Darling Review: ప్రియదర్శి, నభ నటేష్ నటించిన 'డార్లింగ్' మెప్పించిందా లేక...

ABN , Publish Date - Jul 19 , 2024 | 12:28 PM

ప్రియదర్శి పులికొండ, నభ నటేష్ జంటగా నటించిన 'డార్లింగ్' సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అశ్విన్ రామ్ దర్శకుడు. 'హనుమాన్' లాంటి విజయవంతమైన సినిమా నిర్మించిన నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మాతలు. ఈ సినిమా ఎలా వుందో చదవండి.

Darling Movie Review

సినిమా: డార్లింగ్ (వై దిస్ కొలవరి?)

నటీనటులు: ప్రియదర్శి పులికొండ, నభ నటేష్, అనన్య నాగెళ్ల, మురళీధర్ గౌడ్, రఘుబాబు, నిహారిక కొణిదెల, విష్ణు, కృష్ణ తేజ తదితరులు

ఛాయాగ్రహణం: నరేష్ రామదురై

సంగీతం: వివేక్ సాగర్

నిర్మాతలు: కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి

రచన, దర్శకత్వం: అశ్విన్ రామ్

విడుదల తేదీ: జులై 19, 2024

రేటింగ్: 1.5

-- సురేష్ కవిరాయని

ప్రభాస్ నటించిన 'కల్కి 2898ఏడి' సినిమా తరువాత వరసగా సినిమాలు విడుదలవుతున్నాయి. గత వారం కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన 'భారతీయుడు 2' విడుదలైతే, ఈ వారం బడ్జెట్ సినిమా 'డార్లింగ్' విడుదలైంది. ఇందులో ప్రియదర్శి పులికొండ, నభ నటేష్ జంటగా నటిస్తే అశ్విన్ రామ్ దర్శకత్వం వహించాడు. మూడేళ్ళ తరువాత నభ నటేష్ ఈ సినిమాతో మళ్ళీ రి-ఎంట్రీ ఇస్తున్నారు. 'హనుమాన్' లాంటి విజవంతంగా సినిమా తీసిన కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డిలు ఈ సినిమాకి నిర్మాతలు. ఈ సినిమా ప్రచారాలు బాగానే చేశారు, ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.

Darling.jpg

Darling story కథ:

రాఘవ (ప్రియదర్శి పులికొండ) ఒక ట్రావెల్ ఏజెన్సీలో పని చేస్తూ ఉంటాడు. పెళ్లి చేసుకొని, వెంటనే హనీమూన్ కి పారిస్ వెళ్లాలని కలలు కంటూ ఉంటాడు. ఆ ప్రయత్నంలోనే తల్లిదండ్రులు నందిని (అనన్య నాగెళ్ల) అనే ఆమెని చూసి, పెళ్లి ఏర్పాట్లు ఘనంగా చేస్తారు. తీరా ముహూర్తం సమాయానికి ఆ అమ్మాయికి వేరే అబ్బాయి అంటే ఇష్టమని వెళ్ళిపోతుంది, రాఘవ పెళ్లి ఆగిపోతుంది. హానీమూన్ కి పారిస్ వెళ్ళాలి అనుకున్న రాఘవకి జీవితంపై విరక్తి వచ్చి ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటాడు. అదే సమయంలో ఆనంది (నభ నటేష్) పరిచయం అవుతుంది, తన కథ చెపుతాడు ఆమెకి. పరిచయం అయిన కొన్ని గంటలకే ఆమెకి ప్రపోజ్ చేస్తాడు, ఇంకొన్ని గంటల్లోనే పెళ్లి కూడా చేసుకుంటాడు. అయితే అసలు కదా ఇక్కడే మొదలవుతుంది. ఆనంది మామూలు మనిషి కాదని ఆమె ఒక మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అనే వ్యాధితో బాధపడుతుంది అని తెలుస్తుంది. అంటే ఆమె ఇంకో ఆరుగురిలా అప్పుడప్పుడూ మారుతూ ప్రవర్తిస్తుంది అన్నమాట. మరి రాఘవ ఆమెని ఏమి చేశాడు? ఇద్దరూ విడిపోయారా? అసలు ఆనంది ఎవరు, ఆమె నేపధ్యం ఏంటి? ఆమె గతం గురించి తెలిసిన రాఘవ చివరికి ఏమి చేశాడు? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

నిర్మాతలు కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఇంతకు ముందు 'హనుమాన్' అనే సినిమా తీసి అఖండ విజయం సాధించారు. అదే నిర్మాతలు ఈ 'డార్లింగ్' సినిమా అనగానే ప్రేక్షకుల్లో కొంచెం ఆసక్తి ఏర్పడుతుంది. అయితే ఈ 'డార్లింగ్' సినిమా చూసాక నిర్మాతలకి కథపైన ఎటువంటి అవగాహన లేదనిపిస్తోంది. ఆ 'హనుమాన్' అప్పుడున్న పరిస్థితులు, శ్రీరామ సెంటిమెంట్, ప్రశాంత్ వర్మ దర్శకత్వం ఇలాంటివి కొన్నిటివల్ల ఆడింది అని అర్థం అవుతోంది. అంత పెద్ద విజయం సాధించిన తరువాత అదే నిర్మాతల నుండి ఇంకో సినిమా వస్తోంది అంటే ప్రేక్షకులు కొంచెం అంచనాలు పెట్టుకుంటారు. కానీ ఈ 'డార్లింగ్' సినిమా చూసాక, నిర్మాతలు కేవలం డబ్బులు పెట్టడానికి మాత్రమే అని, కథపై వాళ్ళకి ఎటువంటి పట్టు లేదన్న విషయం అర్థం అవుతుంది.

Darling.jpg

దర్శకుడు అశ్విన్ రామ్ అసలు ఈ 'డార్లింగ్' సినిమాలో ఏమి చెప్పాలని అనుకున్నాడో అతనికైనా అర్థం అవుతుందో లేదో మరి. సినిమా అనేది ప్రేక్షకుడికి తను కొన్న టికెట్ కి వినోదం కోసం థియేటర్ కి వస్తాడు. దర్శకుడు ఏ కథ చెప్పినా అది ప్రేక్షకుడికి ఎంటర్ టైనమెంట్ ఇవ్వాలి, వాళ్ళు నమ్మేట్టు తీయ్యగలగాలి. కానీ అశ్విన్ రామ్ కేవలం నిర్మాతలని కాదు ప్రేక్షకులని కూడా బాగా కష్టపెట్టాలి అనుకున్నాడేమో, అందుకే ఇలాంటి 'డార్లింగ్' లాంటి కథని ఎంచుకున్నాడు. మామూలుగా ఒక మనిషి ఇద్దరుగా ప్రవర్తిచండం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం, అది కూడా పరిస్థితులను బట్టి. కానీ ఈ కథలో ఆమెలో ఏకంగా ఆరుగురు వుంటారు. పోనీ అదైనా సరిగ్గా చెప్పగలిగాడా, అదీ చెప్పలేకపోయాడు.

సినిమా మొదలవటమే ప్రేక్షకుడికి బోరింగ్ గా ఉంటుంది. కథానాయకుడు ట్రావెల్ ఏజెన్సీ లో పని చేస్తాడని చెప్పడానికి, అతనిచేత ట్రావెల్ గురించి పెద్ద ప్రవచనమే ఇప్పిస్తాడు. కథలో వినోదం ఉండదు, భావోద్వేగాలు ఉండేవు, అసలు కథే లేనప్పుడు ఇవన్నీ ఎక్కడ ఉంటాయి. ప్రేక్షకుడు సినిమా మొదలైన దగ్గర నుంచి ఎప్పుడు సినిమా అయిపోతుందా అని తను కూర్చున్న కుర్చీలో అటు ఇటు తిరగడం, ఆవలింతలు, నిట్టూర్పులు ఇలా ఎంతో అసహనంగా కూర్చుంటాడు. దర్శకుడు ఈ సినిమాని అంతలా ప్రేక్షకుడిపై రుద్దడానికి ప్రయత్నం చేశాడు. కనీసం తను కథ ఏమి తీస్తున్నాడు, ఎటు పోతోంది, అసలు ఏమి చెప్పాలని అనుకున్నాడు, కథలో కోర్ పాయింట్ ఏంటి, ఒక మనిషిలో అసలు అంతమంది వుంటారా, ఇవన్నీ నమ్మగలిగేట్టు తీయగలమా? ఈ పాయింట్స్ ఏవీ దర్శకుడు ఆలోచించలేదు అనిపిస్తోంది. డబ్బులు పెట్టే నిర్మాత దొరికాడు, సినిమా తీశాడు, టికెట్ కొని వచ్చే ప్రేక్షకులు కథా పోయేది అనే చందాన ఈ సినిమా తీశాడు అనిపిస్తోంది.

ఎందరో యువకులు అవకాశం కోసం ఎదురుచూస్తూ వుంటారు, చాలామందికి రాని అవకాశం ఈ యువ దర్శకుడికి వచ్చింది. మరి ఆ అవకాశాన్ని అతను ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఎలాంటి కథని తెరపై చూపించాలి, ప్రేక్షకులని ఎలా మెప్పించాలి అని అలోచించి సినిమా చెయ్యాలి. అసలు అటువంటిది ఏమీ లేకుండా కేవలం ఎదో ఒక పేలవమైన కథని పట్టుకొని రెండున్నర గంటలు ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టే విధంగా తీశాడు. అక్కడక్కడా ఏవో ఒకటి రెండు హాస్య సన్నివేశాలు తప్పితే, సినిమాలో ఒక్క సన్నివేశం కూడా ప్రేక్షకుడిని రంజింప చెయ్యదు. మరీ సినిమాటిక్ గా కొన్ని అనిపిస్తాయి సన్నివేశాలు. ఇక ఆమె బుర్రలోకి ఆ ఆరుగురు వస్తున్నప్పుడు అసలు చూడలము ఆ సన్నివేశాలు. ఈ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.

darling.jpg

ఇక నటీనటుల విషయానికి వస్తే ప్రియదర్శి పులికొండ కథ సరిగ్గా లేని ఇలాంటి సినిమా ఎలా వొప్పుకున్నాడో అర్థం కాదు. అతని పాత్ర ఏమీ బలంగా ఉండేది, అలాగే ఈ సినిమా అతనికి ఏ విధంగానూ ఉపయోగపడదు. అతనికి ఈ సినిమా వేస్టు అని చెప్పాలి. ఇక నభ నటేష్ పాత్ర సరిగ్గా డిజైన్ చెయ్యలేదు, అందుకని ఆమె పాత్ర మరీ బోర్ కొడుతుంది. దానికితోడు ఆమె ఆరుగురిలా అప్పుడప్పుడూ కనిపిస్తూ ఉంటుంది, ఒక్కరినే భరించటం కష్టం అనుకున్న సమయంలో ఆరుగురు అంటే ప్రేక్షకుడి భాధ అర్థం చేసుకోండి. బ్రహ్మానందం అవుట్ డేటెడ్ అయిపోయిన నటుడు, అతన్ని చూస్తే నవ్వు రాదు, జాలి వేస్తుంది. అతను ఒక లెజండరీ నటుడు, కానీ కేవలం ఒకటి రెండు సన్నివేశాలకి అతన్ని వాడుకోవటం హాస్యాస్పదం. మురళి గౌడ్ ఈమధ్య అన్ని సినిమాలలోనూ ఒకే పాత్రలో కనపడుతున్నారు. ఇందులో కూడా కథానాయకుడి తండ్రి, ఇలాంటివి ఇప్పటికి చాలానే చేశాడు అతను. అదే పాత్రలో చూడటం కొంచెం బోర్ గా ఉంటుంది. అనన్య డాక్టరుగా పరవాలేదు. ప్రియదర్శి స్నేహితులుగా విష్ణు, కృష్ణ తేజ బాగున్నారు. చివర్లో నిహారిక కొణిదెల అతిధి పాత్రలో మెరుస్తుంది. ఛాయాగ్రహణం పరవాలేదు, సంగీతం మామూలే. సినిమాలో కథ, భావోద్వేగాలు, వినోదం ఏమీ లేనప్పుడు మిగతావి ఎవునున్న అన్నీ మైనస్ అయిపోతాయి.

చివరగా, 'డార్లింగ్' సినిమా ప్రచారాలు ఎక్కువ, విషయం తక్కువ అన్నట్టుగా వుంది. 'హనుమాన్' లాంటి ఒక పెద్ద విజయం సాధించిన నిర్మాతల దగ్గర నుండి ఒక కథ కమామీషు లేని, భావోద్వేగాలు లేని, వినోదం లేని ఒక చప్పటి 'డార్లింగ్' సినిమా వచ్చిందంటే కొంచెం ఆశ్చర్యం వేస్తుంది. నిర్మాతలు కథ విని సినిమా అవకాశాం ఇచ్చారో, లేదా ముందు సినిమా పెద్ద విజయం సాధించింది కాబట్టి, ఆ వచ్చిన డబ్బులో తరువాత ఒక చిన్న సినిమా చేసేస్తే సరిపోతుంది కథా అని చేశారో, ఈ 'డార్లింగ్' చూస్తే తెలుస్తుంది. ప్రేక్షకుడి సహనానికి పరీక్ష ఈ సినిమా అని చెప్పొచ్చు!

Updated Date - Jul 19 , 2024 | 04:56 PM