Nenu Keerthana: ‘నేను కీర్తన’ మూవీ రివ్యూ

ABN , Publish Date - Aug 31 , 2024 | 09:04 PM

ఈ మధ్యకాలంలో దాదాపు చిన్న సినిమాలే బాక్సాఫీస్ వద్ద మాట్లాడుతున్నాయి.. కలెక్షన్స్ రాబడుతున్నాయి. పెద్ద సినిమా పండగలకి వస్తే.. చిన్న సినిమాలు మాత్రం ప్రతి వారం వస్తూనే ఉన్నాయి.. ప్రేక్షకులని ఎంటర్‌టైన్ చేస్తూనే ఉన్నాయి. కానీ పెద్ద, చిన్న సినిమాలు ఒకేసారి వస్తే మాత్రం బాక్సాఫీస్ వద్ద ఉండే సందడే వేరు. నాని ‘సరిపోదా శనివారం’కు పోటీగా వచ్చిన ‘నేను కీర్తన’ సినిమా ఎలా ఉందంటే..

Nenu Keerthana Movie Poster

మూవీ పేరు: ‘నేను కీర్తన’

విడుదల తేది: 30, అక్టోబర్ 2024

నటీనటులు: రమేష్ బాబు, రిషిత, మేఘన, రేణుప్రియ, సంధ్య, జీవా, విజయ్ రంగరాజు, జబర్దస్త్ అప్పారావు, మంజునాథ్ తదితరులు...

బ్యానర్: చిమటా ప్రొడక్షన్స్

సినిమాటోగ్రఫీ; కె.రమణ

ఎడిటర్: వినయ్ రెడ్డి బండారపు

మ్యూజిక్: ఎమ్.ఎల్.రాజా

నిర్మాత: చిమటా లక్ష్మీ కుమారి

రచన - దర్శకత్వం: చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్)

ఈ మధ్యకాలంలో దాదాపు చిన్న సినిమాలే బాక్సాఫీస్ వద్ద మాట్లాడుతున్నాయి.. కలెక్షన్స్ రాబడుతున్నాయి. పెద్ద సినిమా పండగలకి వస్తే.. చిన్న సినిమాలు మాత్రం ప్రతి వారం వస్తూనే ఉన్నాయి.. ప్రేక్షకులని ఎంటర్‌టైన్ చేస్తూనే ఉన్నాయి. కానీ పెద్ద, చిన్న సినిమాలు ఒకేసారి వస్తే మాత్రం బాక్సాఫీస్ వద్ద ఉండే సందడే వేరు. నేచురల్ స్టార్ నాని ‘సరిపోదా శనివారం’ గురువారం విడుదలై పాజిటివ్ టాక్‌తో రన్ అవుతుండగా.. శుక్రవారం రెండు మూడు చిన్న సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. అందులో ఒకటి ‘నేను కీర్తన’. ఈ సినిమాకు కథ, మాటలు, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వంతో పాటు హీరోగానూ చిమటా రమేష్ బాబు నటిస్తూ.. తన మల్టీ టాలెంట్‌ ప్రదర్శించారనేలా ప్రమోషన్స్‌ చేశారు. అలాగే టీజర్, ట్రైలర్ కూడా మంచి ఆదరణను పొందినట్లుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో.. థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.. (Nenu Keerthana Movie Review)

కథ:

తన కళ్ళ ముందు జరిగే అన్యాయాన్ని ప్రతిఘటిస్తూ, ఆపదలో ఉండి, తన సాయం అర్ధించేవారి కోసం ప్రాణాలు పణంగా పెట్టి అరాచకాలకు ఎదురొడ్డే జానీ (చిమటా రమేష్ బాబు) అనే ఓ యువకుడి కథ ఇది. జానీ జీవితంలోకి కీర్తన అనే అమ్మాయి ప్రవేశించాక... అతని జీవితం ఎటువంటి మలుపులు తిరిగింది, తనకు లభించిన ఓ వరాన్ని జానీ తన వ్యక్తిగత ప్రయోజనాలకు వాడకుండా... సమాజ ప్రయోజనాలకు ఏవిధంగా వినియోగించాడనేదే ఈ సినిమా కథ. క్లుప్తంగా కథ ఉన్నా.. మలుపులు ఎక్కువే ఉన్నాయి. ఆ మలుపులేంటో తెలియాలంటే థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా చూడాల్సిందే.


Chr.jpg

విశ్లేషణ:

ఈ సినిమాకు మొదటి నుంచి మల్టీ జోనర్ ఫిల్మ్ అనేలా ప్రచారం చేశారు. లవ్, సెంటిమెంట్, యాక్షన్, రొమాన్స్, ఫ్యామిలీ డ్రామా, కామెడీ, రివెంజ్, హర్రర్ వంటి అంశాలన్నీ ఈ చిత్రంలో జోడించారు. ఒక చిన్న సినిమాలో ఇన్ని జోనర్స్ మిక్స్ చేయడం అవసరమా? అనిపించేలా కొన్ని సీన్లు ఉన్నా.. ఈ మధ్య కాలంలో ప్రేక్షకులకు ట్విస్ట్‌లెక్కువ కోరుకుంటున్నారని దర్శకుడు ఆ దిశగా ఆలోచన చేశారేమో అని అనిపిస్తుంది. అయితే కనెక్టివిటీపై కాస్త దృష్టి పెట్టాల్సింది. ఒక్కడే చాలా డిపార్ట్‌మెంట్స్‌పై దృష్టి పెట్టడం, పైగా యాక్టింగ్.. ఇలా అన్నీ డీల్ చేయడంలో కొంత వరకు సక్సెస్ అయినా.. చిన్న చిన్న లోపాలు మాత్రం ఈజీగా తెలిసిపోతాయి. మొత్తంగా అయితే.. ఓ మంచి మెసేజ్‌కి.. వినోదాన్ని చేర్చి సిహెచ్‌ఆర్ చేసిన ఈ ప్రయత్నాన్ని.. టైమ్ ఉంటే ఓసారి చూడొచ్చు.

ఆర్టిస్టుల, సాంకేతిక నిపుణుల పనితీరు:

ఈ సినిమాకు పలు బాధ్యతలను నిర్వహించిన హీరో రమేష్ బాబు.. మ్యాగ్జిమమ్ తన ఎఫెర్ట్ పెట్టారు. నటనలోనూ, ఫైట్స్, డ్యాన్స్‌లలో తన మార్క్ ప్రదర్శించే ప్రయత్నం చేశాడు. ఇది అతనికి డెబ్యూ ఫిల్మ్ అయినా.. అనుభవజ్ఞుడిలా నటించి మంచి మార్కులు వేయించుకుంటాడు. హీరోయిన్లు రిషిత, మేఘన తమ పాత్రల పరిధి మేరకు నటించారు. విజయ రంగరాజు, జీవాలు విలన్లుగా తమ అనుభవాన్ని ప్రదర్శించారు. జబర్దస్త్ అప్పారావు కామెడీ కాసేపు నవ్విస్తుంది. ఐటమ్ సాంగ్‌లో రేణు ప్రియ మెరిసింది. మిగతా నటీనటులంతా తమ పాత్రలకు దక్కిన స్కోప్‌ని వినియోగించుకున్నారు.

సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. దర్శకుడిగా రమేష్ బాబు మంచి కథనే డీల్ చేశాడు కానీ.. ఇంకాస్త అనుభవం అవసరం. అలాగే రైటర్‌గా కూడా ఇంకాస్త శ్రద్ధ తీసుకుని ఉంటే బాగుండేది. డైలాగ్స్ విషయంలోనూ.. తన టాలెంట్ ప్రదర్శించాలని ప్రయత్నించారు కానీ.. అంత హెవీ అవసరం లేదనిపిస్తుంది. అలాగే.. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించాలని ఆయన అన్ని జోనర్లును టచ్ చేయాలని బలవంతంగా ప్రయత్నించినట్లుగా కొన్ని సీన్లు అనిపిస్తాయి. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లు మరీ ల్యాగ్ అనిపిస్తాయి. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త కత్తెరకు పనిచెప్పాల్సింది. కెమెరా, మ్యూజిక్ వంటి మిగతా డిపార్ట్‌మెంట్స్ వారంతా తమ పనితనాన్ని కనబరిచారు. నిర్మాణ విలువలు ఓకే.

Updated Date - Aug 31 , 2024 | 09:08 PM