Bagheera Telugu Review: ‘బఘీర’ రివ్యూ.. ప్రశాంత్ నీల్ బావ సినిమా ఎలా ఉందంటే

ABN , Publish Date - Oct 31 , 2024 | 08:39 PM

క‌న్న‌డ ‘ఉగ్రమ్’ ఫేమ్, సంచలన దర్శకుడు ప్ర‌శాంత్ నీల్ బావ‌ రోరింగ్ స్టార్ శ్రీమురళి నటించిన‌ యాక్షన్ చిత్రం ‘బఘీర’. ఈ సినిమా ఈరోజు (అక్టోబ‌ర్ 31) ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌రి ప్రేక్ష‌కుల‌ను ఈ సినిమా ఏ రేంజ్‌లో అల‌రించిందో చూద్దాం.

bhagheera

సినిమా రివ్యూ: ‘బఘీర’

విడుదల తేది: 31–10–2024

నటీనటులు: శ్రీమురళి, రుక్మిణి వ‌సంత్, అచ్యుత్‌, గ‌రుడ రామ్‌, ప్ర‌కాశ్ రాజ్‌

కథ: ప్రశాంత్ నీల్

సంగీతం: అజనీష్ లోక్‌నాథ్

నిర్మాతలు: హోంబ‌లే ఫిల్మ్స్ విజయ్ కిరగందూర్

దర్శకుడు: DR. సూరి

GbNzKHXakAAtfy9.jpeg

క‌న్న‌డ ‘ఉగ్రమ్’ ఫేమ్, సంచలన దర్శకుడు ప్ర‌శాంత్ నీల్ బావ‌మ‌రిది, రోరింగ్ స్టార్ శ్రీమురళి నటించిన‌ ఎక్సయిటింగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘బఘీర’. రుక్మిణి వ‌సంత్ క‌థానాయిక‌. ప్ర‌భాస్ ‘స‌లార్’ చిత్రానికి ర‌చ‌యిత‌గా ప‌నిచేసిన‌ DR. సూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా ‘కేజీఎఫ్‌, కాంతార, స‌లార్’ చిత్రాల నిర్మాణ‌ సంస్థ హోంబ‌లే ఫిలింస్ ఈ సినిమాను నిర్మించింది. అంతేకాక ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ కథ అందించ‌డం విశేషం. సినిమా రిలీజ్‌కు ముందే వ‌చ్చిన ట్రైల‌ర్‌, టీజ‌ర్‌, అంత‌కుమించి ప్ర‌శాంత్ నీల్ అనే పేరు సినిమాపై ఓ రేంజ్‌లో అంచ‌నాలు పెంచిన ఈ సినిమా ఈరోజు (అక్టోబ‌ర్ 31) ప్రేక్ష‌కుల ముందుకువ‌చ్చింది. మ‌రి ప్రేక్ష‌కుల‌ను ఈ సినిమా ఏ రేంజ్‌లో అల‌రించిందో చూద్దాం.

GbOcW_DXAAAO9At.jpeg

క‌థ‌: చిన్న‌ప్ప‌టి నుంచే సూప‌ర్ హీరో కావాల‌ని క‌ల‌లు క‌న్న వేదాంత్ (శ్రీమురళీ) త‌న త‌ల్లి పోలీసుల గురించి చెప్పిన క‌థ‌లు విని ప‌ట్టుద‌ల‌తో పోలీసాఫీస‌ర్ అవుతాడు. మొద‌టి సారి చార్జ్ తీసుకున్న మొదలు అక్రమార్కుల తాట తీస్తుంటాడు. కానీ కొద్దిరోజుల త‌ర్వాత‌ పై అధికారులు హెచ్చ‌రించడం, తండ్రి కూడా అవినీతి ప‌రుడ‌ని తెలుసుకుని త‌న జాబ్‌పై అస‌హనంతో ఉంటుంటాడు. ఈ నేప‌థ్యంలో ఓ రోజు త‌న పోలీస్ స్టేష‌న్ ముందే మాన‌భంగానికి గురైన మ‌హిళ సుసైడ్ చేసుకోవ‌డంతో త‌ట్టుకోలేకపోయిన వేదాంత్ మాస్క్ వేసుకుని భ‌ఘీర అవ‌తార‌మెత్తుతాడు. ఉద‌యం పూట త‌న స్టేష‌న్‌కు వ‌చ్చే ఫిర్యాదుల‌ను నోట్ చేసుకుని రాత్రి వేళ భ‌ఘీరాగా మారి రౌడీల అంతు చూస్తుంటాడు. ఈ క్ర‌మంలో ఇద్ద‌రు నోటెడ్ క్రిమిన‌ల్స్‌ను చంపేస్తాడు. అయితే వీట‌న్నింటి వెన‌కాల అస‌లు సూత్రధారి రానా వేరే ఉన్నాడ‌ని తెలుసుకుని అత‌ని గురించి ఆరా తీయ‌డం మొద‌లు పెడ‌తాడు. ఈ నేప‌థ్యంలో భ‌ఘీరా, రానా గురించి అత‌ను చేసే బిజినెస్‌ల గురించి తెలుసుకోగ‌లిగాడా, భ‌గీరాను వెతికే సీబీఐ ఆఫీస‌ర్ ఎవ‌రు, ఆయ‌న‌కు భ‌ఘీరాను ఎందుకు అంత‌మొందించాల‌ని అనుకున్నాడనే క‌థ‌నంతో సినిమా సాగుతుంది.


ఎలా ఉందంటే..

ఎన్నో అంచ‌నాల మ‌ధ్య థియేట‌ర్లోకి వ‌చ్చిన ఈ సినిమా పాత సీసాలో కొత్త సారా అన్న రీతిలో ఉంది. ఇప్ప‌టికే ఇలాంటి జాన‌ర్‌, ఈ త‌ర‌హా చిత్రాలు వంద‌ల సంఖ్య‌లో వ‌చ్చాయి.. ప్రేక్ష‌కులు చూశారు. సిటీని వ‌ణికించే గ్యాంగ్, భ‌య‌ప‌డే పోలీసులు, అందులో ఒక‌రు మాస్క్ వేసుకుని రాబిన్ హుడ్‌గా మారి విల‌న్ల ప‌ని ప‌ట్ట‌డం ఇది క్లుప్తంగా ఈ సినిమా స్టోరి. అయితే ఇందులో పోలీసు త‌న‌ అధికారంతో ఏం చేయ‌లేక మాస్క్‌తో తాను చేయాల‌నుకున్నది చేయ‌డం కాస్త వెరైటీ అంతే. హాలీవుడ్ క్లాసిక్ కామిక్ బ్యాట్‌మెన్ సినిమాను ప్రేర‌ణ‌గా తీసుకుని తెర‌కెక్కించిన ఈ సినిమాలో బ్యాట్‌మెన్ త‌ర‌హా బైక్‌, ఒక‌టి రెండు అయుధాల‌ను కూడా దింపేశారు.

bhagaa.jpg

సినిమా స్టార్టింగ్ విల‌న్ క్రూర‌త్వం చూయించ‌డంతో ప్రారంభ‌మైన సినిమా.. ప‌డుతూ లేస్తూ వ‌చ్చి ఇంట‌ర్వెల్‌కు ఆస‌క్తి క‌లిగేలా చేశారు. కానీ ఆ త‌ర్వాత వ‌చ్చే ప్ర‌తి సీను ముందే మ‌న‌కు తెలిసి పోతూ ప‌ర‌మ రోటీన్‌గా సాగుతుంది. ఇక హీరోయిన్ పాత్ర గురించి ఎంత త‌క్కువ చెప్పుకుంటే అంత మంచిది. రుక్మిణి వ‌సంత్ వంటి మోస్ట్ ఫాలోయింగ్ ఉన్న‌ తార‌ను క‌థానాయిక‌గా పెట్టుకుని త‌న‌కున్న‌ ఇమేజ్‌ను డ్యామేజ్ చేశారు. హీరో దెబ్బ‌ల‌కు క‌ట్లు క‌ట్టేందుకు, ఓ పాట‌కు, చివ‌ర‌లో విల‌నుకు ఎర అయ్యే పాత్ర‌కు ప‌రిమితం చేశారు. ఈ మ‌ధ్య ఎంత చిన్న సినిమాలో అయినా ఇంత పేల‌వ‌మైన క్యారెక్ట‌ర్ లేదంటే అతిశ‌యోక్తి కాదు.

Rukmini Vasanth

ఉన్నంత‌లో శాఖ‌హారి మూవీ ఫేమ్ రంగాయ‌న ర‌ఘుకు, సెకండాఫ్‌లో ప్ర‌కాశ్ రాజ్‌ల‌కు కాస్త నిడివి ఉన్న పాత్ర‌లు ప‌డ్డాయి. ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌కు ప్ర‌కాశ్‌ రాజ్ క్యారెక్ట‌ర్‌కు హైపిచ్చి త‌ర్వాత తుస్సుమ‌నిపించ‌డం సెట్ట‌వ్వ‌లేదు. ఇక‌ సినిమాకు అజినీస్ లోక్ నాథ్ సంగీతం బాగా కుదిరింది. అలాగే ఇంట‌ర్వెల్‌కు ముందు వ‌చ్చే ఫైట్ ఎక్స్‌ట్రార్డినరీగా ఉండి సినిమాను ఓ రేంజ్‌కు తీసుకుపోయింది. కొన్ని సీన్లలో మాత్రం మంచి ఎలివేష‌న్ షాట్లు ప‌డ్డాయి. కానీ త‌ర్వాతి యాక్ష‌న్ సీన్లు రొటీన్‌గానే సాగాయి. బీ, సీ సెంట‌ర్లలో కాస్త‌ ఆడే అవ‌కాశాలు ఉన్నాయి.

ట్యాగ్‌లైన్: భ‌ఘీర.. రొటీన్ బొమ్మేరా

Updated Date - Oct 31 , 2024 | 08:58 PM