Razakar Movie Review: రజాకార్ నేపథ్యంలో తీసిన సినిమా ఎలా వుందంటే..

ABN , Publish Date - Mar 15 , 2024 | 03:01 PM

నిజాం పాలనకు, ఖాసిం రజ్వీ తన రజాకార్ సైన్యంతో చేసిన మతోన్మాద మారణ హోమానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు ఎటువంటి సాయుధ పోరాటం చేశారు, ప్రజలు ఎలా తిరగబడ్డారు అనేది చరిత్ర పుటల్లో, పుస్తకాల్లో అందరికీ తెలిసిందే. ఇప్పుడిదే కథ తెరరూపంగా వచ్చింది. ‘రజాకార్’ పేరుతో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందంటే..

Razakar Movie Review: రజాకార్ నేపథ్యంలో తీసిన సినిమా ఎలా వుందంటే..
Razakar Movie Review Poster

సినిమా: ‘రజాకార్’

నటీనటులు: రాజ్ అర్జున్, మకరంద్ దేశ్ పాండే, తేజ సప్రూ, బాబీ సింహ, వేదిక, ఇంద్రజ, అనసూయ, ప్రేమ, జాన్ విజయ్, దేవి ప్రసాద్ తదితరులు

సంగీతం: భీమ్స్ సిసిరోలియో

ఛాయాగ్రహణం: కె రమేష్ రెడ్డి

నిర్మాత: గూడారు నారాయణ రెడ్డి

రచన, దర్శకత్వం: యాట సత్యనారాయణ

విడుదల తేదీ: మార్చి 15, 2024

రేటింగ్: 3 (మూడు)

-- సురేష్ కవిరాయని

1947 సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది, కానీ హైదరాబాద్‌కి మాత్రం స్వాతంత్ర్యం రాలేదు. హైదరాబాద్‌తో పాటు మిగతా తెలంగాణ ప్రాంతం నిజాంల పాలనలో వుండింది. ఖాసిం రజ్వీ అనే ఒక మత ఛాందసుడు, నిజాం పాలనలో రజాకార్ సైన్యాన్ని ఏర్పాటు చేసి, హిందూ ప్రజలపై దాడులు చేయడమే కాకుండా.. హైదరాబాద్‌ని భారతదేశంలో విలీనం కాకుండా అడ్డుకున్నాడు. నిజాం పాలనకు, రజాకార్ సైన్యానికి తెలంగాణ ప్రజలు ఎదురొడ్డి చేసిన పోరాటమే ‘తెలంగాణ విముక్తి పోరాటం’. ఖాసిం రజ్వీ స్థాపించిన రజాకార్ సైన్యం ప్రజలపై ఎటువంటి ఘాతుకాలకు పాల్పడింది, దానికి ప్రజలు ఎలా ఎదురుతిరిగారు, అప్పటి భారత ప్రభుత్వం ఎలా స్పందించింది? అనే నేపథ్యంలో తీసిన సినిమా ఇది. యాట సత్యనారాయణ దర్శకుడు, గూడూరు నారాయణ రెడ్డి నిర్మాత. చరిత్ర ఆధారంగా తీసిన ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.. (Razakar Movie Review)

Razakar-2.jpg

Razakar Movie Story కథ:

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది కానీ హైదరాబాద్ మాత్రం నిజాంకు చెందిన ఏడో రాజు మీరు ఉస్మాన్ అలీ ఖాన్ (మకరంద్ దేశ్ పాండే) పరిపాలనలో వుంది. భారత ప్రభుత్వం జవహర్ లాల్ నెహ్రూ ప్రధానిగా, సర్దార్ వల్లభాయ్ పటేల్ హోం మంత్రిగా దేశంలోని సంస్థానాలను, రాజ్యాలను భారతదేశంలో విలీనం చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ హైదరాబాద్ రాజు నిజాం మాత్రం అందుకు ససేమిరా ఒప్పుకోకుండా స్వంతత్రంగా వ్యవహరించాలని అనుకుంటాడు. ఖాసిం రజ్వీ (రాజ్ అర్జున్) అతని ప్రైవేట్ ఆర్మీ అయిన రజాకార్ సైన్యంతో, అప్పటి నిజాం ప్రధాని లాయక్ అలీ ఖాన్ (జాన్ విజయ్) తో హైదరాబాద్‌ను పాకిస్తాన్ దేశం సహాయంతో తుర్కిస్తాన్‌గా మార్చడానికి ఒక కుట్ర పన్నుతాడు. అందుకు తమ రాజ్యంలోని హిందూ ప్రజలని హింసించి, వారిపై అనేకరకాలైన దాడులు చేస్తూ, వాళ్ళని మతం మార్చుకోవాల్సిందిగా ఒత్తిడి తెస్తాడు. తెలుగు, కన్నడ, మరాఠీ లాంటి అనేక భాషలను నిషేధించి కేవలం ఉర్దూ మాత్రమే ఉండాలని చట్టం తెస్తాడు. తమకి ఇష్టమొచ్చిన రీతిలో ప్రజలపై పన్నులు విధిస్తూ, ఖాసిం రజ్వీ నేతృత్వంలోని రజాకార్ సైన్యం ఒక మారణహోమాన్ని సృష్టిస్తుంది. వారికి ఎదురు తిరిగిన గ్రామాలను స్మశానవాటికలా తయారు చేస్తారు. అప్పటి భారత హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ (రాజ్ సప్రూ) నిజాం పాలన చేస్తున్న మారణ కృత్యాలను తెలుసుకొని సైనిక చర్యకి పూనుకోవాలని అనుకుంటారు. నిజాం పాకిస్తాన్ సహాయం కోరి, భారత సైన్యం రాకుండా తెలంగాణ ప్రాంత సరిహద్దులన్నింటినీ మూసివేస్తాడు. ఇటువంటి పరిస్థితుల్లో భారత సైన్యం ఏవిధంగా హైదరాబాద్ చేరుకుంది, ఎలా నిజాం పాలనకి చరమగీతం పాడింది? తెలంగాణ ప్రజలు ఎటువంటి పోరాటం చేశారు? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ ‘రజాకార్’ సినిమా చూడాల్సిందే. (Razakar Movie Report)


విశ్లేషణ:

దర్శకుడు యాట సత్యనారాయణ సినిమా పేర్లు వేసినప్పుడే భారతదేశానికి స్వాతంత్ర్యం రావటం, దేశంలోని పరిస్థితులు, తెలంగాణ చరిత్ర, నిజాం పాలనలో హైదరాబాద్ ఉండటం ఇవన్నీ చెప్పి నేరుగా కథలోకి వెళ్ళాడు. ప్రపంచ పోరాటాల్లో తెలంగాణ సాయుధ పోరాటానికి ఒక ప్రత్యేకత వుంది. నిజాం పాలనలో, ఖాసిం రజ్వీ నేతృత్వంలో తెలంగాణ ప్రజలు ఎంతటి కష్టాలు పడ్డారన్నది అందరికీ తెలిసిన విషయమే. ఆ పోరాటం గురించి ఎన్నో చారిత్రిక ఆధారాలు కూడా వున్నాయి. హిందూ ప్రజలపై, ముఖ్యంగా హిందూ స్త్రీ కనపడితే చాలు అప్పట్లో ఎంత పైశాచికంగా రజాకార్ సైన్యం ప్రవర్తించారు అన్నది చరిత్ర పుటల్లో చెప్పే సత్యాలు. ఈరోజుకి మన పూర్వీకులని అడిగితే చెబుతారు. మత మార్పిడులు, అనేకరకాలైన పన్నులు, మాటవినని ప్రజలను చిత్ర హింసలకు గురిచేయడం, సజీవ దహనాలు, ఒకటేమిటి రజాకార్ సైన్యం ఒక మారణహోమం సృష్టించింది. అవన్నీ దర్శకుడు వెండితెరపై కళ్ళకు కట్టినట్టుగా చూపించాడు. తెలంగాణ ప్రజలనుండి ఒక్కొక్క నాయకుడు రజాకార్ సైన్యానికి ఎదురొడ్డి నిలబడటం, ప్రజాసమీకరణ చేయడం, చివరికి సైన్యం చేతిలో ఓడిపోవటం, తిరుగుబాటు చేసిన గ్రామాలను తగలబెట్టడం, స్మశానవాటికలా తయారు చేయడం.. అవన్నీ దర్శకుడు చక్కగా చూపించగలిగాడు. కొన్ని సన్నివేశాలు చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి, అంతలా చూపించాడు. అయితే ఖాసిం రజ్వీ, నిజాం అండతో చేసిన అకృత్యాలు విన్నప్పుడు, చదివినప్పుడు చూస్తే కనక సినిమాలో చూపించినవి ఇంకా తక్కువే అనిపిస్తుంది. (Razakar Movie Talk)

Razakar-1.jpg

ఈ సినిమాలో ఒక కథానాయకుడు అంటూ ఎవరూ వుండరు. ప్రతి పదిహేను నిమిషాలకి ఒక నాయకుడు వస్తూ వుంటారు, తిరుగుబాటు చేస్తారు, కానీ రజాకార్ సైన్యం చేతిలో హతం అయిపోతారు. అయితే అవన్నీ కూడా తెలంగాణ సాయుధ పోరాటంలో వీరమరణం పొందిన నాయకుల వీర గాధలే. ఇవన్నీ ఒకపక్క చూపిస్తూనే, భారత హోం మంత్రి వల్లభాయ్ పటేల్ హైదరాబాద్‌లో జరుగుతున్న అకృత్యాలు వింటూ ఎటువంటి చర్య తీసుకోవాలన్న సమాలోచనలు కూడా చూపిస్తూ ఉంటాడు దర్శకుడు. రెండో సగంలో పరకాల జెండా ఉద్యమం సన్నివేశం వణుకు తెప్పిస్తుంది. అలాగే భైరాన్ పల్లె గ్రామ వాసుల సాయుధ పోరాటం.. ఈశ్వరయ్య, గండయ్య టీమ్ నిజాం ప్రభువుపై బాంబు దాడి, ఇవన్నీ రెండో సగంలో బాగుంటాయి. రెండో సగంలో వల్లభాయ్ పటేల్ హైదరాబాద్‌లోకి తన సైన్యాన్ని ఏ విధంగా నడిపించాలి, సైన్యానికి తెలంగాణ ప్రజలు స్వాగతం పలికిన తీరు ఆ సన్నివేశాలు ఒళ్ళు గగుర్పాటు చెందే విధంగా ఉంటాయి.

అయితే ఇది అందరికీ తెలిసిన కథే అయినా, కమ్యూనిస్ట్‌ల పాత్ర కూడా కీలకం, అలాగే ఎంతోమంది నాయకులు తమ రచనల ద్వారా తెలంగాణ ప్రజలను ఉత్తేజ పరిచారు, వ్యతిరేకంగా పోరాడారు. ఆ నాయకుల పాత్రలు కూడా చూపించి ఉంటే బాగుండేది. అలాగే హింస తగ్గించి కాస్త.. కథనం మీద దృష్టి పెట్టి ఉంటే ఇంకా బాగుండేది అనిపిస్తుంది. మొత్తం మీద దర్శకుడు యాట సత్యనారాయణకి కథపై పట్టుతో వున్నది వున్నట్టుగా తీసి చూపించడంలో మంచి మార్కులు వేయవచ్చు. ఈ సినిమాకి భీమ్స్ సంగీతం ఒక ఆయువుపట్టు అని చెప్పొచ్చు, అలాగే ఛాయాగ్రహణం కూడా ఇంకొక ముఖ్యమైన కారణం. ఎందుకంటే అప్పటి హైదరాబాద్‌ని, సైన్యం చేసే ఘాతుకాలని, అవన్నీ ఛాయాగ్రహణం ద్వారా బాగా చూపించే ప్రయత్నం చేశారు. ఈ సినిమాకి ఇంకో హైలైట్ నటీనటుల ప్రతిభ. (#RazakarReview)

Razakar-3.jpg

ఇక నటీనటుల విషయానికి వస్తే ఖాసిం రజ్వీ పాత్రలో రాజ్ అర్జున్ ఆ పాత్రలో జీవించేశాడనే చెప్పాలి. హావభావాలు, అతని నటన, అసలు నిజంగా ఖాసిం రజ్వీ తెరమీద కనిపించాడు అన్నంత అద్భుతంగా పోషించారు. అతని చేత అంతలా చేయించిన దర్శకుడిని ప్రశంసించాలి. అలాగే నిజాంగా మకరంద్ దేశ్ పాండే ఆ పాత్రలో ఒదిగిపోయాడు. వల్లభాయ్ పటేల్‌గా రాజ్ సప్రూ మంచి ప్రతిభ కనపరిచాడు. జాన్ విజయ్ నిజాం ప్రధానిగా పరవాలేదు అనిపించాడు. ఇక చాకలి ఐలమ్మగా ఇంద్రజ చేసిన పాత్ర మెరిసింది. రాజా రెడ్డిగా బాబీ సింహ ఒక ముఖ్య పాత్రలో వచ్చి తళుక్కున మెరుస్తాడు. అనసూయ పాత్ర చిన్నదే అయినా, ఒక బతుకమ్మ పాటలో కనిపించడమే కాకుండా, తరువాత వచ్చే సన్నివేశంలో చేసిన నటన హైలైట్ అని చెప్పాలి. నటి వేదిక సంతవ్వగా కనబడుతుంది. ప్రేమ కూడా ఒక మంచి పాత్ర చేసింది. ఇలా నటీనటులు అందరూ ఎంతో చక్కగా నటించబట్టి సినిమా ఎంతో ఆసక్తికరంగా సాగిందని చెప్పాలి. ఛాయాగ్రహణంతో పాటు ఆర్ట్ డిపార్టుమెంట్‌కి కూడా మంచి కితాబునివ్వాలి. ఎందుకంటే అప్పటి వాతావరణం, అప్పటి సన్నివేశాలు కళ్ళకు కట్టినట్టుగా చూపించినందుకు. అయితే ఈ సినిమా కొంతమందికి నచ్చకపోవచ్చు, ఎందుకంటే ఇది ఒక సామాజిక వర్గానికి వ్యతిరేకంగా ఉన్నట్టు ఉంటుంది కానీ, అప్పటి పరిస్థితులకి వున్న చారిత్రిక ఆధారాలను బట్టి కథ చూపించడం జరిగింది అనటంలో సందేహం లేదు. సాంకేతికంగా ఎంతో ఉన్నతంగా వున్న సినిమా ఇది. అక్కడక్కడా కొన్ని లోపాలున్నా, ఇది చూడాల్సిన సినిమా అని చెప్పొచ్చు. అయితే ఇది తెలిసిన కథే అయినా, మిగతా ప్రాంతాలలో ఎటువంటి ఆదరణ పొందుతుంది అన్నదే ప్రశ్న. (Razakar Telugu Movie)

చివరగా.. నిజాం పాలనకు, ఖాసిం రజ్వీ తన రజాకార్ సైన్యంతో చేసిన మతోన్మాద మారణ హోమానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు ఎటువంటి సాయుధ పోరాటం చేశారు, ప్రజలు ఎలా తిరగబడ్డారు అనేది చరిత్ర పుటల్లో, పుస్తకాల్లో వున్న కథకి అద్భుతమైన తెర రూపం ఇచ్చాడు దర్శకుడు యాట సత్యనారాయణ ఈ ‘రజాకార్’ సినిమాతో.

Updated Date - Mar 15 , 2024 | 03:05 PM