Committee Kurrollu Review: కమిటీ కుర్రోళ్లు

ABN , Publish Date - Aug 09 , 2024 | 11:31 AM

మెగా డాటర్‌ నిహారిక కొణిదెల నిర్మించిన సినిమా ‘కమిటీ కుర్రోళ్ళు’. పవన్‌కల్యాణ్‌కు అభిమాని అయిన యదు వంశీ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. 11 మంది కొత్త హీరోలు, నలుగురు హీరోయిన్లతో ఈ చిత్రం తెరకెక్కింది.

Committee Kurrollu

సినిమా రివ్యూ: ‘కమిటీ కుర్రోళ్ళు’ (Committee Kurrollu)

విడుదల తేదీ: 9–8–2024

నటీనటులు: సందీప్‌ సరోజ్‌, యశ్వంత్‌ పెండ్యాల, ఈశ్వర్‌ రాచిరాజు, త్రినాద్‌ వర్మ, ప్రసాద్‌ బెహరా, మణికంఠ పరసు, లోకేష్‌ కుమార్‌ పరిమి, శ్యామ్‌ కళ్యాణ్‌, రఘువరన్‌, శివకుమార్‌ మట్ట, అక్షయ్‌ శ్రీనివాస్‌, రాధ్య, తేజస్వి రావు, టీనా శ్రావ్య, విషిక, సాయికుమార్‌, గోపరాజు రమణ, బలగం జయరాం, శ్రీలక్ష్మి, కంచెరపాలెం కిషోర్‌, కిట్టయ్య ,రమణ భార్గవ్‌ తదితరులు.

సినిమాటోగ్రఫీ: రాజు ఎడురోలు,

సంగీతం: అనుదీప్‌ దేవ్‌,  

ఎడిటర్‌: అన్వర్‌ అలీ

సమర్పణ: నిహారిక కొణిదెల,

బ్యానర్స్‌: పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ ఎల్‌.ఎల్‌.పి, శ్రీరాధా దామోదర్‌ స్టూడియోస్‌,

నిర్మాతలు: పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక,

రచన, దర్శకత్వం: యదు వంశీ.

మెగా డాటర్‌ నిహారిక కొణిదెల (Niharika konidela) నిర్మించిన సినిమా ‘కమిటీ కుర్రోళ్ళు’. పవన్‌కల్యాణ్‌కు అభిమాని అయిన యదు వంశీ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. 11 మంది కొత్త హీరోలు, నలుగురు హీరోయిన్లతో ఈ చిత్రం తెరకెక్కింది. సాయికుమార్‌, గోపరాజు రమణ, సీనియర్‌ నటి శ్రీ లక్ష్మి, ‘కేరాఫ్‌ కంచరపాలెం’ ఫేమ్‌ కిశోర్‌ కీలక పాత్రధారులు. ఇప్పటి వరకూ ఓటీటీ సిరీస్‌లకు నిర్మాతగా వ్యవహరించిన నిహారికకు నిర్మాతగా తొలి సినిమా ఇది. గ్రామీణ నేపథ్యం అంటూ ట్రైలర్లు, పోస్టర్‌లను ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.

కథ:

అది గోదావరి జిల్లాల్లోని పురుషోత్తమపల్లి అనే గ్రామం. అక్కడ గ్రామ దేవత బరింకాలమ్మ తల్లి. 12 ఏళ్లకు ఓసారి ఘనంగా జరిగే జాతర. స్నేహానికి మారుపేరుగా ఉండే 11మంది కుర్రోళ్లు. వారి ఆటలు, పాటలు. ఈసారి జాతర జరిగిన పది రోజులకు సర్పంచ్‌ ఎన్నికలు. ఆ ఎన్నికల్లో శివ (సందీప్‌ సరోజ్‌) సర్పంచ్‌గా, అతనికి ఎదురు పోలిశెట్టి బుజ్జి (సాయికుమార్‌) పోటీ చేయడానికి సన్నాహాల్లో ఉంటారు. అయితే గత జాతరలో 11 మంది స్నేహితుల్లో కులం రిజర్వేషన్‌ కారణంగా జరిగిన గొడవలో స్నేహితుడు ఆత్రం (నరసింహ) మరణిస్తాడు. దాంతో స్నేహితుల్లో కొందరు తలో దారికి వెళిపోతారు. ఆ స్నేహితులంతా జాతరలో కలిశారా? కులాలను అడ్డుపెట్టుకుని పన్నెండేళ్ల క్రితం జరిగిన గొడవను ఎప్పటికప్పుడు రగిలిస్తూ స్వార్థ ప్రయోజనాల కోసం పరితపించే ఊరి జనాలు ఎవరు? ప్రస్తుత ప్రెసిడెంట్‌ పోలిశెట్టి బుజ్జి (సాయి కుమార్‌) పాత్ర ఏమిటి? ఈసారి జాతను 11 మంది కమిటీ కుర్రోళ్లు ఎలా చేశారు అన్నది కథ. (Committee Kurrollu Review)

Commite.jpg

విశ్లేషణ:

పురుషోత్తమ పల్లి అనే గ్రామంలో 12 ఏళ్లకు ఒకసారి వచ్చే జాతర నేపథ్యంలో సాగే కథ ఇది. దానికి 11 మంది చిన్ననాటి స్నేహితులు, ప్రేమ, రాజకీయం ఇలు పలు అంశాలను మిళితం చేసి దర్శకుడు యదు వంశీ తెరకెక్కించారు. ఫస్టాఫ్‌ పాత్రల పరిచయం, వారి చిన్నతనం, అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ సాగింది. ఇంటర్వెల్‌ సమయానికి 11 మంది మిత్రుల్లో చిన్న కలహం అది ప్రాణాలు తీసేవరకూ వరకూ వెళ్లడం ఒక ట్విస్ట్‌లాగా ఇచ్చారు. పాత్రల పరిచయం, చిన్నప్పటి విషయాలు చెప్పడం కాస్త సాగదీతగా అనిపించినా స్నేహం మీద ఒక పాట, సంగీతం ఆ భావనను దూరం చేశాయి. 90ల్లో గ్రామీణ ప్రాంతాల జీవలశైలి కులమతాలకు అతీతంగా స్నేహితుల మఽధ్య మైత్రీ, అప్పటి ఆటలు, ప్రేమకథలు, భావోద్వేగాలను దర్శకుడు తన అనుభవం పరంగా హృద్యంగా, వినోదాత్మకంగా చెప్పాడు. సైకిళ్ల మీద స్కూల్‌కి వెళ్లడం, ఏడు పెంకుల ఆట, కాల్వల్లో స్నానాలు, ఆదివారం ఉదయం ప్రసారమయ్యే పంచతంత్రం, క్రికెట్‌ మ్యాచ్‌, అప్పట్లో అమ్మాయి పుష్పవతి అయితే ఎలా ఉండేది, ముద్దు పెడితే కడుపు వచ్చేస్తుంది అనేంత అమాయకత్వం, సీడీ షాపులు, అందులో దొరికే సీడీలు, జాతర, అందులో రికార్డింగ్‌ డాన్స్‌లు, అవన్నీ కూడా చిన్ననాటి జ్ఞాపకాల్లోకి తీసుకెళతాయి. 90ల్లో యువత ఆ సన్నివేశాలకు బాగా కనెక్ట్‌ అవుతారు. ఆ పాత్రలో ఉన్నది నేనే కదా అని భావించేలా ఉంటాయి. ఊహ తెలియని వయసు, అవగాహనలేని సమయంలో కల్మషం లేని స్నేహం, కులాలకు అతీతంగా ఆ క్యారెక్టర్లను మలిచిన తీరు బావుంది.  ఫోన్‌లు సోషల్‌ మీడియా లేని సమయంలో పిల్లల జీవితం ఎలా ఉండేదో చక్కగా ఆవిష్కరించారు. సరదాగా సాగుతున్న స్నేహితుల మధ్య కులం కారణంగా చిన్నపాటి ఘర్షణ, అప్పటిదాకా కులమతాలకు అతీతంగా మెలిగిన స్నేహితులు, ఒక్కసారిగా దూరం కావడం, సర్పంచ్‌గా పోటీ చేయాలనుకునే బుజ్జి ఆ గొడవను రాజకీయ స్వార్ధానికి ఎలా వాడుకున్నాడు? జాతరలో విషాదం ఇవన్నీ కూడా ఉత్కంఠగా సాగుతాయి.  11 మంది మిత్రుల్లో చిన్నవాడైన నరసింహ అలియాస్‌ ఆత్రం మరణం గుండెల్ని కదిలిస్తుంది. అయితే ఇంటర్వెల్‌ బ్యాంగ్‌లో ఉన్న ఎమోషన్‌, హై సెకెండాఫ్‌ ప్రారంభానికి సన్నగిల్లుతుంది. అదే హై మెయిన్‌టెయిన్‌ అయి ఉంటే ఫ్లో మిస్‌ అయ్యేది కాదు. ప్రేక్షకుడి అంచనాకు చేరువయ్యేది. ఆ సందర్భంలో సంగీత దర్శకుడు అనుదీప్‌ దేవ్‌ నేపధ్య సంగీతంతో కాస్త పరిగెత్తించాడు. సినిమాలో సున్నిత అంశం రిజర్వేషన్‌ సీన్‌ను ఇంటర్వెల్‌కు ముందే పక్కనపెట్టాడు దర్శకుడు. కులాల గొడవతో విడిపోయిన స్నేహితులు కలవడానికి బలమైన సన్నివేశాలు పెట్టుంటే బావుండేది. 12 ఏళ్ల తర్వాత కలిశారు అంటే దాని తగ్గ హై ఉండాలి. కానీ వారి కలయిక సింపుల్‌గా అయిపోయింది. అదే ప్రేక్షకుడికి కనెక్ట్‌ అయ్యేలా లేదు. అలాగే ప్రేమ కథలకు కూడా దారి చూపించలేదు. కుర్రోళ్లు అంతా కమిటీగా ఏర్పడటం, జాతర ఘనంగా జరిపించడం వంటి సన్నివేశాలు బాగానే ఉంటాయి. తదుపరి సర్పంచ్‌ ఎన్నికల సన్నివేశాలు గత ఎన్నికలను తలపిస్తాయి. ‘గెలవాలనే ఆశ... ఓడిపోతామనే భయం లేనోడు నిజమైన నాయకుడు, ఓడిపోయి కూడా జనాల్లో ఉండి సేవ చేయొచ్చు’’ అని శివ చెప్పే  డైలాగ్‌లు జనసేన ప్రస్థానాన్ని గుర్తు చేస్తాయి. (Committee Kurrollu Review)

ఇక ఆర్టిస్ట్‌ల విషయానికొస్తే.. ఇందులో నటులు 11 మంది బాగా నటించారు. శివ, సుబ్బు, విలియం, బ్రిటీష్‌, కిశోర్‌,  సూర్య ఇలా ప్రతి ఒక్కరూ తమ బెస్ట్‌ ఇచ్చారు.  శివ, సుబ్బు, విలియం, సూర్య పాత్రలు బాగా రిజిస్టర్‌ అయ్యాయి. ఎమోషన్స్‌ బాగా పండించారు. సాయి కుమార్‌, గోపరాజు రమణల అనుభవం సినిమాకు ఉపయోగపడింది. ‘కేరాఫ్‌ కంచరపాలెం’ కిశోర్‌, శ్రీలక్ష్మి సెకెండాఫ్‌లో కంటతడి పెట్టిస్తారు. యూట్యూబ్‌ సిరీస్‌లతో ఫేమస్‌ అయిన ప్రసాద్‌ బెహరా పెద్దోడు పాత్రతో మెప్పించారు. యూట్యూబ్‌లో కామెడీ టైమింగ్‌తో అలరించిన అతను ఎమోషన్స్‌ పండించగలడని, అతనిలో కమెడీయన్‌ మాత్రమే కాదు. మంచి నటుడు ఉన్నాడని నిరూపించాడు. మిగతా ఆర్టిస్ట్‌లు అంతా పరిధి మేర నటించారు. ఆర్టిస్ట్‌ల విషయంలో ఎక్కడా పేరు పెట్లేలా లేదు. ఇక సినిమాకు కీలకం సంగీతం.  అనుదీప్‌ దేవ్‌ సంగీతం సినిమాను నెక్స్ట్‌ లెవల్‌కు తీసుకు వెళ్ళింది. సీన్‌ డల్‌ అయిన రెండు మూడు సందర్భాల్లో ఆర్‌ఆర్‌ సినిమాను నిలబెట్టింది. జాతర ఎపిసోడ్‌ అంతా రీ రికార్డింగ్‌ హైలైట్‌గా నిలుస్తుంది. కెమెరా వర్క్‌ కూడా బావుంది. అయితే 156 నిమిషాల నిడివిలో స్నేహితుల పరిచయం, క్లైమాక్స్‌లో ఎన్నికల పాట, అక్కడి డైలాగ్స్‌లో కాస్త కత్తెర వేసుంటే సినిమా క్రిస్ప్‌గా ఉండేది. నిర్మాతగా నిహారిక ఖర్చు చేసిన ప్రతి రూపాయి తెరపై కనిపించింది. వింటేజ్ లుక్ లో చాలా గ్రాండ్ గా తెరకెక్కించారు. 

చివరిగా 'కమిటీ కుర్రోళ్లు' పల్లెకు తీసుకెళ్తారు..

చిన్నతనాన్ని గుర్తు చేస్తారు..

నవ్విస్తారు.. భావోద్వేగాలను పంచుతారు.

Updated Date - Aug 24 , 2024 | 08:29 PM