Naa Saami Ranga: నాగార్జున సినిమా కథ లీకయింది, ఇంతకీ ఏంటో తెలుసా...
ABN , Publish Date - Jan 06 , 2024 | 01:26 PM
నాగార్జున కొత్త దర్శకుడు విజయ్ బిన్నీతో 'నా సామి రంగ' అనే సినిమాతో ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇందులో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ లు కూడా వున్నారు. ఇంతకీ ఈ సినిమా కథ ఏంటో తెలుసా...
నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ నటిస్తున్న 'నా సామి రంగ' సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదలవుతోంది. విజయ్ బిన్నీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇందులో ఆషిక రంగనాథ్, రుస్కర్ ధిల్లాన్, మిర్న కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు ఇప్పటికే బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ సినిమాకి ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చుస్తున్నారు.
ఈ సినిమాకి బడ్జెట్ కూడా చాలా ఎక్కువ పెట్టారని సుమారు రూ. 45 కోట్ల వరకు అయిందని పరిశ్రమలో ఒక వార్త నడుస్తోంది. అందుకే ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి విడుదల చెయ్యాలని అనుకొని, విడుదల చేస్తున్నారు. ఎందుకు ఈ సినిమా సంక్రాంతికి విడుదలవ్వాలని ఈ చిత్ర నిర్వాహకులు పట్టు పట్టారు అంటే, ఈ సినిమా కథా నేపథ్యం అటువంటిది అని అంటున్నారు.
ఇంతకీ ఈ సినిమా కథ కొంచెం లీకయింది. ఈ సినిమా కథ మొత్తం మూడు రోజుల్లో జరిగే కథ అని అంటున్నారు. మధ్యలో ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు తప్పితే ఈ సినిమా కథ భోగి నాడు మొదలై కనుమ నాడు ముగుస్తుంది అని అంటున్నారు. అందుకే ఇది సంక్రాంతి పండగ నేపధ్యం వున్న కథ అని అందుకే సంక్రాంతికి విడుదలైతేనే బాగుంటుంది అని చిత్ర నిర్వాహకులు రాత్రి పగలు పని చేసి సినిమాని పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. భోగి నాడు ఏమి జరిగింది, దానివల్ల ఎదురయ్యే సంఘటనలు ఏంటి, మళ్ళీ కనుమ నాడు ఈ కథ ఎలా పూర్తయింది అనేదే సినిమా అని అంటున్నారు. ఈ సినిమాకి చిట్టూరి శ్రీనివాస్ నిర్మాత.