KA Review: కిరణ్‌ అబ్బవరం కొత్త ప్రయత్నం 'క' ఎలా ఉందంటే

ABN , Publish Date - Oct 31 , 2024 | 08:12 AM

జయాపజయాలను పట్టించుకోకుండా వరుస సినిమాలు చేస్తున్నారు కిరణ్‌ అబ్బవరం. పలు పరాజయాల తర్వాత కాస్త గ్యాప్‌ తీసుకుని, తనని తాను నిరూపించుకోవడానికి చేసిన చిత్రం ‘క’. దీపావళి బరిలో నిలిచిన నాలుగు చిత్రాల్లో ఇదీ ఒకటి.

Ka Movie Poster

సినిమా రివ్యూ: 'క: ది సోల్‌’ (KA Review)
విడుదల తేదీ: 31–10–2024
నటీనటులు: కిరణ్‌ అబ్బవరం, నయన్‌ సారిక, తన్వీ రామ్‌, అచ్యుత్‌కుమార్‌, రెడిన్‌ కింగ్‌స్లే తదితరులు
సాంకేతిక నిపుణులు:
సినిమాటోగ్రఫీ: విశ్వాస్‌ డేనియల్‌, సతీశ్‌రెరెడ్డి
సంగీతం: సామ్‌ సీఎస్‌
ఎడిటింగ్‌: శ్రీ వరప్రసాద్‌,
నిర్మాత: చింతా గోపాలకృష్ణ;
రచన, దర్శకత్వం: సుజీత్‌ – సందీప్‌.


జయాపజయాలను పట్టించుకోకుండా వరుస సినిమాలు చేస్తున్నారు కిరణ్‌ అబ్బవరం. పలు పరాజయాల తర్వాత కాస్త గ్యాప్‌ తీసుకుని, తనని తాను నిరూపించుకోవడానికి చేసిన చిత్రం ‘క’. దీపావళి బరిలో నిలిచిన నాలుగు చిత్రాల్లో ఇదీ ఒకటి. సినిమా ప్రమోషన్స్‌లో కిరణ్‌ అబ్బవరం చేసిన వ్యాఖ్యలు సినిమాపై ఆసక్తి రేపాయి. ఆయన చెప్పినట్లు ఈ సినిమాలో ఉన్న కొత్తదనమేంటి? పండుగ సందర్భంగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని అలరించిందా లేదా అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

Also Read-Chaitu Sobhita Wedding: నాగచైతన్య, శోభితాల పెళ్లికి తేదీ ఫిక్సయింది.. ఎప్పుడంటే

కథ...
అభినయ వాసుదేవ్‌ (కిరణ్‌ అబ్బవరం) ఓ అనాధ, తన తల్లిదండ్రుల జాడ తెలుసుకోవాలని తపన పడుతుంటాడు. ఎవరూ లేని అతనికి గురునాధం (బలగం జయరామ్‌) ఆశ్రయమిస్తాడు. చిన్నప్పటి నుంచి వాసుదేవ్‌‌కి ఇతరుల ఉత్తరాలు చదివే అలవాటు ఉంటుంది. ఆ ఉత్తరాల రాతల్లో తాను పొగొట్టుకున్న బంధాల్ని చూసుకుంటాడు. గురునాధం మాస్టర్‌కు వచ్చిన ఉత్తరం చదివాడన్న కోపంతో అతన్ని దండిస్తాడు. అంతే అక్కడున్న డబ్బు తీసుకుని ఆశ్రమం నుంచి పారిపోయి కృష్ణగిరి అనే మారుమూల పల్లెలో కాంట్రాక్ట్‌ పోస్ట్‌మెన్‌గా చేరతాడు. అక్కడ తెల్లవారుజామునే అమ్మాయిలు మిస్‌ అవ్వడం గమనిస్తాడు. ఉత్తరాలు చదివే అలవాటున్న వాసుదేవ్‌‌కు మిస్సింగ్‌ కేసులకు సంబంధించి ఓ విషయం తెలుస్తుంది. ఆ క్రమంలో ఇబ్బందుల్లో చిక్కుకుంటాడు. అసలు క్రిష్ణగిరిలో అమ్మాయిలు తప్పిపోవడానికి కారణమేంటి? అభినయ్‌ వాసుదేవ్‌ ఓ చీకటి గదిలో బంధీగా ఎందుకు ఉన్నాడు. లాలా, అబిద్‌ షేక్‌ల వ్యవహారమేంటి? అభినయ్‌తోపాటు, చీకటి గదిలో ఉన్న రాధ (తన్విరామ్‌) ఎవరు? వీరిద్దరి జీవితంలోకి వచ్చిన ముసుగు వ్యక్తి ఎవరు? వాసుదేవ్‌ – సత్యభామ ప్రేమ కథ ఏమైంటి? ఈ చీకటి గది నుంచి అభినయ్‌, రాధ బయటపడ్డారా లేదా? అన్నది సినిమా ఇతివృత్తం.

Also Read-Jai Hanuman: ‘జై హనుమాన్’లో హనుమంతుడిగా ఎవరంటే.. లుక్ వచ్చేసింది


KA.jpg
విశ్లేషణ:
సినిమా ప్రమోషన్స్‌లో కిరణ్‌ అబ్బవరం సినిమా పట్ల ఎంతో నమ్మకంగా మాట్లాడారు. ‘ఇలాంటి కథ ఇప్పటి వరకూ రాలేదు, వస్తే సినిమాలు మానేస్తా’ అని స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. అలాగే ఐడియాకు కొత్త, పాత అనేది ఉండదు. ప్రజంటేషన్‌ కొత్తగా ఉంటే కొత్తదనం అదే వస్తుంది ఇదీ దర్శకుల్లో ఒకరైన సందీప్‌ చెప్పిన మాట ఇది. అయితే సినిమా క్లైమాక్స్‌ చేరుకునే సరికి అది నిజమే అనిపిస్తుంది. 1980ల్లో సాగే కథ ఇది. కొండల మధ్య ఉండి, మధ్యాహ్నాం మూడు గంటలకే చీకటి పడే క్రిష్టగిరి గ్రామం, అందులో అమ్మాయిలు తప్పిపోతున్నారనే సమస్య. ఆ సమస్య పరిష్కారానికి వెళ్లిన హీరోకి సమస్యలు ఇది క్తుపంగా కథ. మనిషి పుట్టుక.. కర్మ, దాని పర్యావసానం, రుణానుబంధాలకు ముడివేసి దర్శకులు రాసుకున్న కథ ఇది. ముసుగు వ్యక్తి హీరోని కిడ్నాప్‌ చేసి.. చీకటి గదిలో బంధించడంతో సినిమా మొదలవుతుంది. ముసుగు వ్యక్తి కాలచక్రం సాయంతో హీరోని జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లి ఒక్కో ప్రశ్నకు సమాధానం చెప్పించిన తీరు బావుంది, అభినయ్‌ వాసు.. కృష్ణగిరికి వచ్చాకే అసలు కథ మొదలవుతుంది. ఊళ్లో అమ్మాయిల కనిపించకుండా పోవడం.. వాసు – రాధల మధ్య ప్రేమ కథ ఆ క్రమంలో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అయితే సస్పెన్స్‌మెయిన్‌టెన్‌ చేస్తూ థ్రిల్‌ కలిగించడంలో ఎక్కడో చిన్న తడబాటు కనిపించింది. సమస్యను ఛేదించే క్రమం, యాంగ్జైటీ మధ్య ప్రేమ కథ బ్రేకులు వేసినట్లు అనిపించింది. ఫస్టాఫ్‌ కాస్త స్లోగా సాగినా ఇంటర్వెల్‌ ట్విస్ట్ దానిని అంతగా పట్టించుకోనివ్వదు. ఆ ట్విస్ట్‌ నుంచి సెకండాఫ్‌ మరింత ఆసక్తిగా సాగింది. కోర్టు దగ్గర యాక్షన్‌ సీక్వెన్స్‌, క్లైమాక్స్‌ ఫైట్‌ మరింత అలరిస్తాయి. క్లైమాక్స్‌ 20 నిమిషాలు ఊహించని రీతిలో ఉంటుందీ సినిమా. చీకటి గది, ఓ అడ్డు గోడ, అందులో ఓ ఇద్దరు వ్యక్తులు. ఆ చీకటి గదిని తల్లి గర్భంగా  చూపించిన  తీరును హృదయాన్ని బరువెక్కిస్తుంది. అదే లింక్‌ చేసిన కైమాక్స్‌ నిజంగా కొత్త అనుభూతి కలిగిస్తుంది. అయితే క్లైమాక్స్‌ 15 నిమషాలు చూశాక ఐడియా ఎలాంటిది అయినా దానిని చూపించే విధానం, ప్రేక్షకుల మనసుకు టచ్‌ అయ్యేలా చెప్పడం అన్నది ముఖ్యం అని దర్శకుడు వేదికపై చెప్పింది నిజమే అనిపిస్తుంది. ఆ ప్రయత్నంలో దర్శక ద్వయం సఫలం అయ్యారు.

Also Read- KA Twitter Review: ట్విట్టర్‌లో ‘క’ మూవీ టాక్ ఎలా ఉందంటే..


 


నటీనటులు – సాంకేతిక నిపుణులు:
ఇప్పటిదాకా కిరణ్‌ అబ్బవరం ప్రేమకథలు, యాక్షన్‌ టచ్‌ ఉన్న కథలు చేశారు. ఈ సినిమా ఆయనకు కొత్త జానర్‌. సహజమైన నటనతో ఆకట్టుకున్నారు. యాక్షన్‌ సీక్వెన్స్‌ బాగా చేశాడు. భావోద్వేగ సన్నివేశాలకు చక్కని న్యాయం చేశాడు. కంఫర్ట్‌ జోన్‌ నుంచి బయటకు వచ్చి ఓ ప్రయోగం చేశారు. గ్రే షేడ్స్‌ చూపించారు. అతని కెరీర్‌కు ఉపయోగపడే చిత్రమిదని చెప్పవచ్చు. నయన్‌ సారిక నటన, 1980ల అమ్మాయిలా ఆకట్టుకుంది. తన్వి రామ్‌ది కథకు కీలకమైన పాత్రే. బలగం జయరామ్‌, అచ్యుత్‌ కుమార్‌, శరణ్య ప్రదీప్‌, అన్నపూర్ణమ్మ, అజయ్‌, బిందు చంద్రమౌళి తదితరులు పరిధి మేరకు నటించారు. రిడిన్‌కింగ్‌ స్లే కామెడీ వర్కవుట్‌ కాలేదు. అతను తెరపై కనిపించిన ప్రతిసారీ భారంగా అనిపిస్తుంది. అదే కామెడీని మరోలా ప్లాన్‌ చేసి ఉంటే సినిమాకు అది కూడా ప్లస్‌ అయ్యేది. సాంకేతిక నిపుణుల విషయానికొస్తే.. 1970–80ల ప్రాంతానికి తీసుకెళ్లారు దర్శకుడు. వాటికి సంబంధించిన ఆర్ట్‌ వర్క్‌ అంతా బాగా కుదిరింది. కెమెరా వర్క్‌ సినిమాకు అదనపు ఆకర్షణ. సంగీతం ఈ సినిమాకు మెయిన్‌ ఎసెట్‌. సామ్‌ సి.ఎస్‌ ఫస్ట్‌ మినిట్‌ నుంచే ఆర్‌ఆర్‌తో మంచి ఫీల్‌ కలిగించాడు. పాటలు బావున్నాయి. జాతర పాట మాస్‌ బీట్‌తో ఊపేస్తుంది. నిర్మాణ విలువలు ఎక్కడా తగ్గలేదు. 

మనిషి పుట్టుక.. కర్మ, దాని పర్యావసానం, రుణానుబంధాలకు ముడివేసి దర్శకులు రాసిన ఈ కథ ఇది. జీవితంలో మనం చేసే మంచి, చెడులకు సమాధానం చెప్పాల్సిందే అన్న పాయింట్‌ను.. తల్లి గర్భానికి,  ఓ చీకటి గదికి, అంతర ఆత్మకు లింక్‌ చేసిన ఆ ఒక్క పాయింట్‌ చాలు ప్రేక్షకుడు ఫిదా కావలసిందే. దర్శక ద్వయం పూర్తిగా ఓ కాన్సెప్ట్‌ మీద వెళ్లారు. చిన్న చిన్న పొరపాట్లను పక్కన పెడితే చెప్పాలనుకున్నది ప్రేక్షకుడిగా రీచ్‌ అయ్యేలా చెప్పారు. స్ర్కీన్‌ప్లే బావుంది. సినిమా ఫస్టాఫ్‌లో సాదాగా ఉండటం, అక్కడక్కడా మాటల్లో బలం లేకపోవడం, కామెడీ వర్కవుట్‌ కాకపోవడం ఇలాంటి మైనస్‌లను క్లైమాక్‌ గుర్తు రాకుండా చేస్తుంది. తొలిసారి కిరణ్‌ అబ్బవరం పాన్‌ ఇండియా స్థాయిలో తీసిన ఈ చిత్రం ఆయనకు ప్లస్సే అవుతుంది. కొత్త జానర్‌ చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులకు తప్పకుండా ఈ చిత్రం నచ్చుతుంది.


ట్యాగ్‌లైన్‌: KA - కిరణ్‌ అబ్బవరానికి రీ–బర్త్‌..

Also Read-NTR: కొత్త NTR వచ్చేశాడు.. జూ. ఎన్టీయార్ ఏమన్నాడంటే

Also Read-Star Heroine: ఈ ఫొటోలోని పాప ఇప్పుడొక స్టార్ హీరోయిన్.. ఎవరో కనిపెట్టండి చూద్దాం!

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 31 , 2024 | 08:54 AM