకులు, ఇటు విశ్లేషకులు కూడా తిరస్కరించిన సంగతి కూడా తెలిసిందే. దీనికి శైలేష్ కొలను దర్శకుడు, వెంకట్ బోయినపల్లి నిర్మాత. ఇందులో వెంకటేష్ తో పాటు, నవాజుద్దీన్ సిద్దిఖీ, ముకేశ్ రిషి, జిషు సేన్ గుప్త, తమిళ నటుడు ఆర్య కూడా వున్నారు.

సారా పాలేకర్ అనే చిన్నమ్మాయి కూడా ఇందులో చేసింది. శ్రద్ధ శ్రీనాథ్, రుహాణి శర్మ, ఆండ్రియా ప్రధాన పాత్రల్లో కనపడతారు. ఈ చిన్నపాప తో సహా వీళ్ళందరూ కూడా పరభాషా నటీనటులే. ఇది ఒక యాక్షన్ సినిమాగా దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించాడు. అయితే ఈ సినిమా విడుదలైన తరువాత క్రిటిక్స్ కి ఈ సినిమా నచ్చకపోవటంతో రేటింగ్స్ చాలా తక్కువ ఇచ్చారు. ఈ సినిమాకి వెంకటేష్ ఏ సినిమాకి చెయ్యనంత ప్రచారాలు కూడా చేశారు. విశాఖపట్నంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక చేశారు. ఇంత చేసిన ఈ సినిమా ప్రేక్షకుల మెప్పు పొందలేదు.

Nawazuddin-Siddiqui.jpg

అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తున్నాయి. ఈ సినిమాలో తెలుగు నటులు అంటే గెటప్ శీను కనపడతాడు, అంతే, మిగతా అందరూ పరభాషా నటులే. అయితే వీళ్ళందరికీ చాలా అత్యధిక పారితోషికాలు ఇచ్చి మరీ తెచ్చుకున్నారు అని ఒక వార్త పరిశ్రమలో నడుస్తోంది. హిందీ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ తెలుగు సినిమా చెయ్యను అని అన్నా కూడా, దర్శకుడు అతనే కావాలని పట్టుబట్టి మరీ అతన్ని ఒక పాత్రలో చూపించారు అని పరిశ్రమలో టాక్ నడుస్తోంది. అతనికి ఇచ్చిన పారితోషికం తెలిస్తే షాకవ్వాల్సిందే. అతనికి సుమారు రూ.10 కోట్ల రూపాయలు పారితోషికం ఇచ్చారని తెలిసింది, అలాగే తమిళ నటుడు ఆర్యకి రూ. 5 కోట్ల రూపాయలు పారితోషికం ఇచ్చారని తెలిసింది.

మొత్తం సినిమాలో ఆర్య పాత్ర పది నిముషాలు కూడా ఉండదు, కానీ అతనికి అంత పారితోషికం ఇచ్చారు. ఇక మిగతా వాళ్ళకి ఇచ్చిన పారితోషికాలు కలుపుకుంటే ఈ సినిమాకి నిర్మాత బోయినపల్లి వెంకట్ చాలా ఖర్చు పెట్టారని తెలిసింది. సుమారు రూ. 60 కోట్ల వరకు అతనికి బడ్జెట్ అయిందని, విడుదల అయ్యాక థియేటర్స్ వ్యాపారం మీద ఎటువంటి డబ్బులు రాలేదని పరిశ్రమలో అనుకుంటున్నారు. నిర్మాతకి సినిమా కథ మీద అంత పట్టులేకపోవటం, దానికి తోడు బడ్జెట్ ఎక్కువ అవటంతో ఈ సినిమా పెద్ద కాస్ట్ ఫెయిల్యూర్ గా చెప్పుకుంటున్నారు పరిశ్రమలో. ఓటిటి, శాటిలైట్, , హిందీ హక్కులు అమ్ముకుంటే అది కొంచెం రికవరీ అని అంటున్నారు. ఒకవేళ అది కూడా కాకపోతే ఇప్పుడు కష్టం అని కూడా అంటున్నారు.

ఈ సినిమా ప్రీ రిలీజ్ విడుదలకి ముందు వ్యాపారం కేవలం రూ.25 కోట్లు మాత్రమే అయిందని తెలుస్తోంది. ఈ సినిమాకి విమర్శకుల, ప్రేక్షకుల నుండి ఎటువంటి స్పందన లేకపోవటంతో ఈ సినిమా డిజాస్టర్ అని కూడా అంటున్నారు. అందువలన నిర్మాతకి చాలా నష్టం రావొచ్చు అని కూడా పరిశ్రమలో టాక్ నడుస్తోంది.

Updated Date - Jan 17 , 2024 | 04:15 PM