Bramayugam Movie Review: మమ్ముట్టి నటన చూడాల్సిందే!
ABN , Publish Date - Feb 23 , 2024 | 04:19 PM
మమ్ముట్టి ఒక వైవిద్యమైన పాత్రలో కనపడిన 'భ్రమయుగం' మలయాళం సినిమా గతవారం మలయాళంలో విడుదలైంది. ఈవారం తెలుగులో అదే పేరుతో విడుదలయింది. రాహుల్ సదాశివన్ దర్శకుడు, కేవలం మూడు పాత్రల మధ్య జరిగే ఆసక్తికర సంఘర్షణ ఈ సినిమా కథ. ఎలా వుందో చదవండి
సినిమా: భ్రమయుగం
నటీనటులు: మమ్ముట్టి, అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్దా లిజ్, మణికందన్ ఆచారి
ఛాయాగ్రహణం: షెహనాద్ జలాల్
సంగీతం: క్రిస్టో జేవియర్
నిర్మాత: చక్రవర్తి రామచంద్ర, ఎస్ శశికాంత్
రచన, దర్శకత్వం: రాహుల్ సదాశివన్
రేటింగ్: 3.5 (Three and half)
విడుదల తేదీ: ఫిబ్రవరి 23, 2024
-- సురేష్ కవిరాయని
మలయాళం సినిమాలు ఎప్పుడూ ఆలోచనాత్మకంగా ఉంటాయి, అలాగే ఎక్కువగా మలయాళ నేటివిటీకి చాలా దగ్గరగా ఉంటాయి. మలయాళం పరిశ్రమలో చాలామంది సూపర్ స్టార్ నటులు వున్నారు, వారందరూ వ్యాపారాత్మక సినిమాలే కాకుండా, అప్పుడప్పుడూ మంచి వైవిధ్యమైన కథలతో, పాత్రలతో ప్రేక్షకులను, అభిమానులను రంజింపచేస్తూ తమ ప్రతిభని చాటుతూ వుంటారు. అలాంటి సూపర్ స్టార్ నటుల్లో మమ్ముట్టి ఒకరు, అతనిప్పుడు ఒక వైవిధ్యమైన పాత్రలో కనపడిన సినిమా 'భ్రమయుగం'. ఇది మలయాళంలో గత వారం విడుదలైంది, ఈరోజు అంటే ఫిబ్రవరి 23న తెలుగులో విడుదలైంది. మలయాళంలో ఈ సినిమాకి మంచి ప్రజాదరణతో పాటు విమర్శకుల ప్రసంశలు కూడా వచ్చాయి. రాహుల్ సదాశివన్ ఈ సినిమాకి దర్శకుడు, చక్రవర్తి రామచంద్ర, ఎస్ శశికాంత్ లు నిర్మాతలు.
Bramayugam story కథ:
ఈ కథ 17వ శతాబ్దంలో మలబారు తీరంలో జరిగింది. తక్కువ కులానికి చెందిన ఒక జానపద గాయకుడైన దేవన్ (అర్జున్ అశోకన్) యుద్ధం వచ్చినప్పుడు ఆ రాజ్యం నుండి తప్పించుకుని, ఇంకొక మిత్రుడితో తన తల్లిని కలుసుకోవాలని అడవుల వెంట పరిగెడుతూ వుంటారు. దారితప్పి అడవిలో తిరుగుతున్న వారికి, ఒక యక్షి (అమల్దా లిజ్) వచ్చి దేవన్ మిత్రుడిని చంపేస్తుంది. దేవన్ ఒక్కడే ఆహారం కోసం వెతుకుతూ ఆ అడవిలో దారి తప్పి ఒక పాడుబడ్డ భవనం చేరుకుంటాడు. ఆ భవనంలో కొడుమన్ పొట్టి (మమ్ముట్టి), అతని వంటవాడు (సిద్ధార్థ్ భరతన్) ఉంటారు, వచ్చిన దేవన్ ని చాలాకాలం తరువాత వచ్చిన అతిధి అని ఆ భవనంలో ఉండమంటాడు కొడుమన్. కొన్ని రోజుల తరువాత దేవన్ కి వింతైన సంఘటనలు, అనుభూతులు ఆ భవనంలో ఎదురవుతూ ఉంటాయి, అలాగే తను ఆ భవనంలో బంధీ అయిపోయాను అని తెలుసుకుంటాడు. అక్కడి నుండి తప్పించుకోవాలని చూస్తాడు, కానీ అతనికి సాధ్యం కాదు. కొడుమన్ పొట్టి దేవన్ గురించి చాలా విషయాలు చెప్తాడు, తాంత్రిక విద్యలు కూడా తెలుసు. ఇంతకీ ఈ కొడుమన్ పొట్టి ఎవరు, అతని నేపధ్యం ఏమిటి? వంటవాడికి అతనికి గల సంబంధం ఏంటి, ఎందుకు వంటవాడు ఆ భవనంలో ఉంటాడు? ఆ భవనంలో వింతైన శబ్దాలు వినపడుతూ ఉండటానికి గల కారణాలు ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే 'భ్రమయుగం' సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
దర్శకుడు రాహుల్ సదాశివన్ ఒక డార్కు హర్రర్ థ్రిల్లర్ చూపించాలని, ఒక వైవిధ్యమైన కథని ఎంచుకున్నారు. అలాగే ఈ సినిమాలో కేవలం ముగ్గురే ప్రధాన పాత్రధారులు వుంటారు. ఒక పాడు పడిన భవనంలో ముగ్గురి ప్రధాన పాత్రలమధ్య జరిగే కథని రెండు గంటలకి పైగా ఆసక్తికరంగా చూపించటంలో దర్శకుడి రాహుల్ ప్రతిభ కనపడుతుంది. ఆద్యంతమూ ఎక్కడా బోర్ కొట్టకుండా, ప్రేక్షకుడిని కట్టి పడేసే విధంగా ప్రతి సన్నివేశం చూపించటంలో సఫలం అయ్యాడు. ఒక జానపద గాయకుడు దారితప్పి ఒక పాడుపడ్డ భవనంలోకి వస్తాడు, అక్కడ ఒక తాంత్రికుడు, అతని వంటవాడు వుంటారు. బందీ అయిపోయాను అనుకున్న అతను అక్కడి నుంచి తప్పించుకోవాలని అనుకున్న సమయంలో జరిగిన సంఘటనలను బాగా రక్తి కట్టించాడు. ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే, సినిమా అంతా బ్లాక్ అండ్ వైట్ లో చూపిస్తారు, అలాగే ఈ కథకి ఛాయాగ్రహణం, సంగీతం మూల స్తంభాలుగా నిలబడి, ప్రతి సన్నివేశం ప్రేక్షకుడికి ఉత్కంఠని రేపిస్తాయి.
సినిమా మొదలవటమే అడవిలో ఇద్దరు మిత్రులు దారి తప్పిపోయినప్పుడు మొదలవుతుంది, అక్కడ నుండే ప్రేక్షకుడికి కూడా ఆసక్తి మొదలవుతుంది. మమ్ముట్టి ప్రవేశం, అతని హావభావాలు, అతని మాటలు చెప్పడం, అతని నటనతో ఇక సినిమా ఆసక్తిగా ముందుకు సాగడమే కాకుండా, తదుపరి వచ్చే సన్నివేశం ఏమి జరుగుతోంది అనే ఆసక్తి ప్రేక్షకుడి మదిలో మెదిలేట్టు చేయిస్తాడు దర్శకుడు. మాటలు కూడా చాలా పదునుగా వుండి.. కర్మ, విధి, జన్మ ఇలాంటి వేదాంతపరమైన అర్థాలు వచ్చేట్టు చాలా బాగున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆ పాడుపడ్డ భవనం, అందులో ఎదురయ్యే సంఘటనలు, ఆ రహస్య మార్గాలు అవన్నీ బాగా చూపించడమే కాకుండా, ఆసక్తిని రేకిస్తాయి. చెప్పాలంటే దర్శకుడు ప్రేక్షకుడిని ఆ భవనంలోకి తీసుకెళతాడు తన ప్రతిభతో అని చెప్పొచ్చు. పాటలన్నీ కథకి అనుగుణంగా ఉంటాయి, ఆలోచనాపరంగా కూడా ఉంటాయి. సంగీతం, ఛాయాగ్రహణం ఈ రెండూ సినిమాకి ఆయువుపట్టు అని చెప్పొచ్చు.
ఇక నటీనటుల విషయానికి వస్తే మమ్ముట్టి తన పాత్రని అదరగొట్టారు అని చెప్పొచ్చు. ఎంతో అనుభవం, ఎన్నో పాత్రలు, అందులో ఇదొక వైవిధ్యమైన పాత్ర. తెలుగులో కూడా తన సొంత గొంతు ఇచ్చి మాటలు గంభీరంగా చెప్పడమే కాకుండా, ఆ పాటల్లో అతను మమేకమైన తీరు ఎంతో అబ్బురపరుస్తుంది. 'భ్రమయుగం' సినిమా అంటే మమ్ముట్టి అంతే! ఒక సూపర్ స్టార్ అయి వుండి, అతను ఇలాంటి వైవిధ్యమైన కథలు ఎంచుకోవటం నిజంగా అతన్ని మెచ్చుకోవాల్సిందే. తెలుగు నటులు కూడా ఇలాంటి వైవిధ్యమైన కథలు, పాత్రలు చేసే సమయం ఎప్పుడు వస్తుందో చూడాలి. మమ్ముట్టి తరువాత దేవన్ పాత్ర వేసిన అర్జున్ అశోకన్ కూడా ఆ పాత్రలో లీనమై నటించాడు. ప్రేక్షకుడికి అక్కడ నటుడు ఎవరనేది కాకుండా ఆ పాత్ర మాత్రమే కనపడుతుంది. కొన్ని సన్నివేశాల్లో మమ్ముట్టితో సమానంగా నటించాడు. సిద్ధార్థ్ భరతన్ వంటవాడిగా అద్భుత పాత్ర పోషించాడు. ఈ ముగ్గురే ప్రధాన నటులు.
చివరగా 'భ్రమయుగం' పీరియడ్ డ్రామాగా వచ్చిన హర్రర్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. దర్శకుడు రాహుల్ సదాశివన్ ప్రేక్షకుడిని ఆ భవనంలోకి తీసుకెళతాడు, అంతలా ప్రతి సన్నివేశం ఆకట్టుకునేట్టు చూపించాడు. ముగ్గురు నటులు పోటీపడి నటించడం, ముఖ్యంగా మమ్ముట్టి నటన, నేపధ్య సంగీతం, ఛాయాగ్రహణం అన్నీ ఆకట్టుకుంటాయి. వైవిధ్యమైన సినిమా చూడాలనుకునేవారు ఈ సినిమాని తప్పకుండా చూడండి, మిస్ అవొద్దు.