Jithender Reddy Review: రాకేష్ వర్రే నటించిన 'జితేందర్‌ రెడ్డి' ఎలా ఉందంటే

ABN , Publish Date - Nov 08 , 2024 | 09:22 AM

సినీ, రాజకీయనాయకులు బయోపిక్‌లు తెలుగుతోపాటు ఇతర భాషలకు కొత్తేమీ కాదు. దేశంలో స్వార్థం లేకుండా పని చేసే స్వయం సేవకుల బయోపిక్‌ ఎప్పుడో కానీ తెరపై కనిపించదు. అలాంటి స్వయం సేవకుడి కథను తెరపై ఆవిష్కరించారు దర్శకుడు విరించి వర్మ. అదే ' జితేందర్‌ రెడ్డి ’.

సినిమా రివ్యూ: జితేందర్‌ రెడ్డి (Jithender Reddy Review)
విడుదల తేది: 8–11–2024
నటీనటులు: రాకేష్‌ వర్రే, వైశాలి రాజ్‌, రియా సుమన్‌, ఛత్రపతి శేఖర్‌, సుబ్బరాజ్‌, రవిప్రకాశ్‌ తదితరులు


సాంకేతిక నిపుణులు:
సినిమాటోఫ్రీ: వి.ఎస్‌.జ్ఞానశేఖర్‌
సంగీతం: గోపీ సుందర్‌
ఎడిటింగ్‌: రామకృష్ణ అర్రం
నిర్మాత: ముదుగంటి రవీందర్‌రెడ్డి
దర్శకత్వం: విరించి వర్మ (Virinchi Varma)

సినీ, రాజకీయనాయకులు బయోపిక్‌లు తెలుగుతోపాటు ఇతర భాషలకు కొత్తేమీ కాదు. దేశంలో స్వార్థం లేకుండా పని చేసే స్వయం సేవకుల బయోపిక్‌ ఎప్పుడో కానీ తెరపై కనిపించదు. అలాంటి స్వయం సేవకుడి కథను తెరపై ఆవిష్కరించారు దర్శకుడు విరించి వర్మ. అదే ' జితేందర్‌ రెడ్డి ’.  ‘ఎవ్వరికీ చెప్పొద్దూ’ లాంటి లవ్‌ స్టొరీ చేసిన రాకేశ్‌ వర్రే (Rakesh Varre) తదుపరి ఇలాంటి హై ఓల్టెజ్‌  యాక్షన్‌ డ్రామా చెయ్యడం గొప్ప విషయం. అసలు అతను ఎవరు? నేపథ్యం ఏంటి? జితేందర్‌ రెడ్డిగా రాకేశ్‌ మెప్పించాడా అన్నది చూద్దాం. (Jithender Reddy Movie Review)

Jith-2.jpg
కథ: (
Jithender Reddy Movie Review)
1980లో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా జగిత్యాలలో జరిగిన యధార్థ గాథ. జితేందర్‌ రెడ్డి కుటుంబ సభ్యులు ఆర్‌ఎస్‌ఎస్‌ స్వయం సేవకులు. ఆ కుటుంబంలో పుట్టిన జితేందర్‌ చిన్నప్పటినుంచే ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్దాంతాలకు ఆకర్షితుడు అవుతాడు. దేశం, కోసం ధర్మం, ప్రజలు కోసం ఏదైనా చేయాలని తపన పడుతుంటాడు. అసలు జితేందర్‌రెడ్డి (రాకేశ్‌ వర్రే) ఎవరు? అతని బాల్యం ఎలా గడిచింది. నక్సల్స్‌ని ఎందుకు ఎదురించాడు? కాలేజీ రోజుల్లో ఏబీవీపీ నాయకుడిగా జితేందర్‌ ఎలాంటి పోరాటం చేశాడు? ఆయనపై ఆర్‌ఎస్‌ఎస్‌ నేత గోపన్న(సుబ్బరాజు) ప్రభావం ఎంతవరకు ఉంది? అతన్ని చంపడానికి నక్సల్స్‌  వేసిన ప్లాన్‌ ఏంటి? జితేందర్‌ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత జగిత్యాలలో ఎలాంటి మార్పులు జరిగాయి? కాలేజీ స్నేహితురాలు, లాయర్‌ శారద(రియా సుమన్‌) అతనికి ఎలా తోడుగా నిలిచింది? చివరికి ఎలా మరణించాడు అన్నది కథ.

విశ్లేషణ:
తెలంగాణలోని జగిత్యాలకు చెందిన దివంగత ఏబీవీపీ నాయకుడు జితేందర్‌ రెడ్డ్డి కథతో రూపొందిన చిత్రమిది. 1980లో జగిత్యాలలో నక్సలైట్లకు, ఆర్‌ఎస్‌ఎస్‌, ఏబీవీపీ నేతలకు మధ్య జరిగిన పోరాటంలో జితేందర్‌ రెడ్డి కీలక పాత్ర పోషించారు. వామపక్ష ఉద్యమాలు ఉదృతంగా ఉన్న సమయంలో వారికి వ్యతిరేకంగా జితేందర్‌రెడ్డి ఎలా పోరాటం చేశాడు అన్నది ఇతివృత్తంగా తీసుకుని దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జితేందర్‌ రెడ్డి గురించి జగిత్యాల ప్రాంతంలొ అందరికీ బాగా తెలుసు. నక్సల్‌పై ఆయన చేసిన పోరాటం గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటారు. కరీంనగర్‌ జిల్లా మినహా ఆయన గురించి, ఆయన కుటుంబ నేపథ్యం గురించి పూర్తిగా తెలిసిన వారు పెద్దగా లేరు. జితేందర్‌ రెడ్డి ఏబీవీపీ నాయకుడని, నక్సల్స్‌కు వ్యతిరేకంగా పోరాడి వారి చేతుల్లోనే మరణించారనే విషయం మాత్రమే తెలుసు. ఇందులో జితేందర్‌ రెడ్డి గురించి తెలియని ఎన్నో విషయాలు చెప్పారు. ఇందులో నిజం ఎంతనేది పక్కన పెడితే సినిమాటిక్‌ లిబర్టీతో దర్శకుడు తను రాసుకున్న కథను తను అనుకున్నట్లుగా తెరపై చూపించారు. జితేందర్‌ రెడ్డి బాల్యం నుంచి చనిపోయే అతని జీవితంలో కీలక ఘట్టాలన్నీ చూపించారు. ఆయన విషయంలో దర్శకుడు చాలా విషయాలు సేకరించి కాస్త డ్రమటైజ్‌ చేసి చిత్రీకరించారు. జితేందర్‌కి దేశభక్తి ఎక్కువనే విషయాన్ని సినిమా ప్రారంభంలోనే రిజస్టర్‌ చేశారు. 18 ఏళ్ల యువకుడి ఎన్‌కౌంటర్‌ తర్వాత కథపై మరింత ఆసక్తి పెరుగుతుంది. ప్రథమార్ధంలో జితేందర్‌ రెడ్డి బాల్యంతో పాటు ఆయన స్టూడెంట్‌ లీడర్‌గా ఎదిగిన తీరును చూపిస్తూ నక్సల్‌కి ఎలా టార్గెట్‌ అయ్యారనేది చూపించారు. ఈ వచ్చే కొన్ని సీన్లలో నాటకీయత మరీ ఎక్కువైనట్లు కనిపిస్తుంది. కాస్త ల్యాగ్‌ అనే భావన కలుగుతుంది. సెకండాఫ్‌ ప్రారంభం నుంచే సినిమా ఆసక్తిగా సాగుతుంది. నక్సల్స్‌పై జితేందర్‌ చేసిన పోరాటాలు గూస్‌బంప్స్‌ తెప్పిస్తాయి. అప్పటి ముఖ్యమంత్రిని స్వయంగా కలిసి నక్సల్స్‌పై చేసే ఫిర్యాదు సీన్‌, ఎన్నికల ప్రచారం, క్లైమాక్స్‌ అద్భుతంగా ఉంటాయి. తెలుగు తెరపై కామ్రేడ్స్‌ ను హీరోలుగా చూపిస్తూ సినిమాలు వచ్చాయి. దేశంలో పాతుకుపోయినా.. లెఫ్ట్‌, లిబరల్‌ ఏకో సిస్టం కారణంగా వారిని కథానాయకులుగా చూపిస్తూ వచ్చారు దర్శకులు. కానీ ఈ మధ్యన వచ్చే చిత్రాల్లో నక్సలిజంలోని చీకటి కోణాలను ఆవిష్కరిస్తూన్నారు మేకర్స్‌. అదా శర్మ ‘బస్తర్‌’ సినిమాలో నక్సలైట్స్‌ చేస్తున్న అరాచకాలను కళ్లకు కట్టినట్టు చూపించారు. దేశంలో భారత్‌, పాకిస్థాన్‌ యుద్దంలో (Jithender Reddy Movie Review) చనిపోయినవారికంటే ఎక్కువ మంది నక్సల్స్‌ చేతిలో చనిపోయారంటారు. ఈ సినిమా చూస్తే నిజమే అనిపిస్తుంది. అయితే ఈ తరహా కథలు తెరకెక్కించాలంటే లోతుగా ఆలోచన చేయాలి.. నేచురల్‌గా కథను చెప్పాలి.. అంతకన్నా ముందు ఎవరి మనోభావాలు దెబ్బ తీయకుండా సినిమా తీయాలి. ఇవన్నీ జరగాలంటే కథ తయారు చేసినప్పటి నుంచే ఓ ప్రణాళిక ఉండాలి. అంతకు మించి గట్స్‌ అవసరం. ఈ విషయంలో దర్శక నిర్మాతలు ధైర్యంతో ముందడుగు వేశారు. ముఖ్యంగా చిన్నపుడే సమాజం పట్ల ఎంతో అంకితభావం ఉన్న జితేందర్‌ రెడ్డి, సమాజానికి ఏదో మంచి చెయ్యాలనే తపనను చూపించాడు. కాలేజి రాజకీయాలు, అప్పట్లో వివిధ  విద్యావ్యవస్థల్లో బలంగా నాటుకుపోయిన పీడీఎస్‌యుకు ధీటుగా ఏబీవీపీ ఎలా ఎదురొడ్డి నిలబడిందనే విషయాన్ని తెరపై చక్కగా చూపించారు. కాలేజీ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదగడం,  పోలీసు వ్యవస్థకే ధీటుగా.. సమాజంలో నక్సలైట్లు చేసే అక్రమాలను ఎలా ఎదర్కొన్నాడు అనే ఎపిపోడ్స్‌ అలరిస్తాయి. ఓ సన్నివేశంలో లెఫ్ట్‌ లిబరల్స్‌ ఐడియాలజీ, రైట్‌ వింగ్‌ ఐడియాలజీలను చెప్పిస్తూ వచ్చిన సీన్స్‌ ఆలోచింపజేస్తాయి. ముఖ్యంగా సనాతన ధర్మం గొప్పతనం గురించి బాగా చెప్పారు. మాటలు ఆకట్టుకున్నాయి. పాటలు మాత్రం కాస్త ఇబ్బంది పెట్టాయి. సినిమా మంచి ఫ్లోలో ఉన్న సందర్భంలో పాటలు వచ్చి డిస్టర్బ్‌ చేశాయి. చివర్లో నక్సలైట్స్‌ చేతిలో చనిపోయిన స్వయం సేవకులను గుర్తు చేస్తూ వచ్చే పాట కంట తడిపెట్టిస్తోంది. క్లైమాక్స్‌ భావోద్వేగానికి గురి చేస్తోంది.  (Jithender Reddy Movie Review)

jith-3.jpg
నటీనటులు– సాంకేతిక నిపుణులు:
జితేందర్‌ రెడ్డి పాత్రలో రాకేశ్‌ వర్రే ఇమిడిపోయారు. నటనతోపాటు యాక్షన్‌ సన్నివేశాల్లో ఆగా యాక్షన్‌ సీన్స్‌ అదరగొట్టేశాడు. ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకుడు గోపన్నగా సుబ్బరాజు తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక నక్సలైట్‌గా ఛత్రపతి శేఖర్‌ పరకాయ ప్రవేశం చేశాడు. లాయర్‌గా రియా సుమన్‌ నిడివి తక్కువే అయినా చక్కగా నటించింది. కనిపించింది కాసేపే అయిన ఆకర్షించింది. జితేందర్‌ రెడ్డి పీఏ పాత్రలో రవి ప్రకాశ్‌ మెప్పించాడు. మిగతా ఆర్టిస్ట్‌లు పరిధి మేరకు చక్కగా నటించారు. 1980ల నాటి ఆర్ట్‌ వర్క్‌ బాగుంది. బ్యాక్‌ గ్రౌండ్‌ చక్కగా కుదిరింది.  సినిమాటోగ్రఫీ ఇంకాస్త బెటర్‌గా ఉంటే బావుండేది. ఎడిటింగ్‌ ఫర్వాలేదు. నిర్మాతలు ఖర్చుకు వెనకాడలేదు. కథ, కధనం, డైరెక్షన్‌ విషయంలో విరించి వర్మ మంచి మార్కులే తెచ్చుకున్నాడు. అయితే హీరో పాత్ర కాకుండ సినిమా ఇతర కీలక పాత్రలకు కాస్త ఎస్టాబ్లిష్‌ అయిన ఆర్టిస్ట్‌లను తీసుకుని ఉంటే బావుండేది. దర్శకుడు తను చెప్పాలనుకున్నది సూటిగానే చెప్పినా కొన్ని చోట్ల మరీ సినిమాటిక్‌ లిబర్టీ తీసుకున్నాడు. అది ఓవర్‌ డోస్‌ అయిన భావన కలుగుతుంది. ఇలాంటి చిత్రాలకు కమర్షియల్‌ హంగులు అద్దటానికి కుదరదు.

ట్యాగ్‌లైన్‌:  ఓ పక్క స్వయం సేవకుడు.. రెండో పక్క కామ్రేడ్స్‌ చీకటి కోణం

 

Updated Date - Nov 08 , 2024 | 09:22 AM