UI Movie Review : ఉపేంద్ర నటించిన UI మూవీ ఎలా ఉందంటే..

ABN , Publish Date - Dec 20 , 2024 | 03:24 PM

ఉపేంద్ర హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన తాజా సినిమా 'యూఐ'. కన్నడతో పాటు తెలుగులోనూ విడుదల చేశారు. ఈ సినిమా ఎలా ఉంది?

సినిమా రివ్యూ: యుఐ (UI The Movie)
విడుదల తేది: 20–12–2024
నటీనటులు: ఉపేంద్ర (Upendra) రేష్మ నానయ్య(Reshma) , సాధుకోకిల, జిషుసేన్‌ గుప్తా, రవిశంకర్‌, అచ్యుత్‌కుమార్‌, మురళీ శర్మ తదితరులు.
సాంకేతిక నిపుణులు:
సినిమాటోగ్రఫీ: హెచ్‌.సి వేణుగోపాల్‌
సంగీతం: అజనీష్‌ లోక్‌నాథ్‌
ఎడిటింగ్‌: విజయ్‌రాజ్‌ బి.జి
నిర్మాతలు: జి.మనోహరన్‌, శ్రీకాంత్‌ కె.పి
కథ–స్ర్కీన్‌ప్లే–దర్శకత్వం: ఉపేంద్ర (Upendra)

కన్నడ స్టార్‌ ఉపేంద్రకు ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. నటుడిగానే కాక దర్శకుడిగానూ ఆయన ప్రతిభ చూపిస్తుంటారు. ఆయన చిత్రాలు కాస్త స్పెషల్‌ అనే చెప్పాలి. ఉప్పీ–2 తర్వాత ఆయన దర్శకత్వం వహించిన చిత్రం రాలేదు. దాదాపు పదేళ్ల తర్వాత ఉపేంద్ర దర్శకత్వం వహించిన సినిమా ‘యూఐ’. కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ శుక్రవారం విడుదలైంది. 'యుఐ' అంటే ఏంటి? అందులో ఏం చెప్పారు.  ఆయన నటన, దర్శకత్వం ప్రేక్షకులను ఏమేరకు మెప్పించాయి అన్నది తెలియాలంటే రివ్యూ లోకి వెళ్లాల్సిందే!!

కథ: (
UI Movie Review)

జేబు దొంగ వామనరావు (రవిశంకర్‌) సామ్రాట్‌, రాజకీయ నాయకుడు అవుతాడు. అతనికి బానిసలుగా ఉన్న ప్రజల్లో అవగాహన కల్పిస్తూ కుల మతాలకు అతీతంగా నూతన సమాజ స్థాపన కోసం సత్య (ఉపేంద్ర), అతని తండ్రి శాస్ర్తి (అచ్యుత్‌ కుమార్‌) కృషి చేస్తుంటారు. వృత్తిరీత్యా శాస్ర్తి ఓ జ్యోతిష శాస్త్ర నిపుణుడు. సత్య జన్మ నక్షత్రం ప్రకారం అతను కలియుగ  భగవంతుడు అని శాస్ర్తి ప్రకటిస్తాడు. వామనరావును సెంట్రల్‌ సామ్రాట్‌ చేస్తానని చెప్పిన కల్కి ఏం చేశాడు. కల్కిగా వచ్చినది సత్య కాదని, సత్య కవలలు అని ప్రజలతో పాటు వామనరావు తెలుసుకున్నాడా లేదా? సత్య, కల్కి మధ్య వ్యత్యాసం ఏంటి? సమాజానికి వాళ్లిద్దరూ ఏం చేశారు? అనేది మిగతా సినిమా.

Upendra.jpg
విశ్లేషణ: (UI Movie Review)
‘తెలివైనవారు మూర్ఖులుగా కనిపిస్తారు.. మూర్ఖులు తెలివైనా వారిలా నటిస్తారు’ సినిమా ప్రారంభంలో ఉపేంద్ర స్ర్కీన్‌ మీద వేసిన డైలాగ్‌ ఇది. 'యు ఐ' అర్థం కావాలంటే.. జాతీయ, అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులపై ప్రేక్షకులకు పట్టు ఉండాలి. ఓ రచయితగా, దర్శకుడిగా ఉపేంద్ర ఈ సినిమాలో చాలా అంశాలు ప్రస్తావించారు. కానీ  ఏదీ డైరెక్ట్‌గా చెప్పలేదు. పొలిటికల్‌ సినారియోతో మొదలుపెట్టి కలియుగంలోకి తీసుకెళ్లారు ఉపేంద్ర. అక్కడ పరిపాలన ఎలా ఉంది? ప్రజల ఆలోచన ధోరణి ఎలా ఉంది? అనే విషయాలను చూపించారు. అయితే ఇందులో అర్థమయ్యేది, రిజిస్టర్‌ అయ్యేది మాత్రం గ్లోబల్‌ వార్మింగ్‌. భూదేవి ఒకప్పుడు పచ్చగా, అందంగా, ఆరోగ్యవంతంగా ఉండేదని, మైనింగ్‌, మెడిసిన్‌, రియల్‌ ఎస్టేట్‌ మాఫియా భూగోళాన్ని నాశనం చేశారని, కాలుష్యానికి కారణమయ్యారన్న విషయాన్ని చెప్పాలనుకున్నాడు. భూమాతకు పుట్టిన బిడ్డలే కల్కి, సత్య అని చూపించారు. కల్కి తన తల్లికు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకొంటాడు. అందుకు ఏం చేశాడన్నది సినిమా అంతా చూస్తే అర్థం అవుతుంది. కొన్ని చోట్ల పొలిటికల్‌ సెటైర్లు పడతాయి. ఇంకొన్ని చోట్ల మనిషి నైజంతో ఆటాడుకుంటాడు. చివర్లో సినిమా వాళ్లపైనా కొన్ని సెటైర్లు పడ్డాయి. న్యూస్‌ ఛానళ్లలో డిబేట్లతో కులమతాల ప్రతినిధులు కొట్టుకునే తీరునూ ఉపేంద్ర ఎండగట్టారు. అయితే ఈ కథలో డెప్త్‌ ఉంది. ప్రస్తుత రాజకీయ వ్యవస్థపై ఆయన వేసిన బిగ్గెస్ట్‌ సెటైర్‌ ‘యూఐ’. కులాలు, మతాల మధ్య గొడవలు రేపుతూ దేశంలో అత్యున్నత పదవుల్లో ఉన్న నాయకులు పబ్బం గడుపుతున్నారని పరోక్షంగా చెప్పారు. మంచి, చెడు మధ్య వ్యత్యాసం గురించి చెప్పారు.

నటీనటుల విషయానికొస్తే.. ఉపేంద్రకు ఓ స్టైల్‌ ఉంది. ఆ స్టైల్లోనే యాక్ట్‌ చేసుకుంటూ వెళ్లిపోయాడు. ఉపేంద్ర తప్ప ఎవరూ ఇలా నటించలేరన్నది మాత్రం నిజం. కాబట్టి మిగతా నటీనటుల గురించి మాట్లాడుకోవడానికి ఏం లేదు. హీరోయిన్‌ మాత్రం గ్లామర్‌ కోసం అలా ఉందంతే. రవిశంకర్‌ వెరైటీ గెటప్పులతో కనిపించాడు. దర్శకుడిగా ఉపేంద్ర చెప్పాలనుకున్నది స్ట్రెయిట్‌గా చెప్పలేదు. తనకు నచ్చినట్టు రాసుకొని, తీసుకొన్నాడు. ఎడిటర్‌ ఆయన తీసిందంతా పేర్చుకుంటూ వచ్చాడు. టెక్నికల్‌ టీమ్‌ నుంచి మంచి అవుట్‌పుట్‌ తీసుకోవడంలో సక్సెస్‌ అయ్యారు. అజనీష్‌ లోక్‌నాథ్‌ చక్కని సంగీతం, నేపథ్య సంగీతం బావుంది. విజువల్‌ ఎఫెక్ట్స్‌ వర్క్స్‌ కూడా బాగా చేయించారు. స్ర్కీన్‌ మీద ఒక డిఫరెంట్‌ వరల్డ్‌ క్రియేట్‌ చేశారు. లొకేషన్లు బాగున్నాయి. కలియుగం వరల్డ్‌ని కొత్త పంధాలో చూపించారు. ఆ విషయంలో ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌కి మంచి మార్కులు పడతాయి. పాటలు పెద్దగా ఏం అర్ధం కావు. మొత్తానికి ప్రేక్షకుల మైండ్‌ని డిస్ట్రబ్‌ చేసిన  చిత్రమిది.  (UI Movie Review)


ట్యాగ్‌లైన్‌: ఉపేంద్ర అభిమానులకు పండగే!
Upendra.jpg

Updated Date - Dec 20 , 2024 | 05:09 PM