Love Guru Movie Review: ఇది ఆ హిందీ సినిమాకి రీమేక్ లా అనిపిస్తోంది

ABN , Publish Date - Apr 11 , 2024 | 05:01 PM

ఎప్పుడూ సీరియస్ పాత్రల్లో కనిపించే విజయ్ ఆంటోనీ ఈసారి ఒక వినోదాత్మక సినిమా అయిన 'లవ్ గురు' తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మృణాళిని రవి కథానాయిక, వినాయక్ వైద్యనాథన్ దర్శకుడు. ఈ సినిమా ఎలా వుందో చదవండి.

Love Guru Movie Review: ఇది ఆ హిందీ సినిమాకి రీమేక్ లా అనిపిస్తోంది
Love Guru Movie Review

సినిమా: లవ్ గురు

నటీనటులు: విజయ్ ఆంటోనీ, మృణాళిని రవి, యోగిబాబు, సుధ, ఇళవరసు, వీటీవీ గణేష్‌, తలైవాసల్‌ విజయ్‌, శ్రీజ రవి తదితరులు

సంగీతం: భరత్ ధనశేఖర్

ఛాయాగ్రహణం: ఫరూక్‌ జె భాషా

దర్శకత్వం: వినాయక్‌ వైద్యనాధన్‌

నిర్మాత: మీరా విజయ్‌ ఆంటోనీ

విడుదల తేదీ: ఏప్రిల్ 11, 2024

రేటింగ్: 2.5 (రెండు పాయింట్ ఐదు)

-- సురేష్ కవిరాయని

విజయ్ ఆంటోనీ 'బిచ్చగాడు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకి కూడా దగ్గరయ్యారు. అతని తమిళ సినిమాలు అన్నీ తెలుగులోకి అనువాదం అవుతూ వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా విజయ్ ఆంటోనీ కథానాయకుడిగా నటించిన 'రోమియో' అనే తమిళ సినిమా తెలుగులోకి 'లవ్ గురు' అనే పేరుతో ఈరోజు విడుదలైంది. మృణాళిని రవి ఇందులో కథానాయకురాలు, వినాయక్ వైద్యనాధన్ దర్శకుడు, అతనికి దర్శకుడిగా ఇదే మొదటి సినిమా. విజయ్ ఆంటోనీ తన సొంత బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు.

vijayantony.jpg

Love Guru Story కథ:

అరవింద్ (విజయ్ ఆంటోనీ) మలేషియాలో పని చేస్తూ బాగా డబ్బులు సంపాదించి సొంత ఊరుకి వస్తాడు. 35 ఏళ్ళు వచ్చిన అతనికి తల్లిదండ్రులు పెళ్లి చేసుకోమని చెబితే, నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్తాడు. అదే వూర్లో తన తండ్రి స్నేహితుడి కుమార్తె లీల (మృణాళిని రవి)ని చూసి పెళ్లిచేసుకుంటాను అని తల్లిదండ్రులకి చెప్తాడు, లీలకి ఇష్టం లేకపోయినా, తండ్రి మాటని కాదనలేక అరవింద్‌ని పెళ్లి చేసుకుంటుంది. పెళ్లయ్యాక వూరు నుండి భార్యాభర్తలు ఇద్దరూ సిటీకి వచ్చేస్తారు. ఈ ఇద్దరికీ వయసులో పదేళ్లు వ్యత్యాసం. లీలకి పెద్ద నటి అయి పేరు తెచ్చుకోవాలని కోరిక, అందుకని సిటీకి వచ్చాక భర్త అరవింద్‌ని దూరం పెడుతుంది. తనలాగే సినిమాల్లో చేరాలనుకుంటున్న ముగ్గురు స్నేహితులను ఇంటికి రప్పించుకుంటుంది, సినిమాల్లో తన ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. తన భార్య ప్రేమను పొందేలా తనే ఏదైనా చేయాలనుకుని, భార్య కోసం తనే సినిమా నిర్మిస్తానని, అందులో కథానాయకుడిగా తనే నటిస్తానని అరవింద్ చెప్తాడు. ఇంతకీ తన భర్త నిర్మాతగా, కథానాయకుడిగా చేసే సినిమాలో లీల నటించడానికి ఒప్పుకుందా? అరవింద్, లీలకి దగ్గరవడానికి విక్రమ్‌గా ఎందుకు మారాల్సి వచ్చింది? లీల, అరవింద్ లు చివరికి విడిపోయారా, కలిసున్నారా? అరవింద్‌కి చిన్నప్పటి చెల్లెలి సంఘటన పదే పదే ఎందుకు గుర్తుకువస్తుంది? దాని వెనుక వున్న నేపధ్యం ఏంటి? చెల్లెలు చివరికి కనిపిస్తుందా? ఇవన్నీ తెలియాలంటే 'లవ్ గురు' సినిమా చూడాల్సిందే.

loveguru.jpg

విశ్లేషణ:

దర్శకుడిగా వినాయక్ వైద్యనాథన్ మొదటి సినిమా ఈ 'లవ్ గురు'. అయితే ఈ సినిమా కథ కొత్తదేమీ కాదు. ఇలాంటివి ఇంతకు ముందు చాలానే వచ్చాయి. అయితే ఈ సినిమా కథ ప్రారంభం ముందుగా చిన్నప్పుడు అన్నాచెల్లెళ్ల పాత్రలతో ప్రారంభం అవుతుంది. చెల్లెలు బాంబు దాడుల్లో తప్పిపోతుంది. చెల్లెలి కోసం అన్నయ్య ఆరాటపడే సిస్టర్ సెంటిమెంట్‌తో ప్రారంభించారు, కానీ వాటి గురించి ఎందుకో మరీ లోతుగా చూపించలేదు. మళ్ళీ చివర్లోనే ఈ సిస్టర్ సెంటిమెంట్ వాడారు, అలాగే కథానాయకుడికి మధ్య మధ్యలో ఆ చిన్నప్పటి సంఘటన గుర్తుకు వస్తూ ఉంటుంది. సిస్టర్ సెంటిమెంట్‌తో ప్రారంభం చేసిన తరువాత కథానాయకుడికి పెళ్లి, తరువాత వారిద్దరి మధ్య వచ్చే ఆ సన్నివేశాలతో సాగుతూ ఉంటుంది.


ప్రారంభంలోనే భార్య భర్తల మధ్య వయసు చాలా ఎక్కువని చెప్పేస్తారు. భార్య నటి కావాలనుకోవడం, భార్య ప్రేమని పొందటం కోసం భర్త తాపత్రయపడటం, అలా వీలుకాని పరిస్థితుల్లో ఆమెకి వేరే వ్యక్తిగా ఫోన్ చేసి ఆమెకి దగ్గరవుతాడు. ఇలా మొదటి సగం అంతా కాస్త వినోదాత్మతంగా సాగుతుంది. కానీ రెండో సగం వచ్చేసరికి అంతా సినిమా షూటింగ్స్‌తో సాగదీసినట్టుగా చూపిస్తాడు. భర్తే సినిమా నిర్మాత, కథానాయకుడిగా నటించడం, ఆ సినిమా చిత్రీకరణ చేసుకోవటం అవన్నీ కొంచెం బోర్ కొట్టిస్తాయి. అయితే ఇక్కడ భర్త వేరే వ్యక్తిలా భార్యతో మాట్లాడుతూ వుండే సన్నివేశాలు చూస్తే మీకు ఠక్కున ఒక హిందీ సినిమా గుర్తుకు వచ్చేయాలి కదా! అదే షారుఖ్ ఖాన్, అనుష్క శర్మ నటించిన 'రబ్ నే బనా ది జోడి' హిందీ సినిమా. అందులో కూడా ఇలాంటి కథే. అయితే ఇందులో అమాయకంగా కనిపించే షారుఖ్ ఖాన్ మేకోవర్ చేసుకొని ఒక చలాకీగా వుండే డాన్సర్ గా మారి తన భార్యకి పరిచయమై ఆమెకి దగ్గరవుతాడు.

lovegurustill.jpg

ఈ 'లవ్ గురు' సినిమాలో విక్రమ్ అనే వేరే వ్యక్తిగా ఫోన్ లో మాట్లాడుతూ తన భార్యకి దగ్గరవుతాడు విజయ్ ఆంటోనీ. ఈ 'లవ్ గురు' కథ ఆ హిందీ సినిమా నుండి తీసుకున్నది అని ఇట్టే అర్థం అయిపోతుంది. రెండో సగం పతాక సన్నివేశంలో మళ్ళీ చెల్లెలు సెంటిమెంట్ ని ముడిపెడతాడు దర్శకుడు. భార్య భర్తలు కలవడానికి ఈ చెల్లెలు కథ ఉపయోగపడేటట్టు దర్శకుడు కథని రాసుకున్నాడు. ఎక్కువ భాగం మాత్రం భార్య భర్తల మధ్య నడిచే సన్నివేశాలు, వారి మధ్య వచ్చే చిన్న చిన్న తగాదాలు కొన్ని వినోదాత్మకంగా ఉంటాయి, కొన్ని అలరిస్తాయి. కథలో కొత్తదనం లేకపోవటం, ప్రేక్షకుడికి సన్నివేశాలు ముందుగానే తెలిసిపోయేట్టు ఉండటం, రెండో సగం నత్తనడకగా ఉండటం ఈ సినిమాకి కాస్త మైనస్ అని చెప్పుకోవాలి.

ఇక నటీనటుల విషయానికి వస్తే సీరియస్ పాత్రల్లో కనిపించే విజయ్ ఆంటోనీ ఈసారి ఒక వినోదాత్మకమైన పాత్రలో కనిపించాడు. అతను చాలా నిజాయితీతో ఈ పాత్ర చేశాడు, మెప్పించాడు అనే చెప్పాలి. మృణాళిని రవి చాలా అందంగా వుంది, తన పాత్రని చాలా చక్కగా అభినయించి చూపించింది. మంచి ప్రతిభ కల నటి అని చెప్పొచ్చు. ఇక వీటీవీ గణేష్ తనదైన రీతిలో కొన్ని సన్నివేశాల్లో నవ్విస్తాడు. యోగిబాబు కూడా సినిమాకి ప్లస్ అయ్యాడనే చెప్పాలి. తెలుగు నటి సుధ, విజయ్ ఆంటోనీ తల్లిగా కనిపిస్తారు. మిగతా పాత్రల్లో వారి వారి పరిధి మేరకు అందరూ నటించారు. నేపధ్య సంగీతం, ఛాయాగ్రహణం బాగున్నాయి, సినిమాకి అవి బాగా ఉపయోగపడ్డాయనే చెప్పొచ్చు.

lovegurustilltwo.jpg

చివరగా, 'లవ్ గురు' సినిమా చూస్తున్నప్పుడు షారుఖ్ ఖాన్, అనుష్క శర్మ నటించిన 'రబ్ నే బనా ది జోడి' గుర్తుకు వస్తుంది. ఆ సినిమాలో లేనిది, ఈ సినిమాలో వున్నది ఏంటంటే సిస్టర్ సెంటిమెంట్. దర్శకుడు వైద్యనాధన్ పాత కథనే కొత్తగా చూపించడానికి ప్రయత్నం చేశాడు, కానీ కొంతవరకే సఫలం అయ్యాడు. మొదటి సగం వినోదాత్మకంగా ఉంటే, రెండో సగంలో సాగదీత ఎక్కువైంది. ఇదొక టైమ్ పాస్ సినిమా అని చెప్పొచ్చు.

Updated Date - Apr 11 , 2024 | 05:28 PM