Om Bheem Bush Movie Review: కాసేపు నవ్వుకోవచ్చు

ABN , Publish Date - Mar 22 , 2024 | 03:17 PM

ఆమధ్య ‘జాతి రత్నాలు’ అనే సినిమా వచ్చింది. అందులో నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కథానాయకులుగా నటించారు. ఇప్పుడు అటువంటి చిత్రమే ఈ ‘ఓం భీమ్ బుష్’. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకోనుందో ఈ రివ్యూలో తెలుసుకుందాం..

Om Bheem Bush Movie Review: కాసేపు నవ్వుకోవచ్చు
Om Bheem Bush Movie Review Poster

సినిమా: ‘ఓం భీమ్ బుష్’

విడుదల తేదీ: 22 మార్చి, 2024

నటీనటులు: శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్, ఆదిత్య మీనన్, శ్రీకాంత్ అయ్యంగార్, రచ్చరవి తదితరులు

ఛాయాగ్రహణం: రాజ్ తోట

సంగీతం: సన్నీ ఎంఆర్

నిర్మాత: సునీల్ బలుసు

రచన, దర్శకత్వం: శ్రీ హర్ష కొనుగంటి

రేటింగ్: 3 (మూడు)

-- సురేష్ కవిరాయని

ఆమధ్య ‘జాతి రత్నాలు’ (Jathi Ratnalu) అనే సినిమా వచ్చింది. అందులో నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కథానాయకులుగా నటించారు. ఇప్పుడు అటువంటి చిత్రమే ఈ ‘ఓం భీమ్ బుష్’ (Om Bheem Bush Movie). ప్రియదర్శి (Priyadarshi), రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) ఈ సినిమాలో కూడా కథానాయకులుగా ఉంటే, ముఖ్య కథానాయకుడిగా శ్రీవిష్ణు (Sree Vishnu) చేశారు. దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి (Sree Harsha Konuganti) ఈ సినిమా పేరుతో పాటు ముందుగానే ఈ సినిమా గురించి చెప్పేశారు.. ఏమని అంటే ‘లాజిక్ వెతకొద్దు, మ్యాజిక్ మాత్రమే చూడండి’ అని. అలాగే ‘సామజవరగమన’ (Samajavaragamana) సినిమా వినోదాత్మకంగా వుండే సినిమా, శ్రీవిష్ణుకి ఆ సినిమాతో చాలా పెద్ద విజయం వచ్చింది. ఇప్పుడు అదే వినోదాన్ని కొనసాగించాలని ‘ఓం భీమ్ బుష్’ సినిమాతో అనుకున్నారు. సన్నీ ఎంఆర్ సంగీతం అందించిన ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.

OM-Bheem-Bush-1.jpg

కథ (Om Bheem Bush Story):

కృష్ణకాంత్ (శ్రీవిష్ణు), వినయ్ (ప్రియదర్శి), మ్యాడీ (రాహుల్ రామకృష్ణ) ముగ్గురూ స్నేహితులు. పీహెచ్‌డి చేయడానికి ఒక ప్రొఫెసర్ (శ్రీకాంత్ అయ్యంగార్) దగ్గర చేరుతారు. అయితే వీళ్ళ ముగ్గురు చేసే అల్లరి భరించలేక వీళ్ళందరికీ చాలా తొందరగా డాక్టరేట్‌లు ఇచ్చేసి.. ఆ కాలేజీ నుండి పంపించేస్తాడు ఆ ప్రొఫెసర్. ఏమి చేయాలా? అని ఆలోచిస్తున్న సమయంలో భైరవపురం అనే గ్రామం దగ్గర కొందరు తాంత్రిక విద్యలతో డబ్బులు సంపాదించటం చూసి, తాము కూడా కొన్ని సైన్స్ టెక్నిక్స్‌ని ఉపయోగించి డబ్బులు సంపాదించవచ్చని ఆ గ్రామంలో ఉండిపోతారు. ‘బ్యాంగ్ బ్రదర్స్’ అనే పేరుతో అక్కడే ‘ఏ టు జెడ్’ దేనికైనా పరిష్కారం చెబుతామని టెంట్ ఓపెన్ చేస్తారు. ఆ గ్రామ ప్రజలు వీరి దగ్గరకి రావటం, వీళ్ళు ప్రజల పరిష్కారాలకు సరైన పరిష్కారం చూపించడంతో ఈ ముగ్గురిపై ఆ గ్రామ ప్రజలకి బాగా నమ్మకం ఏర్పడుతుంది. అలాగే ఎవరింట్లో అయినా గుప్త నిధులు ఉంటే, అవి ఎక్కడ ఉన్నాయో చూపిస్తామని కూడా చెబుతారు. తాంత్రిక విద్యలతో డబ్బులు తీసుకుంటున్న ఆ సభ్యులు ఈ ముగ్గురూ చూపిస్తున్న పరిష్కారాలు సరైనవి కావని, వాళ్ళు నిజంగా నిధులు కనిపెట్టగలిగితే ఆ గ్రామ పొలిమేరల్లో వున్న మహల్‌లో వున్న సంపంగి దెయ్యాన్ని లొంగదీసుకుని, ఆ మహల్‌లో వున్న నిధులను తేవాలని ఛాలెంజ్ చేస్తారు. ఆ ఛాలెంజ్‌కి ఈ ముగ్గురూ ఒప్పుకుంటారు. ఈ ముగ్గురూ ఆ సంపంగి దెయ్యం వున్న మహల్‌లోకి ప్రవేశిస్తారు. ఆ మహల్‌లో ఏమైంది, సంపంగి దెయ్యం ఉందా? ఉంటే అదెవరు, ఎందుకు అక్కడ దెయ్యంగా వుంది? ఆ ఊరి సర్పంచ్ కూతురి ప్రేమని పొందడానికి కృష్ణకాంత్ ఏమి చేశాడు? ఇంతకీ నిధి దొరికిందా? ఇవన్నీ తెలియాలంటే ‘ఓం భీమ్ బుష్’ సినిమా చూడాల్సిందే. (Om Bheem Bush Movie Review)


OM-Bheem-Bush-5.jpg

విశ్లేషణ:

దర్శకుడు శ్రీహర్ష ఈ సినిమా పేరుతో పాటు లాజిక్‌లు చూడొద్దు అని ముందే చెప్పేశాడు.. కాబట్టి ఇందులో లాజిక్‌లు అడగవద్దు. అలాగే ‘జాతి రత్నాలు’ సినిమాలా ఈ సినిమా కూడా కేవలం వినోదం కోసమే తీసిన సినిమా అని చెప్పొచ్చు. సినిమా మొదలవడం శ్రీకాంత్ అయ్యంగార్ ఈ ముగ్గురు స్నేహితుల గురించి వాళ్ళు చేసే అల్లరి పనుల గురించి చెప్పడంతో మొదలవుతుంది. ఆ తర్వాత ఈ ముగ్గురూ భైరవపురం అనే గ్రామం చేరుకోవటం, అక్కడ ప్రజల్లో వున్న కొన్ని మూఢనమ్మకాలని తమకు అనుగుణంగా మార్చుకోవడం.. ఆ ఊరి సర్పంచ్ కూతురి ప్రేమ కోసం సంపంగి దెయ్యం పీడ వదిలించి, మహల్‌లో వున్న నిధులను తెచ్చుకోవటం. సింపుల్‌గా ఇలా నడిచింది కథ. (#OmBheemBushReview)

Om-Bheem-Bush-4.jpg

దర్శకుడు ముందుగా చెప్పినట్టుగా కేవలం వినోదం కోసమే చాలా సన్నివేశాలు రాశాడు. సినిమా అంతా ఈ ముగ్గురి చుట్టూ తిరగడమే కాకుండా, వీళ్ళు చెప్పే చిన్న చిన్న వినోదపు మాటల మీదే (వన్ లైనర్స్) వినోదం పండించాడు దర్శకుడు. అందుకే అతను తన రచన మీదే ఎక్కువ దృష్టి కేంద్రీకరించాడు అనిపిస్తుంది. అయితే మధ్యమధ్యలో కొన్ని సన్నివేశాలు బోర్ అనిపించినా, మళ్ళీ ఒక వినోదాత్మక సన్నివేశం రావటం, సినిమా అటువైపు మళ్లడం చేస్తూ ఉంటుంది. పిల్లలు పుట్టడం లేదు అనే సమస్యకి ఆ భర్తకి చూపించిన పరిష్కారం కొంచెం ఎబ్బెట్టుగా వున్నా, నవ్వు తెప్పిస్తుంది. అలాగే రెండో సగంలో దెయ్యంతో జరిగే సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి. ఆ గ్రామంలో ముగ్గురూ చూపించే పరిష్కారాలు చాలా వినోదాత్మకంగా ఉంటాయి. కథానాయికలుగా ప్రీతీ ముకుందన్, అయేషా ఖాన్ పాత్రలు కేవలం ఒకటి రెండు సన్నివేశాలకు పరిమితం చేశారు. (Om Bheem Bush Movie)

OM-Bheem-Bush-2.jpg

ఇక సంపంగి దెయ్యంతో కొన్ని సన్నివేశాలు బాగున్నా, కొన్ని మరీ లాగినట్టుగా అనిపించింది. అలాగే సంపంగి (Sampangi) దెయ్యం పూర్వ కథ, దానికి శ్రీవిష్ణు చూపించే పరిష్కారం ప్రేక్షకులు ఒప్పుకుంటారో లేదో కానీ, దర్శకుడు మాత్రం కథలో కొత్త పాయింట్ చూపించగలిగాడు అని చెప్పాలి. క్లైమాక్స్ మరీ తొందరగా అయిపోయేటట్టుగా వుంది, అంతగా పండలేదు అనే చెప్పాలి. అయితే ఈ సినిమాకి శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఈ ముగ్గురి నటన వారి మాటలు వినోదాన్ని పండిస్తాయి. (Om Bheem Bush Movie Report)

శ్రీ విష్ణు (Hero Sree Vishnu) ప్రధాన కథానాయకుడు అయినా, మిగతా ఇద్దరికీ తనతో పాటుగా అంతే ప్రాధాన్యం వుండేటట్టు చూశాడు. దర్శకుడు లాజిక్స్ వెతకొద్దు అన్నాడు కాబట్టి, ఇక్కడ లాజిక్స్‌కి పోవటం లేదు. సినిమా అంతా ఈ ముగ్గురే ప్రధానంగా కనపడతారు. శ్రీవిష్ణు వెరైటీ‌గా చెప్పిన మాటలు బాగున్నాయి. అలాగే ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఇద్దరి కామిక్ టైమింగ్ అదిరింది. ఇక ఆదిత్య మీనన్, శ్రీకాంత్ అయ్యంగార్, మిగతా నటీనటులు తమ పరిధి మేరకు చేశారు. రచ్చ రవికి మంచి పాత్ర లభించింది, బాగా చేశాడు.

OM-Bheem-Bush-3.jpg

చివరగా, ‘ఓం భీమ్ బుష్’ సినిమా ప్రేక్షకుడిని కొంచెం సేపు నవ్విస్తుందనే చెప్పాలి. సినిమాలో శ్రీవిష్ణు క్లైమాక్స్‌లో చేసిన సన్నివేశానికి ఎటువంటి స్పందన లభిస్తుందో తెలియదు కానీ, ఈ సినిమా చూసి మాత్రం కాసేపు నవ్వుకోవచ్చు. దర్శకుడు శ్రీహర్ష (Director Sree Harsha) తన రచనలో కాస్త ద్వందార్థాలు కూడా గట్టిగానే వాడాడు.

Updated Date - Mar 22 , 2024 | 03:21 PM