Miss You Review: సిద్దార్థ్ నటించిన ''మిస్ యు' మెప్పించిందా..

ABN , Publish Date - Dec 14 , 2024 | 10:16 PM

ఒకప్పుడు హీరో సిద్థార్థ్‌ ప్రేమకథా చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌. కెరీర్‌ బిగినింగ్‌లో ఎక్కువగా రొమాంటిక్‌ ప్రేమకథలే చేశారు. తర్వాత లవ్‌స్టోరీలు పక్కనపెట్టి భిన్నమైన జోనర్లు టచ్‌ చేస్తూ సినిమాలు ట్రై చేశారు. అయినా తనకు బాగా కలిసొచ్చిన జానర్‌ను మాత్రం పక్కన పెట్టలేదు.


సినిమా రివ్యూ: 'మిస్ యు' (Miss u Movie Review)
విడుదల తేది: 14–12–2024
నటీనటులు: సిద్దార్థ్‌ (Siddharth) ఆషికా రంగనాథ్‌(Ashika Ranganath) , కరుణాకరన్‌, బాల శరవణన్‌, మరన్‌, సష్టిక తదితరులు


సాంకేతిక నిపుణులు:

సినిమాటోగ్రఫీ: కె.జి.వెంకటేష్‌
సంగీతం: జిబ్రాన్‌
ఎడిటర్‌: దినేష్‌ పొంరాజ్‌
నిర్మాత: శ్యామల్‌ మాత్యుప్‌
దర్శకత్వం: ఆర్‌.రాజశేఖర్‌ ( R RajaSekhar)

ఒకప్పుడు హీరో సిద్థార్థ్‌ ప్రేమకథా చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌. కెరీర్‌ బిగినింగ్‌లో ఎక్కువగా రొమాంటిక్‌ ప్రేమకథలే చేశారు. తర్వాత లవ్‌స్టోరీలు పక్కనపెట్టి భిన్నమైన జోనర్లు టచ్‌ చేస్తూ సినిమాలు ట్రై చేశారు. అయినా తనకు బాగా కలిసొచ్చిన జానర్‌ను మాత్రం పక్కన పెట్టలేదు. అలా చేసిన చిత్రం 'మిస్‌ యూ’. సినిమా ట్రైలర్‌ ఆసక్తిగా ఉన్నా, పట్నాలో జరిగిన 'పుష్ప –2' ట్రైలర్‌ వేడుకలో సిద్దార్థ్‌ చేసిన వ్యాఖ్యలతో బన్నీ ఫ్యాన్స్‌,  తెలుగు ప్రేక్షకులు సిద్దూపై గుర్రున ఉన్నారు. మరీ చిత్రం రీచ్‌ ఎలా ఉంటుందో చూద్దాం.  

కథ: (Miss u Movie Review)
వాసు (సిద్థార్థ్‌) దర్శకుడు కావాలని కలలు కనే ఓ యువకుడు. నిర్మాతల్ని కలిసి కథలు చెప్పే ప్రయత్నంలో ఓ ప్రమాదానికి గురై తన జీవితంలో చివరిగా గడిచిన రెండేళ్ల జ్ఞాపకాల్ని మరిచిపోతాడు. కోలుకున్న వాసు అనుకోకుండా కలిసిన బాబీ (కరుణాకరన్‌)తో కలిసి బెంగుళూరు వెళతాడు. అక్కడ బాబీ కేఫ్‌లో పనిచేస్తుండగా... సుబ్బలక్ష్మి (ఆషికా రంగనాథ్‌)ని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఆమె వాసు ప్రేమని తిరస్కరిస్తుంది. తన తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పి సుబ్బలక్ష్మిని ఒప్పించాలని తిరిగి ఇంటికొస్తాడు. సుబ్బలక్ష్మి ఫొటో చూసిన కుటుంబ సభ్యులు, స్నేహితులు షాక్‌ అవుతారు. సుబ్బలక్ష్మితో పెళ్లి కుదరదని, ఆమెని కాకుండా మరొకరిని పెళ్లి చేసుకోవాలని చెబుతారు. అయినా పట్టు వదలడు వాసు. అసలు కుటుంబ సభ్యులతో సుబ్బలక్ష్మి తో పెళ్లి ఎందుకు వద్దన్నారు? ఇంతకీ ఆమె ఎవరు? వాసుకీ, ఆమెకీ గతంలో ఏం జరిగింది? ఆ విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Miss-u.jpg

విశ్లేషణ: (Miss u Movie Review)
ప్రేమకథగా ఈ చిత్రం ఓపెనింగ్‌ బావుంది. అయితే ఈ చిత్రానికి ఓ రిఫరెన్స్‌ ఉంది. గతేడాది విడుదలైన ుహాయ్‌ నాన్న’ సినిమాని గుర్తు చేస్తుందీ సినిమా. అందులో పాప చుట్టూ కథ తిరిగితే, ఇందులో ఓ కేసుతో ముడిపెట్టారు. మిగతాదంతా సేమ్‌ టు సేమ్‌. హీరోకి మినిస్టర్‌ వార్నింగ్‌, హీరోకి యాక్పిడెంట్‌ వంటి సన్నివేశాలతో ముందు ఏం జరగబోతోందనే ఎగ్జైట్‌మెంట్‌ కలిగించినా.. అది కాసేపే ఉంటుంది. ఆ తర్వాత దర్శకుడు కథను షిప్ట్‌ చేసి సాదాగా చేసేశారు. హీరో ఓ సిటీకి వెళ్లడం, అక్కడ హీరోయిన్‌తో ప్రేమలో పడటం ఇవన్నీ రొటీన్‌ అంశాలే. ఇందులో ట్విస్ట్‌ వేరే సినిమాలో చూసిన భావన కలగడంతో అంత ఎగ్జైట్‌మెంట్‌ కలిగించదు. కథ దార్లో పడటానికి చాలా సమయం పడుతుంది. హీరో హీరోయిన్లు కలిశాకే కాస్త వేగం పెరుగుతుంది. మంచి లవ్‌ట్రాక్‌ పెట్టే స్కోప్‌ ఉన్నా దర్శకుడు అటుగా దృష్టి పెట్టలేదు. హీరో అమ్మాయిని చూడటం, ఆ వెంటనే తన ప్రేమని వ్యక్తం చేయడం, ఆమె తిరస్కరించడం... క్షణాల్లో  తేల్చేశారు. సుబ్బలక్ష్మితో  ప్రేమ విషయం ఇంట్లో చెప్పినప్పుడు కథలో చోటు చేసుకునే మలుపు సినిమాకి కీలకం. ద్వితీయార్థం ఆసక్తిని రేకెత్తించే విషయం అదే. అక్కడక్కడా కొన్ని కామెడీ సన్నివేశాలు, హీరోహీరోయిన్ల పాత్రలు మినహా చెప్పుకోవడానికి, గుర్తుపెట్టుకోవడానికి ఏమీ లేదు. గెస్‌ చేసే కథ, కథనాలు లవ్‌ స్టోరీలో భావోద్వేగాలు పండకపోవడం, సందర్భం లేకుండా వచ్చే పాటలతో సోసోగా సాగుతుంది. ఫ్లాష్‌బ్యాక్‌తో సాగే ద్వితీయార్థంలో బ్యాడ్‌ మ్యారేజ్‌ అంటే ఏమిటో చెప్పే సన్నివేశాలు, అభిప్రాయాలు కలవని హీరోహీరోయిన్ల మధ్య  సంఘర్షణ ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌ ఊహకు అందేట్లు ఉన్నాయి. వన్‌ లైనర్‌ డైలాగ్‌లు పేలాయి. రొమాంటిక్‌ కథల్ని ఇష్టపడే ప్రేక్షకుల్ని ఈ సినిమా అక్కడక్కడా మెప్పిస్తుంది. (Miss u Movie Review)

సిద్థార్థ్‌ తన స్టైల్లో వాసు పాత్రను అలవోకగా చేశారు. ఆయన నటించిన గత లవ్‌స్టోరీల్లో యాక్ట్‌ చేసినంతగా ఇందులో నటనకు సవాల్‌ విసిరేంత సన్నివేశాలేవీ లేవు. హీరోయిన్‌ ఆషికా రంగనాథ్‌, సిద్ధార్థ్‌ తెరపై మంచి జోడీ కనిపిస్తారు. ఇద్దరు భావోద్వేగ సన్నివేశాలు అదరగొట్టారు. ఆషికా నటన, ఆమె కనిపించిన విధానం సినిమా ఎసెట్‌ అయింది. జేపీ, కరుణాకరన్‌, మారన్‌, సష్టిక పరిధి మేరకు యాక్ట్‌ చేశారు. టెక్నికల్‌గా సినిమా బావుంది, వెంకటేష్‌ సినిమాటోగ్రఫీ, జిబ్రాన్‌ బాణీలు ఆకట్టుకున్నాయి. అయితే విజువల్‌గా పాటలు అంతా ఎఫెక్టివ్‌గా లేదు. యాక్షన్‌ ఎపిసోడ్స్‌ సాదాగా ఉన్నాయి. నిర్మాణ విలువలు బావున్నాయి. పెట్టిన ఖర్చు తెరపై కనిపించింది. దర్శకుడు రాజశేఖర్‌ కథ, కథనాల పరంగా కాస్త వర్క్‌ చేసుంటే బావుండేది. కామెడీ, ట్విస్ట్‌ల విషయంలో రైటింగ్‌ స్కిల్స్‌ కనిపించాయి. లవ్‌, ఎమోషన్స్‌ మీద మరింత దృష్టి పెట్టాల్సింది. పాత కథే కావడంతో కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు.

ట్యాగ్‌లైన్‌.. మిస్‌ యూ.. ఏదో మిస్‌ అయింది.
 

 

Updated Date - Dec 14 , 2024 | 10:22 PM