Tillu Square Movie Review: అంతా సిద్దు జొన్నలగడ్డ మయం

ABN , Publish Date - Mar 29 , 2024 | 12:22 PM

'డీజే టిల్లు' లో టిల్లు పాత్రలో ప్రేక్షకులని మెప్పించిన సిద్దు జొన్నలగడ్డ ఈసారి 'టిల్లు స్క్వేర్' అనే సీక్వెల్ తో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ఎలా వుందో చదవండి.

Tillu Square Movie Review: అంతా సిద్దు జొన్నలగడ్డ మయం
Tillu Square Movie Review

సినిమా: టిల్లు స్క్వేర్

నటీనటులు: సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్, మురళి శర్మ, ప్రిన్స్ సెసిల్, మురళీధర్ గౌడ్, నేహా శెట్టి తదితరులు

ఛాయాగ్రహణం: సాయి ప్రకాష్

సంగీతం: రామ్ మిరియాల, భీమ్స్ సిసిరోలియో

రచన: సిద్దు జొన్నలగడ్డ, రవి ఆంటోనీ

నిర్మాత: సూర్యదేవర నాగ వంశి, సాయి సౌజన్య

దర్శకత్వం: మల్లిక్ రామ్

విడుదల తేదీ: మార్చి 29, 2024

రేటింగ్: 3.5

-- సురేష్ కవిరాయని

సిద్దు జొన్నలగడ్డ 'డీజీ టిల్లు' అనే సినిమాతో స్టార్ అయిపోయాడు. అలాగే టిల్లు అనే ఒక పాత్రకి జీవం పోసాడు, తెలుగు ప్రేక్షకుల్లో టిల్లు అనేవాడు భాగం అయిపోయాడు అనే చెప్పాలి, ఎందుకంటే అతను ఆ పాత్రని అంత సహజంగా పోషించాడు. అతని మాటలు, అతని సహజ అభినయం ఆ పాత్రని అంత ఎత్తుకు తీసుకెళ్లింది. ఆ సినిమాలో రాధిక అనే పేరు కూడా బాగా ప్రాచుర్యం పొందింది. సామాజిక మాధ్యమాల్లో, అలాగే కొందరు మాట్లాడుకునేటప్పుడు వచ్చిన సంభాషణల్లో రాధిక పేరు సహజంగానే దొర్లుతూ ఉంటుంది. నేహా శెట్టి రాధికా పాత్ర చేసింది. ఆ సినిమాకి విమల్ కృష్ణ దర్శకుడు, ఆ 'డీజే టిల్లు' కి సీక్వెల్ గా రెండేళ్లు తరువాత ఈరోజు విడుదలైంది 'టిల్లు స్క్వేర్'. మల్లిక్ రామ్ దీనికి దర్శకుడు, కథ, మాటలు సిద్దు రాసాడు. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చి, ఈరోజు ఎట్టకేలకి విడుదలైంది. సూర్యదేవర నాగ వంశి, సాయి సౌజన్య నిర్మాతలు. మరి ఈ సినిమా ఎలా వుందో చూద్దాం. (Tillu Square Movie Review)

tillusquarestill.jpg

Tillu Square story కథ:

డీజీ టిల్లు (సిద్దు జొన్నలగడ్డ) ఇప్పుడు టిల్లు ఈవెంట్స్ అని వెడ్డింగ్ ప్లానర్, పెద్ద పెద్ద ఈవెంట్స్ చేస్తూ ఉంటాడు. అలా చేస్తున్నప్పుడు ఒక ఈవెంట్ లో లిల్లి (అనుపమ పరమేశ్వరన్) అనే అమ్మాయి పరిచయం అవుతుంది. వెంటనే టిల్లు ఆమెకి పడిపోతాడు, ఆమెతో ఒకరోజు వుంటాడు. తెల్లవారేసరికి ఆమె ఒక వుత్తరం పెట్టి మాయం అవుతుంది. టిల్లు ఆమెకోసం వెతుకుతూ ఉంటాడు, నెలరోజుల తరువాత ఒకరోజు ఆసుపత్రి దగ్గర లిల్లి కనపడుతుంది. తాను ప్రేగ్నంట్ అని, అందుకు టిల్లునే కారణమని చెపుతుంది. టిల్లు తల్లిదండ్రులు కూడా చేసుకోమని చెప్తారు, వేరే దారిలేక లిల్లిని పెళ్లి చేసుకుంటాను అంటాడు. టిల్లు పుట్టినరోజు ఘనంగా జరుగుతూ ఉంటుంది, లిల్లిని కూడా తీసుకురావటానికి టిల్లు, లిల్లి వున్న లొకేషన్ కి వెళతాడు. అక్కడే ఎదో తేడా కొడుతూ ఉంటుంది. 'డీజె టిల్లు' లో రాధిక కోసం కూడా అదే అపార్ట్మెంట్స్ కి రావటం టిల్లు కి తెలుసు, మళ్ళీ ఇప్పుడు లిల్లి కోసం కూడా అదే అపార్ట్మెంట్స్ కి రావటంతో ఎదో తేడా కొడుతోందని టిల్లుకి అర్థం అవుతోంది. లిల్లిని కలుస్తాడు, ఏమైంది అని అడిగితే తన అన్న రోహిత్ తప్పిపోయి అప్పటికి ఒక సంవత్సరం అయిందని చెపుతుంది. టిల్లు కంగారు పడతాడు, ఎందుకంటే రోహిత్ ని 'డీజీ టిల్లు' లో పూడ్చిపెట్టింది అతనే కాబట్టి. ఇంతకీ లిల్లీ ఎవరు? రోహిత్ నిజంగానే ఆమెకి అన్నయ్య అవుతాడా? అప్పటి పాత కేసు మళ్ళీ ఎందుకు తిరగతోడారు? ప్రిన్స్ సెసిల్ మళ్ళీ టిల్లు ని ఏమి చేస్తాడు? అంతర్జాతీయ డాన్ (మురళి శర్మ) హైదరాబాదు ఎందుకు వస్తున్నాడు? అతనికి టిల్లుకి ఏంటి సంబంధం? అసలు ఈ కథంతా ఎటు వెళుతుంది? టిల్లు పుట్టినరోజునాడు ఎందుకు అలా కేసుల్లో ఇరుక్కుంటూ ఉంటాడు? ఇవన్నీ తెలియాలంటే 'టిల్లు స్క్వేర్' సినిమా చూడాల్సిందే. (Siddu Jonnalagadda starrer Tillu Square Movie Review)

tillusquare4.jpg

విశ్లేషణ:

'డీజీ టిల్లు' అనే సినిమాతో సిద్దు జొన్నలగడ్డ ఎంతగా పేరు తెచ్చుకున్నాడో అందరికీ తెలిసిన విషయమే. రెండేళ్ల తరువాత ఆ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన ఈ 'టిల్లు స్క్వేర్'పై అంచనాలు బాగానే పెరిగాయి. ఎందుకంటే ఈ సినిమా ప్రచార చిత్రాలు ఆసక్తికరంగా ఉండటమే కాకుండా, ముఖ్యంగా యువతలో బాగా క్రేజ్ ని తీసుకొచ్చింది. టిల్లు అనేవాడు నిజంగా మనమధ్య వున్నట్టుగా సిద్దు చేసాడు అంటే ఆ పాత్రలో అతను ఎంతగా ఒదిగిపోయాడు, ప్రేక్షకులకి ఎంతగా నచ్చాడో అర్థం అయిపోతుంది. ఇప్పుడు ఆ సినిమాకి మించిన అంచనాలతో ఈ సీక్వెల్ విడుదలైంది. (Tillu Square Movie Review) అయితే దర్శకుడు మల్లిక్ రామ్ పేరు దర్శకుడిగా వేసినా, ఈ సినిమాలో సిద్దు పాత్ర ఎక్కువని అర్థం అవుతోంది. కథ, మాటలు కూడా సిద్ధూ రాయటం, అందులోకి ఆ మాటలు తూటాల్లా పేలడం, థియేటర్స్ లో చూస్తున్న ప్రేక్షకులు ఒకటే నవ్వులతో మునగడం, ఇవన్నీ చూస్తే సిద్దు ఎంత టాలెంటెడ్ వ్యక్తి అనేది అర్థం అవుతోంది.

ఈ సినిమా మొత్తం సిద్దు వంటిచేత్తో నడిపాడు అనిపిస్తుంది. తన మాటలతో, హావ భావాలతో, వినోదంతో మొదటి నుండి చివరి వరకు కడుపుబ్బా నవ్విస్తూ ప్రేక్షకులకి మంచి వినోదాన్ని పంచిపెట్టాడు. సినిమా మొదలవటమే డీజీ టిల్లు కాస్తా టిల్లు ఈవెంట్స్ అని మార్చడం, టిల్లు కోసం పెళ్ళిలో పెళ్లికూతురు పెళ్లి చేసుకోను అనేదాకా రావటం, ఈ సన్నివేశాలన్నీ ముందు నుంచీ సినిమా మీద ఆసక్తిని పెంచుతాయి. అనుపమ పరమేశ్వరన్ కనిపించిన తరువాత కథ కొంచెం మామూలుగా వున్నా, ఎప్పుడైతే టిల్లు మళ్ళీ ఆ పాత అపార్ట్మెంట్స్ కి రావటం, అక్కడ ముందు సినిమాలో చనిపోయిన రోహిత్, రాధిక పాత్రలను గుర్తు చెయ్యడం, ఇవన్నీ కథలో ఆసక్తిని పెంచడమే కాకుండా 'డీజీ టిల్లు' కథని ఇక్కడ బాగా కలిపాడు. (Tillu Square Review) అలాగే అనుపమ పరమేశ్వరన్ ముందు అమాయకంగా కనిపించినా ఆమె నిజస్వరూపం చూపించే సన్నివేశం అయితే థియేటర్ మొత్తం నవ్వులతో నిండిపోతుంది. ఎందుకంటే ఆ సన్నివేశానికి ఇచ్చిన నేపధ్య సంగీతం ఆలా ఉంటుంది. అలాంటివి చాలానే వున్నాయి సినిమాలో. అనుపమ నేపధ్యం కూడా బాగానే చూపించాడు. అలాగే ముందు సినిమా 'డీజే టిల్లు' కి లింకప్ కూడా బాగానే ఇచ్చాడు.

anupamasiddhuone.jpg

ఇక క్లైమాక్స్ చిన్న చిన్న ట్విస్టులతో ఆసక్తిగా చూపించాడు. కథ మొత్తం చెప్పేస్తే చూసే ప్రేక్షకుడికి ఆసక్తి ఉండకపోవచ్చు అని ఇక్కడ అవన్నీ మాట్లాడటం లేదు కానీ, సినిమాలో ఆశ్చర్యం కొలిపే సన్నివేశాలు చాలానే వున్నాయి. దర్శకుడు మల్లిక్ రామ్, సినిమాని ఆసక్తిగా చూపించడంలో సఫలం అయ్యాడు. అలాగే సిద్దు జొన్నలగడ్డ కథ, మాటలు ఇప్పుడు ప్రేక్షకులకి ఎలా ఉండాలో, ఎలా ఉంటే ప్రేక్షకులకి నచ్చుతుందో వాళ్ళ నాడిని తెలుసుకొని అలానే రాసాడు సిద్దు. రామ్ మిరియాల సంగీతంలో ఇచ్చిన పాటలు అన్నీ సినిమా విడుదలకి ముందే మంచి విజయం సాధించాయి, సినిమాలో ఇంకా బాగుంటాయి. భీమ్స్ నేపధ్య సంగీతం సినిమాకి ఒక ఆయువుపట్టులా పనిచేసింది. ఛాయాగ్రహణం బాగుంది.

tillusquare1.jpg

ఇక నటీనటుల విషయానికి వస్తే సిద్దు జొన్నలగడ్డ మరోసారి టిల్లు పాత్రకి జీవం పోసాడు. సిద్దుకి స్టార్ డమ్ ఈ సినిమాతో ఇంకా పెరిగిపోతుంది అనటంలో సందేహం లేదు. అతని హావభావాలు, మాటలు చెప్పే తీరు, మిగతా పాత్రలతో అతని తీరు తెన్నులు అన్నీ ఎంతో సహజంగా ఉంటూ, మామూలు ప్రేక్షకుడికి బాగా దగ్గరయ్యే విధంగా టిల్లు పాత్రలో అదరగొట్టాడు. అతను మంచి ప్రతిభావంతుడు, ముందు ముందు అతని ప్రతిభ ఎలా ఉండబోతోందో ఈ సినిమాతో చెప్పొచ్చు. ఇక అనుపమ పరమేశ్వరన్ తనకిచ్చిన పాత్ర చాలా బాగా చేసింది. ఇందులో చాలా అందంగా, గ్లామర్ గా కనపడుతుంది అనుపమ. అలాగే సినిమాలో ఆమె పాత్ర ఆశ్చర్యంగా కూడా ఉంటుంది. మురళీధర్ గౌడ్ తండ్రిగా మెప్పించాడు. సిద్దు స్నేహితులుగా అందరూ సహజంగా వున్నారు. మురళి శర్మ అతిధి పాత్రలో కనిపిస్తాడు. ప్రిన్స్ సెసిల్ తో పాటు 'డీజే టిల్లు' లోని కొన్ని పాత్రలు ఇందులో కూడా కనపడతారు. అక్కడక్కడా చిన్న చిన్న అడల్ట్ జోక్స్ ఉంటాయి. ఇంకొక డైలాగ్ వుంది ఈ సినిమాలో, 'నువ్వు నిజంగానే ఈ కొశ్చన్ నన్ను అడుగుతున్నావా రాధికా?' ఈ డైలాగు ఎంత పాపులర్ అంటే, ఈ మాటలు సిద్దు చెపుతుంటే ప్రేక్షకులు నవ్వులే నవ్వులు.


చివరగా, 'టిల్లు స్క్వేర్' అనే సినిమా పేరుకి తగ్గట్టుగానే మొదటి సినిమా 'డీజే టిల్లు' కన్నా డబుల్ వినోదాన్ని పంచటమే కాకుండా ప్రేక్షకుల్ని నవ్వులతో ముంచెత్తుతుంది. నేను సినిమా చూస్తున్నంతసేపు నా చుట్టుపక్కల వున్న ప్రేక్షకులు అందరూ నవ్వుతూనే వున్నారు, అంటే ఈ సినిమాలో టిల్లు పాత్ర వాళ్ళకి అంతగా కనెక్టు అయిందో అర్థం చేసుకోండి. సినిమా అంతా సిద్దు జొన్నలగడ్డ మయం, ఒకే ఒక్కడు నడిపించాడు అని చెప్పాలి. ఇది సిద్దు సినిమా, టిల్లు సినిమా. డబుల్ ఎంటర్ టైనమెంట్. లాజిక్స్ ఆలోచించకుండా హాయిగా నవ్వుకోవచ్చు.

Updated Date - Mar 29 , 2024 | 04:43 PM