Cinema Review: మారుతీనగర్‌ సుబ్రమణ్యం

ABN , Publish Date - Aug 23 , 2024 | 12:33 PM

టాలీవుడ్‌ ప్రామిసింగ్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్టుల్లో రావు రమేష్‌ ఒకరు. కొన్ని పాత్రలు ఆయన కోసమే పుట్టాయి అనిపిస్తాయి. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘మారుతీనగర్‌ సుబ్రమణ్యం’. ఇంద్రజ ఆయనకు జోడీగా నటించారు.

Maruthi Nagar Subramanyam Movie Poster

సినిమా రివ్యూ: మారుతీనగర్‌ సుబ్రమణ్యం (Maruthi Nagar subrahmanyam)

నటీనటులు: రావు రమేష్‌, ఇంద్రజ, అంకిత్‌ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్థన్‌, అన్నపూర్ణమ్మ, ప్రవీణ్‌, అజయ్‌ తదితరులు.

కెమెరా: ఎమ్‌ఎన్‌ బాల్‌రెడ్డి,

సంగీతం: కల్యాణ్‌ నాయక్‌,

ఎడిటర్‌: బొంతల నాగేశ్వరరెడ్డి

సమర్పణ: తబితా సుకుమార్‌;

నిర్మాతలు: బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్‌ కార్య;

దర్శకత్వం: లక్ష్మణ్‌ కార్య. (Lakshman karya)

టాలీవుడ్‌ ప్రామిసింగ్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్టుల్లో రావు రమేష్‌ ఒకరు. కొన్ని పాత్రలు ఆయన కోసమే పుట్టాయి అనిపిస్తాయి. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘మారుతీనగర్‌ సుబ్రమణ్యం’. ఇంద్రజ ఆయనకు జోడీగా నటించారు. లక్ష్మణ్‌ కార్య దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ భార్య తబిత ఈ చిత్రానికి సమర్పకురాలిగా వ్యవహరించడంతో సినిమాకు హైప్‌ వచ్చింది. ట్రైలర్లు, పాటలతో ఆకట్టుకున్న ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రేక్షకుల్ని ఏమేరకు అలరించిందో చూద్దాం.

కథ:

మారుతీ నగర్‌లో నివసించే ఓ నిరుద్యోగి సుబ్రమణ్యం (రావు రమేష్‌). గవర్నమెంట్‌ జాబ్‌ లక్ష్యంగా ప్రయత్నాలు చేస్తుంటాడు. ఒక్క పోలీస్‌ జాబ్‌ తప్ప అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తాడు. కానీ ఫలితం కనిపించదు. గవర్నమెంట్‌ టీచర్‌గా ఎంపికైనా అది కాస్త కోర్టులో నలుగుతుంటుంది. ఇలా ప్రయత్నాలు చేస్తూ 25 సంవత్సరాలుగా ఏ పనీ లేకుండా భార్య కళారాణి (ఇంద్రజ) జీతం మీద ఆధారపడుతుంటాడు. అతని కొడుకు అర్జున్‌ (అంకిత్‌) తొలి చూపులోనే కాంచన (రమ్య పసుపులేటి)తో ప్రేమలో పడతాడు. తన కొడుకు ప్రేమని నిలబెట్టేందుకు కాంచన ఇంటికి వెళ్లి సుబ్రమణ్యం ఏం చేశాడు. ఎక్కడి నుంచి వచ్చాయో తెలియకుండా తన అకౌంట్‌లోకి వచ్చిన రూ.10 లక్షల డబ్బుని అవసరాల కోసం తండ్రీ కొడుకులు ఖర్చు చేసేశాక ఏం జరిగింది? ఇంతకీ ఆ డబ్బు ఎవరిది? అర్జున్‌, కాంచనల లవ్‌ సక్సెస్‌ అయిందా? సుబ్రమణ్యం ప్రభుత్వ ఉద్యోగం పరిస్థితి ఏంటి అన్నది కథ. (Maruthi nagar subramanyam Review)

OTT-Subbu.jpg

విశ్లేషణ:

ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకుని పాతికేళ్లగా పోరాటం చేస్తున్న ఓ మధ్య తరగతి, మధ్య వయస్కుడి కథ ఇది. మధ్య తరగతి మనిషి బ్యాంక్‌ ఖాతాలోకి ఊహించని రీతిలో రూ. 10 లక్షలు జమ అయితే వాటితో అతనేం చేశాడు. ఆ తరుణంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అన్నది దర్శకుడు హాస్యాన్ని జోడించి తెరకెక్కించారు. మధ్య తరగతి కుటుంబంలో ఉండే ఇబ్బందులు, భావోద్వేగాలను చక్కగా చూపించారు. అయితే కథగా చెప్పుకుంటే ఇందులో ట్విస్ట్‌లు, టర్న్‌లు ఏమీ ఉండవు, సింపుల్‌గా సాగే కథ. భావోద్వేగాలకు చక్కని స్కోప్‌ ఉన్నా దర్శకుడు హాస్యం ప్రధానంగా డ్రైవ్‌ చేశాడు. భార్య సంపాదనపై జీవితం సాగించే సుబ్రమణ్యం ఒక్కసారిగా డబ్బును చూసేసరిలో అతనిలో ఎలాంటి మార్పు వచ్చిందనేది హైలైట్‌గా నిలిచింది. ఫస్టాప్‌ అంతా కుటుంబం, ఉద్యోగం, ఇంట్లో ఉండే చిన్నచిన్న సమస్యలు భార్యభర్తల మధ్య చిన్నచిన్న పట్టింపులు నేపథ్యంలో సాగాయి. ఇంటర్‌వెల్‌లో చిన్న ట్విస్ట్‌ ఇచ్చాడు. సెకెండాఫ్‌ అంతా డబ్బు, దానితో వచ్చిన సమస్యలను చూపించాడు. అదంతా కూడా కామెడీ కీలకంగా ఉంటుంది. ఒక్కో సీన్‌ వెళ్తుంటే ముందు ఏం జరగబోతుంది అన్నది తెలిసిపోతుంది. ప్రఽథమార్థం అంతా మూడు, నాలుగు క్యారెక్టర్లు తప్ప మరో పాత్ర కనిపించదు.. అలాంటి సందర్భంలో కాస్త బోర్‌ ఫీల్‌ అవ్వక తప్పదు. పతాక సన్నివేశాల్లో వచ్చే మలుపు సినిమాకు ఆసక్తికరంగా మార్చింది. మిడిల్‌ ఏజ్‌ కథల గురించి ఇప్పటి దర్శకులు అంతగా పట్టించుకోరు. లక్ష్మణ్‌ కార్య కొత్తగా ప్రయత్నం చేశాడు. సినిమాలో ఓఎల్‌ఎక్స్‌ మోసాల నేపథ్యంలో ఉన్న సన్నివేశాలు వృధాగా అనిపిస్తాయి.

ఇక నటీనటులు విషయానికొస్తే.. మారుతీనగర్‌ సుబ్రమణ్యం పాత్రను తనదైన శైలిలో నేచురల్‌గా చేసుకెళ్లిపోయారు రావు రమేశ్‌. ఇలాంటి పాత్రల్ని పండించడం ఆయనకు కొత్తేమీ కాదు. చక్కని వినోదాన్ని పంచారు, భావోద్వేగాన్ని పలికించారు. ఈ కథ అంతా ఆయన చుట్టూనే తిరుగుతుంటుంది. అయినా ఆయన నటనలో తడబాటు కనిపించలేదు. నటనలో అతని అనుభవం బాగా ఉపయోగపడింది. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇంద్రజ ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌ చేసిన సినిమా ఇది. ఆమె నటనకు పేరు పెట్టక్కర్లేదు. బాధ్యత గల మహిళగా, నిజాయతీగల ఉద్యోగిగా కళారాణి పాత్రకు వంద శాతం న్యాయం చేసింది. అంకిత్‌ పక్కింటి కుర్రాడిలా చక్కగా నటించాడు. అతని డైలాగ్‌ డెలివరీ బావుంది. అల్లు అరవింద్‌ కొడుకుని అని, అల్లు అర్జున్‌ రిఫరెన్స్‌లతో చక్కని టైమింగ్‌తో నవ్వించాడు. మోడ్రన్‌ అమ్మాయిగా, చిన్నపాటి అమాయకత్వం గల కాంచన పాత్రలో రమ్య పసుపులేటి చక్కగా నటించింది. అందంగా కనిపించడంతోపాటు బాగానే నవ్వించింది. అంకిత్‌, రమ్య పాత్రలకు యూత్‌ బాగా కనెక్ట్‌ అవుతారు. అజయ్‌, హర్షవర్థన్‌, అన్నపూర్ణమ్మ, ప్రవీణ్‌ ఆయా పాత్రలో అలరించారు. పాటలు బావున్నాయి. కథ, వినోదం, క్లైమాక్స్‌ సన్నివేశాలు సినిమాకు ప్లస్‌గా నిలిచాయి. స్ర్కీన్‌ప్లే కాస్త డల్‌గా అనిపించింది. సన్నివేశాలు కొన్ని ఊహకు అందేలా ఉన్నాయి. గ్రిప్పింగ్‌ మిస్‌ అయిన భావన కలిగింది. కెమెరా వర్క్‌ క్వాలిటీగా ఉంది. పాటల చిత్రీకరణలో రిచ్‌నెస్‌ కనిపించింది. ఎడిటింగ్‌ ఇంకాస్త గ్రిప్పింగ్‌గా ఉండే అక్కడక్కడా బోర్‌ కొట్టేది కాదు. ఎలాంటి అంచనాలు లేకుండా సినిమాకు వెళ్తే సరదాగా నవ్వుకోవచ్చు.

Tagline: సుబ్రమణ్యం ఫర్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌!

Updated Date - Aug 23 , 2024 | 02:52 PM