Lal Salaam Movie Review: రజినీకాంత్ కుమార్తె దర్శకత్వం వహించిన సినిమా ఎలావుందంటే...
ABN , Publish Date - Feb 09 , 2024 | 06:59 PM
రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన 'లాల్ సలాం' సినిమాకి అతని కుమార్తె ఐశ్వర్య దర్శకురాలు. జీవిత రాజశేఖర్ ఒక ముఖ్యపాత్రలో, విష్ణు విశాల్ ఒక కథానాయకుడిగా నటించిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా వుందో చదవండి.
సినిమా: లాల్ సలాం
నటీనటులు: రజనీకాంత్, జీవిత రాజశేఖర్, నిరోషా, విష్ణు విశాల్, విక్రాంత్, సెంథిల్, ధన్య బాలకృష్ణ, విగ్నేష్, ఆదిత్య మీనన్ తదితరులు
కథ, ఛాయాగ్రహణం: విష్ణు రంగసామి
రచన: విష్ణు రంగసామి, ఐశ్వర్య రజనీకాంత్
సంగీతం: ఏఆర్ రెహమాన్
దర్శకత్వం: ఐశ్వర్య రజనీకాంత్
నిర్మాత: సుభాస్కరన్
విడుదల తేదీ: 9 ఫిబ్రవరి, 2024
రేటింగ్: 2 (రెండు)
-- సురేష్ కవిరాయని
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా విడుదలవుతోంది అంటే ఎంత హంగామా ఉండాలి, ఎంత బజ్ ఉండాలి, కానీ అతను నటించిన 'లాల్ సలాం' కి అవేమీ కనిపించలేదు. ఈ సినిమాకి రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహించారు. ఇంతకు ముందు రజినీకాంత్ సినిమా 'జైలర్' విడుదలై విజయఢంకా మోగించి రజినీకాంత్ కి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు తెలుగు, తమిళంలో విడుదలైన ఈ 'లాల్ సలాం' కి అసలు ప్రచారాలే లేవు. చాలా కాలం తరువాత జీవిత రాజశేఖర్ ఈ సినిమాతో వెండితెరపై కనిపించారు. విష్ణు విశాల్, విక్రాంత్ ఇద్దరూ రెండు ముఖ్య పాత్రలు పోషించారు. ఇంతకీ ఈ సినిమా ఎలావుందో చూద్దాం.
Lal Salaam Story కథ:
ఇది ఒక పీరియడ్ డ్రామా, 1993లో జరిగే కథ, ఇదే సంవత్సరంలో ఒక సంఘటన యావత్ భారతదేశాన్ని ఒక కుదుపు కుదిపిన సంగతి తెలిసిందే. కసుమూరు అనే ప్రాంతంలో హిందువులు, ముస్లింలు ఐకమత్యంగా కలిసి ఉండేవారు. కానీ అదే ఊరిలో జరిగిన ఒక క్రికెట్ మ్యాచ్ లో మొయిద్దీన్ (రజినీ కాంత్) కొడుకు శంషుద్దీన్ (విక్రాంత్) చేతిని, గురు (విష్ణు విశాల్) నరికేస్తాడు. ఇక అక్కడ నుండి రెండు మతాల వారి మధ్య గొడవలు వస్తాయి. ఈ గొడవలను అదే ప్రాంతంలో వున్న కొందరు రాజకీయ నాయకులు తమ స్వార్ధానికి ఉపయోగించుకోవాలని చూస్తుంటారు. అదీ కాకుండా ఈ గొడవలు ఆ రాజకీయ నాయకులే వెనకాల నుండి ఉసిగొల్పుతూ వుంటారు. మొయిద్దీన్ (రజినీకాంత్), గురు తండ్రి (ఫిలిప్ లివింగ్‌స్టోన్ జోన్స్) ఒకప్పుడు ప్రాణ స్నేహితులు. గురు తల్లి రాణి (జీవిత), మొయిద్దీన్‌ని అన్న అని పిలుస్తూ ఉంటుంది. అటువంటి మొయిద్దీన్ కొడుకు చేతిని తన ప్రాణ స్నేహితుడు కొడుకు నరికేస్తే మరి మొయిద్దీన్ ఏమి చేశాడు? ఆ ఊరిలో గొడవలు తెస్తున్నాడు అని గురు ఇంటిని కూడా ఆ ఊర్లోవాళ్ళు తగలబెట్టేస్తారు, అతన్ని వూరునుండి పంపించేస్తారు. రంజీ క్రికెట్‌కి సెలెక్ట్ అయి, చెయ్యి విరగొట్టుకున్న శంషుద్దీన్ ఏమి చేశాడు? అసలు గురు, శంషుద్దీన్ మధ్య గొడవకు కారణం ఏంటి? ఆ వూర్లో సంవత్సరానికి ఒకసారి జరిగే అమ్మవారి పండగకి రథం ఎంత అవసరం? ఇవన్నీ తెలియాలంటే 'లాల్ సలాం' చూడాల్సిందే.
విశ్లేషణ:
మొదటగా ఇందులో రజినీకాంత్ పాత్ర ఏదో అతిధి పాత్ర అన్నారు, కానీ అతని పాత్ర నిడివి చాలా ఎక్కువే ఉంటుంది. ప్రధాన పాత్ర పోషించిన విష్ణు విశాల్ పాత్రకన్నా రజినీకాంత్ పాత్ర నిడివి ఎక్కువ ఉంటుంది. అందుకని అతనిది అతిధి పాత్ర కాదు. ఇక దర్శకురాలి ఐశ్వర్య రజినీకాంత్ జాతీయ సమైక్యత, మతసామరస్యం చెప్పాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ సినిమా తీసినట్టుగా కనబడింది. ఈ సినిమాలో హిందూ, ముస్లిం ఈ రెండు మతాల మధ్య వచ్చే కలహాలు కొందరు రాజకీయ నాయకులు తమ స్వలాభం కోసం, సృష్టించిన స్వార్ధపూరిత కుట్రగా దర్శకురాలు చూపించడానికి ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. అందుకనే ఈ సినిమాలో వివాదాలు ఉండొచ్చేమో అని అనుకున్నారు కానీ, అలాంటివి ఏమీ లేవు.
రెండు మతాలకి చెందిన ఇద్దరు ప్రాణస్నేహితులు, వారి కుమారులు ఇద్దరూ ఒక క్రికెట్ మ్యాచ్ లో గొడవపడతారు. అదే వూర్లో అమ్మవారి జాతర ఏటేటా జరుగుతూ ఉంటుంది, పక్క వూరు నుండి రథం తీసుకువచ్చి అమ్మవారిని ఊరేగిస్తారు. క్రికెట్ మ్యాచ్ లో గొడవ, అమ్మవారి జాతర రెండూ కలిపి ఈ ఇద్దరి ప్రాణస్నేహితుల కుటుంబాల మధ్య వైరం వచ్చేట్టు కొంతమంది చేస్తారు. అయితే ప్రధాన పాత్ర మొయిద్దీన్, అది పోషించిన రజినీకాంత్ ఈ రెండు కుటుంబాలని ఎలా రక్షించుకున్నాడు, మతసామరస్యాన్ని ఎలా చాటారు అన్నదే ప్రధాన కథ. దర్శకురాలు మొదటి సగం అంతా క్రికెట్ మ్యాచ్, గొడవలకి దారితీసిన సంఘటనలు, రెండో సగం అంతా రథం తయారుచేయడం కోసం గురు పాత్ర పోషించిన విష్ణు విశాల్ ఎలా కష్టపడ్డాడు అనే దానిపై ప్రధానంగా నడిపారు.
అయితే కథ చాలా నత్తనడకగా సాగుతూ, ఎక్కువ సాగదీతలతో సన్నివేశాలుంటాయి. కొన్ని సన్నివేశాలైతే ప్రేక్షకుల సహనానికి పరీక్ష అన్నట్టుగా ఉంటాయి. ఎందుకంటే క్రికెట్ మ్యాచ్ ఆడటం ఎక్కువసేపు చూపించటం, కథ అక్కడే ఎక్కువసేపు తిరుగుతూ ఉండటం ఆ సన్నివేశాలన్నీ బోర్ కొట్టించే విధంగా ఉంటాయి. ముందు ముందు కథ ఎలావుండబోతోందో, చివర్లో ఏమి జరుగుతుందో ప్రేక్షకులు ముందే వూహించుకున్నట్టుగానే నడుస్తూ ఉంటుంది. విష్ణు విశాల్ కి చిన్న ప్రేమ కథ ఉంటుంది, అది మరీ చొప్పించినట్టుగా ఉంటుంది, రెండో సగంలో అయితే ఆ ప్రేమ కథ ఒక సన్నివేశం మాత్రమే ఉంటుంది. అదెందుకు పెట్టారో దర్శకురాలికే తెలియాలి. విష్ణు విశాల్‌ని తల్లి నువ్వు ఊరి నుండి వెళ్ళిపో అని తిడుతుంది, నువ్వు చనిపోయినా పరవాలేదు కానీ ఊర్లోకి మాత్రం రాకు అని అంటుంది. అదే కొడుకు ఊర్లోకి డబ్బులతో రాగానే నవ్వుతూ అతడిని ఆహ్వానిస్తుంది. ఇలాంటి విచిత్రమైన సన్నివేశాలు చాలా వున్నాయి. అక్కడక్కడా తప్పితే సినిమాలో భావోద్వేగాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. అదీకాకుండా ఎందుకనో తెలుగులో ఈ సినిమా ప్రచారం అసలు చేయలేదు. చూస్తున్నంతసేపు ఒక తమిళ సినిమా చూస్తున్నట్టుగా ఉంటుంది, కాబట్టి ఇది తెలుగువాళ్ళకు అంతగా ఎక్కకపోవచ్చు. ఒక్క జీవిత తప్పితే తెలుగు నటీనటులు చాలా తక్కువ.
ఇవన్నీ పక్కన పెడితే రజినీకాంత్‌కి మొదటిసారిగా సాయికుమార్ డబ్బింగ్ చెప్పారు. సాయి కుమార్ గొంతు చాలా పెద్దది, అది రజినీకాంత్‌కి అసలు సరిపోలేదు. రజినీకాంత్ వుండే శరీరాకృతికి, అతని పాత్రకి సాయి కుమార్ గొంతు చాలా పెద్దగా అయిపోవటమే కాకుండా కొంచెం ఎబ్బెట్టుగా కూడా వుంది. నటీనటుల విషయానికి వస్తే రజినీకాంత్ మొయిద్దీన్‌గా బాగా చేశారు. కానీ అతని అభిమానులు ఆశించినంత స్థాయిలో అయితే మాత్రం అతని పాత్రని తీర్చిదిద్దలేదు. ఇక జీవిత రాజశేఖర్ సినిమాలో ప్రధాన ఆకర్షణ అని చెప్పాలి. ఆమె విష్ణు విశాల్ తల్లిగా మంచి పాత్ర పోషించటమే కాకుండా, అభినయంతో ఆకట్టుకున్నారు. విష్ణు విశాల్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు, ప్రతిభ చూపాడు. చాలామంది సీనియర్ నటులు కనిపిస్తారు, అందరూ తమ పాత్రల పరిధి మేరకు చేశారు. ఇక ఈ సినిమాకి సంగీతం ఏఆర్ రహమాన్ అంటే ఎవరూ నమ్మరు, ఎందుకంటే అతను ఈ సినిమాకి పనిచేసినట్టే తెలియదు, అంటే సంగీతం అంత నాసిరకంగా వుంది. అతనివల్ల ఈ సినిమాకి ఎటువంటి ఉపయోగం లేదు. ప్రఖ్యాత క్రికెట్ ఆటగాడు కపిల్ దేవ్ అక్కడక్కడా కనబడతారు, కానీ అతన్ని కేవలం ప్రచారానికి ఉపయోగించుకున్నారు అని అర్థం అవుతుంది. ఛాయాగ్రహణం కొన్ని సన్నివేశాల్లో బాగుంది.
చివరగా, 'లాల్ సలాం' అనే సినిమా దర్శకురాలు ఐశ్వర్యతో బలవంతంగా కావాలని చేయించినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమా చూస్తే ఈ సినిమాపై ఎవరికీ ఆసక్తి వున్నట్టుగా కనిపించదు. కథ సరిగ్గా లేదు, కథనం ఆసక్తికరంగా లేదు, పాత్రలు మామూలుగా ఉంటాయి, పెద్ద సంగీత దర్శకుడు, కానీ సంగీతం అసలు బాగోలేదు, క్రికెట్ ఆటగాడు కపిల్ దేవ్ కూడా వున్నారు. ఇలా ఎన్ని హంగులు వున్నా, ఈ సినిమాపై ఎందుకో ఎవరికీ ఆసక్తి లేదు, రజినీకాంత్ అభిమానులు కూడా చూస్తారని అనుకోము, ఎందుకంటే వాళ్ళకి కూడా నచ్చకపోవచ్చు.