Naa Sammi Ranga: నాగార్జున సినిమా సంక్రాంతికి వస్తుందా?
ABN , Publish Date - Jan 01 , 2024 | 11:43 AM
నాగార్జున నటించిన 'నా సామి రంగ' సినిమా జనవరి 14న విడుదలవుతోందని చిత్ర నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని, రెండు పోరాట సన్నివేశాలు, ఒక పాట చిత్రీకరణ ఇంకా చిత్రీకరించాల్సి ఉందని పరిశ్రమలో టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా విడుదల....
నాగార్జునతో (Akkineni Nagarjuna) కొత్త దర్శకుడు విజయ్ బిన్నీ (Vijay Binni) తో చేస్తున్న 'నా సామి రంగ' #NaaSaamiRanga విడుదల తేదీ అధికారికంగా ప్రకటించారు. జనవరి 14న సంక్రాంతి పండగ సినిమా పోటీలో ఉన్నామని చెప్పారు. ఈ సినిమా విడుదల తేదీతో ఈసారి పోటీ చాలా రసవత్తరంగా వుండబోతోంది అని పరిశ్రమలో అందరూ ఎదురు చూస్తున్నారు. మహేష్ బాబు (Mahesh Babu) నటించిన 'గుంటూరు కారం' #GunturKaaram, తేజసజ్జ నటించిన 'హనుమాన్' #Hanuman జనవరి 12న విడుదల అవుతూ ఉండగా, వెంకటేష్ (Venkatesh Daggubati) నటించిన 75వ సినిమా 'సైంధవ్' #Saindhav జనవరి 13న, అదే రోజు రవితేజ (Ravi Teja) నటించిన 'ఈగిల్' #Eagle కూడా విడుదలవుతోంది. ఇప్పుడు నాగార్జున సినిమా జనవి 14న విడుదలవుతోంది అని ప్రకటించారు.
ఇదిలా ఉండగా ఇంకో పక్క తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అఫ్ కామర్స్ ఈ సినిమా నిర్మాతలతో సమావేశం అవుతూ వున్నారు. ఎందుకంటే కొన్ని సినిమాలకి థియేటర్స్ దొరకటం కష్టం, అందుకని తేదీలు మార్చుకోండి అని అంటున్నారు, కానీ ఎవరూ వెనక్కి తగ్గటం లేదు. అయితే తాజా సమాచారం ప్రకారం నాగార్జున 'నా సామి రంగా' సినిమా షూటింగ్ ఇంకా చాలా వుంది అని ఒక సమాచారం.
ఇందులో నాగార్జునతో పాటు, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ కూడా చాలా ఎక్కువ అని, ఇది నాగార్జున కెరీర్ లో ఎక్కువ బడ్జెట్ వున్న సినిమా అవుతుంది అని కూడా అంటున్నారు. ఇలాంటి బడ్జెట్ సినిమాకి థియేటర్స్ ఎక్కువ అవసరం ఉంటుంది అని, అప్పుడే ఈ సినిమా వ్యాపారం బాగా అవుతుందని, నిర్మాతకి లాభాలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. కానీ ఈ సినిమా పండగ సినిమాలతో పాటు రావటం వలన, ఎక్కువ థియేటర్స్ దొరికే అవకాశం లేదని అంటున్నారు.
ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని పరిశ్రమలో ఒక వార్త నడుస్తోంది. రెండు పోరాట సన్నివేశాలు, ఒక పాట చిత్రీకరణ జరగాల్సి ఉందని, ఇవన్నీ పూర్తి కావటానికి కొంచెం సమయం కావాల్సి ఉందని తెలుస్తోంది. ఇప్పుడు తొందర తొందరగా పూర్తి చేసే బదులు, కొంచెం సమయం తీసుకొని చేస్తే బాగుంటుంది అని ఒక వార్త పరిశ్రమలో వినపడుతోంది. పాట అయితే రెండు రోజుల్లో పూర్తి చేసెయ్యవచ్చు కానీ, పోరాట సన్నివేశాలకి మాత్రం సమయం ఎక్కువ పడుతుందని, మరి జనవరి 14 లోగా ఆ పోరాట సన్నివేశాలు పూర్తవుతాయా అన్నది ఒక సందేహం అని పరిశ్రమలో అంటున్నారు. అందుకని నాగార్జున, విజయ్ బిన్నీ సినిమా జనవరి 14 అని విడుదల తేదీ ప్రకటించినా, ఈ సినిమా వాయిదా పడే అవకాశాలు మెండుగా ఉన్నట్టు చెపుతున్నారు.
అయితే ఈ సినిమా కథ పండగ నేపధ్యంలో ఉంటుంది కాబట్టి, ఆ పోరాట సన్నివేశాలు లేకుండా మరి విడుదల చేస్తారేమో అని కూడా అంటున్నారు. ఇప్పుడు షూటింగ్ అయితే శరవేగంగా చేస్తున్నట్టుగా వినికిడి. ఈ సంక్రాంతి బరిలో ఎన్ని సినిమాలు వుంటాయో, ఏ సినిమా వాయిదా పడుతుందో ఇంకో వారం రోజులు అయితే కానీ పూర్తిగా స్పష్టత రాదు అని అంటున్నారు. ఎందుకంటే ఫిల్మ్ ఛాంబర్ ఒక పక్క నిర్మాతలతో మంతనాలు చేస్తూ వుంది కదా!