Mathu Vadalara 2 Review: శ్రీసింహా నటించిన కామెడీ థ్రిల్లర్ 'మత్తు వదలరా 2' ఎలా ఉందంటే 

ABN , Publish Date - Sep 13 , 2024 | 01:55 PM

కీరవాణి రెండో తనయుడు శ్రీసింహా 'మత్తు వదలరా’ చిత్రంతో (Mathu Vadalara 2 Review) కథానాయకుడిగా పరిచయమయ్యాడు. రితేష్‌ రానా దర్శకత్వంలో 2019లో వచ్చిన ఈ చిత్రం హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల్ని అలరించింది. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా 'మత్తు వదలరా–2’ ప్రేక్షకుల ముందుకొచ్చింది.

సినిమా రివ్యూ: 'మత్తు వదలరా 2' (Mathu Vadalara 2)
విడుదల తేది: 12–9–2024
నటీనటులు: శ్రీసింహా కోడూరి(Srisimha koduri), సత్య, ఫరియా అబ్దుల్లా, వెన్నెల కిషోర్‌, అజయ్‌, రోహిణి, ఝాన్సీ, సునీల్‌ తదితరులు

సాంకేతిక నిపుణులు:
సినిమాటోగ్రఫీ: సురేష్‌ సారంగం
సంగీతం: కాలభైరవ
ఎడిటింగ్‌: కార్తిక్‌ శ్రీనివాస్‌
నిర్మాణ సంస్థలు: క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, మైత్రీ మూవీ మేకర్స్‌
నిర్మాతలు: చిరంజీవి (చెర్రీ), పెదమళ్ల హేమలత,
దర్శకత్వం: రితేష్‌ రానా (Ritesh Rana)

కీరవాణి రెండో తనయుడు శ్రీసింహా 'మత్తు వదలరా’ చిత్రంతో (Mathu Vadalara 2 Review) కథానాయకుడిగా పరిచయమయ్యాడు. రితేష్‌ రానా దర్శకత్వంలో 2019లో వచ్చిన ఈ చిత్రం హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల్ని అలరించింది. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా 'మత్తు వదలరా–2’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. సీక్వెల్‌ ఉంటుందని ముందే ప్రకటించినా షూటింగ్‌ మాత్రం చప్పుడు లేకుండా పూర్తి చేసిన డైరెక్ట్‌ రిలీజ్‌కు వచ్చేశారు. మొదటి పార్ట్‌ సక్సెస్‌ కావడంతో ఈ సీక్వెల్‌పై అంచనాలు పెరిగాయి. సత్య, ఫరియా అబ్దుల్లా కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం అంచనాలను చేరువయిందా? లేదా? రివ్యూలో చూద్దాం.

mathy-3.jpg

కథ: (Mathu Vadalara 2 Story)
డెలివరీ ఏజెంట్లుగా పనిచేసిన బాబు మోహన్‌ (శ్రీ సింహ), ఏసుదాసు (సత్య) అడ్డదారిలో హీ టీమ్‌ (హైలీ ఎమర్జెన్సీ టీమ్‌)లో ఉద్యోగాలు సంపాదిస్తారు. చాలీచాలని జీతంతో జీవితం సాగిస్తున్న ఈ ఇద్దరు యువకులు ఓ పథకం వేస్తారు. కిడ్నాపర్లకు ఇచ్చే డబ్బుల్లో కొంత మొత్తాన్ని తస్కరించడం మొదలు పెడతారు. ఈ క్రమంలో దామిని (ఝాన్సీ) అనే మహిళ తన కూతురు కిడ్నాప్‌కు గురైందని హీ టీమ్‌ ఏజెంట్స్‌ అయిన బాబు, ఏసులను ఆశ్రయిస్తుంది. ఏజెన్సీతో సంబంధం లేకుండా మేమే డీల్‌ చేస్తామని బాబు చెప్పడంతో దామిని అందుకు అంగీకరిస్తుంది. ఈ కేసును డీల్‌ చేసే సమయంలో బాబు, ఏసు, ఓ మర్డర్‌ కేసులో ఇరుక్కుంటారు. అసలు బాబు, ఏసులకు సంబంధం లేని ఈ కేసులో టార్గెట్‌ చేసి ఇరికించింది ఎవరు? తేజస్వి తోట అలియాస్‌ ప్రకాష్‌ (అజయ్‌), హీరో యువ (‘వెన్నెల’ కిశోర్‌)లకు ఈ కేసుకు సంబంధం ఏంటి అన్నది కథ. (Faria abdhulla)

Mathuvadalara.jpg

విశ్లేషణ: (
Mathu Vadalara 2 Review)

కిడ్నాప్‌, క్రైమ్‌ కేసులను ఛేదించే హీ టీమ్‌ కథ ఇది. ఇందులో బాబు, ఏసు, నిధి, దీప, సక్సేనా, మైఖేల్‌ టీమ్‌పై సస్పెన్స్‌ థిల్లర్‌గా సాగుతుంది. హీ టీమ్‌లో పని చేసే ఇద్దరు ఉద్యోగులు ఓ మర్డర్‌ కేసులో ఎలా ఇరుక్కున్నారు, దాని నుంచి వారు ఎలా బయటపడ్డారు అన్నది సస్పెన్స్‌, ట్విస్ట్స్‌, థిల్లర్‌ వేలో, ఎంటన్‌మెంట్‌ను జోడించి చెప్పాలనుకున్నారు దర్శకుడు. అయితే కేసును చేధించే క్రమంలో సస్పెన్స్‌ మిస్‌ అయ్యి పూర్తిగా వినోదాత్మకంగా సాగింది. అలాగే థ్రిల్‌, ట్విస్ట్‌ లేదని చెప్పలేం. ఎక్కువ శాతం సినిమా అంతా కామెడీగానే సాగింది. ఫస్టాఫ్‌ అంతా ఫన్‌వేలో సాగింది. ఇంటర్వెల్‌ సమయానికి హీరోలే మర్దర్‌ కేస్‌లు ఇరుక్కున్నట్లు ట్విస్ట్‌ ఇచ్చారు. సెకెండాఫ్‌ అంతా వారు ఆ కేసు నుంచి బయట పడటానికి చేసే ప్రయత్నాలను బాగానే చూపించారు. కానీ అజయ్‌ మర్డర్‌ జరిగిన సీన్‌ నుంచి ముందు జరగబోతుంది అనేది ప్రేక్షకుడి ఊహకు దగ్గరగా ఉంది. లాడ్జ్‌లో జరిగిన సంభాషలను బట్టి సక్సేనా పాత్రధారి రాజా చెంబోలు అజయ్‌ను చంపినట్లు అర్ధమైపోతుంది. కానీ అసలు అతను ఎందుకు చంపాడు.. దాని వెనుక ఎవరున్నారు అన్నది మాత్రం సస్పెన్స్‌గా ఉంచి క్లైమాక్స్‌లో రివీల్‌ చేయడం బావుంది. ఆ విషయంలో దర్శకుడి ఆలోచన బిగుతుగా ఉంది. దీప పాత్రధారి అయిన రోహిణి రివేంజ్‌ స్టోరీ కూడా బావుంది. అయితే ఫస్టాఫ్‌ అంతా ఫన్‌ వేలో సాగింది. సెకెండాఫ్‌ కాస్త స్లో అయింది. కొన్ని సన్నివేశాలు విసుగు పుట్టిస్తాయి. అయితే ఇందులో దర్శకుడు కామెడీ మీద ఎక్కువ దృష్టి సారించినట్లు తెలిసిపోతుంది. క్రైమ్‌, సస్సెన్స్‌ మీద అంతగా ఫోకస్‌ చేయలేదు. అది కూడా బ్యాలెన్స్‌ చేసుంటే సినిమా ఇంకాస్త బెటర్‌గా ఉండేది. (comedian Satya)

Mathu-3.jpg

ఇక ఆర్టిస్ట్‌ల విషయానికొస్తే శ్రీసింహ బాబు పాత్రలో ఒదిగిపోయాడు. తన నటన, డైలాగ్‌ డెలివరీ మరోసారి ఆకట్టుకుంది. నటుడిగా తన పాత్రకు న్యాయం చేశాడు. సత్య పాత్ర అయితే పూర్తిగా నవ్వులు పూయించింది. తన కామెడీ టైమింగ్‌, వన్‌ లైన్‌ పంచ్‌లు, ఎక్స్‌ప్రెషన్స్‌ బాడీ లాంగ్వేజ్‌ ఇలా ప్రతి విషయంలో అలరించారు. హీరోతో సమానంగా అతని పాత్ర ఉంది. కనిపించిన ప్రతిసారీ నవ్వించాడు. క్లైమాక్స్‌లో చిరంజీవి తరహాలో సత్య వేసిన డ్యాన్స్‌ థియేటర్లలో విజిల్స్‌ వేయించడం పక్కా. అలాగే రాజశేఖర్‌ను ఇమిటేట్‌ చేసే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ఫరియా నిధి పాత్రకు న్యాయం చేసింది. గ్లామర్‌తో ఆకట్టుకుంది. అజయ్‌, వెన్నెల కిశోర్‌, సునీల్‌, రాజా పాత్రలు ఆకట్టుకున్నాయి. హీ టీమ్‌ సుపీరియర్‌ దీప పాత్రకు రోహిణి న్యాయం చేశారు. క్లైమాక్స్‌లో ఆమె రివేంజ్‌ డ్రామా ఆకట్టుకుంది.  జబర్దస్త్‌ రోహిణి కనిపించిన ‘ఓరి నా కొడకా’ ట్రాక్‌ నవ్వించలేదు. పైగా ఆ సీన్‌ సినిమాకు భారంగా అనిపించింది. సాంకేతిక నిపుణుల విషయానికొస్తే సంగీత దర్శకుడు కాలభైరవ మంచి మార్కులు స్కోర్‌ చేశారు. పాటలు, నేపథ్య సంగీతం చక్కగా అందించాడు. కెమెరా వర్క్‌ డీసెంట్‌గా ఉంది. సెకెండాఫ్‌లో ఎడిటర్‌ కాస్త కత్తెర వేసుంటే ఇంకొంచెం బెటర్‌గా ఉండేది. నిర్మాణ విలువలు బావున్నాయి.


ఫస్ట్‌ పార్ట్‌ 'మత్తు వదలరా’లో కామెడీ ఎంతగా అలరించిందో, ట్విస్ట్‌లు, టర్న్‌లు కూడా అదే మీటర్‌లో అలరించాయి. ఆ సినిమా చూసి సీక్వెల్‌పై ప్రేక్షకులు అంచనాలు పెట్టుకోవడం సహజం. అయితే ఈ చిత్రంలో కామెడీ బాగా వర్కవుట్‌ అయింది కానీ. క్రైమ్‌, ట్విస్ట్‌ల విషయంలో తెరపై పూర్తిగా న్యాయం జరగలేదు. దర్శకుడు పూర్తిగా కామెడీ మీదే ఆధారపడినట్లు అనిపిస్తుంది.  క్లైమాక్స్‌ ఊహించేలా కాకుండా గ్రిప్పింగ్‌గా ఉండుంటే రితేష్‌ వంద మార్కులు తెచ్చుకునేవారు. దర్శకుడు చిరంజీవికి వీరాభిమాని కావడంతో చిరంజీవి సినిమాల్లో రెండు మూడు సీన్లను తన సినిమాలో వాడేసుకున్నారు. ఆ సన్నివేశాలు తప్పకుండా విజిల్స్‌ వేయిస్తాయి. ఈ చిత్రం పూర్తిగా సత్య వన్‌ మ్యాన్‌ షో. క్రైమ్‌, కామెడీ థ్రిల్లర్‌ జానర్‌ సినిమా అని ఎక్కువ ఊహించుకోకుండా, లాజిక్కులు వెతకకుండా ఉంటే... సినిమాను హాయిగా ఎంజాయ్‌ చేయవచ్చు.

ట్యాగ్‌ లైన్‌: సస్పెన్స్‌ – థ్రిల్‌ మిస్‌.. ఫన్‌ పాస్‌

Updated Date - Sep 13 , 2024 | 05:55 PM