Prasanna Vadanam: సుహాస్ ‘ప్రసన్నవదనం’ ఎలా ఉందంటే.. ట్విట్టర్ రివ్యూ
ABN , Publish Date - May 03 , 2024 | 09:13 AM
సుహాస్ నటించిన చిత్రం ప్రసన్నవదనం ఈ రోజు శుక్రవారం (మే 3)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా చూసిన చాలామంది తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.
అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత సుహాస్ (Suhas) నటించిన చిత్రం ప్రసన్నవదనం (Prasanna Vadanam) ఈ రోజు శుక్రవారం (మే 3)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్స్, ట్రైలర్స్ మంచి బజ్ క్రియేట్ చేయగా సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇంతవరకు రానటువంటి ఫేస్ బ్లైండ్‌నెస్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈచిత్రానికి ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ వద్ద అసిస్టెంట్‌గా పని చేసిన అర్జున్ వై కె (arjun yk) ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. జెఎస్ మణికంఠ, టి ఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మించగా పాయల్ రాధాకృష్ణ (Payal Radhakrishna), రాశి సింగ్ (Rashi Singh) కథానాయికలుగా నటించారు.
తన కళ్ల ముందు జరిగిన హత్యలో తానే నిందితుడిగా చిక్కుకోవడం, అందులో నుంచి బయట పడడానికి తనకున్న జబ్బును అధిగమించి అసలు దోషిని ఎలా పట్టుకున్నాడనే ఇంట్రెస్టింగ్ కథతో సినిమా అద్యంతం సూపర్ థ్రిల్‌గా తెరకెక్కింది. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలవగా సినిమా చూసిన చాలామంది సినిమా గురించి తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. మూవీ ఎలా ఉంది, వారి పాత్రలు, నటుల యాక్టింగ్ గురించి చెబుతూ పోస్టులు పెడుతున్నారు. అయితే ఇప్పటివరకు వచ్చిన రివ్యూలన్నీ పాజిటివ్ టాక్‌తోనే ఉండడం గమనార్హం.
సినిమా ఫస్ట్ నుంచి చివరి వరకు ఎంగేజింగ్‌గా ఉందని చూస్తున్నంత సేపు సస్పెన్స్ కంటిన్యూ అయిందంటున్నారు. ముఖ్యంగా సుహాస్, వైవ హర్ష, పోలీసులుగా చేసిన నితిన్ ప్రసన్న, రాశి సింగ్ ల యాక్టింగ్ అదిరిపోయిందని, సినిమా చాలా వరకు థ్రిల్లింగ్ సాగుతూ చూసే ప్రేక్షకుడిని సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టే ప్రయత్నం చేసినట్లుగా పోస్టులు పెడుతున్నారు. ఫేస్ బ్లైండ్‌నెస్ అనే థీమ్ అదిరిపోయిందని..ఈ వేసవిలో ఈ సినిమాను అసలు మిస్ అవ్వోద్దంటూ సూచిస్తున్నారు.