Pottel Review: అనన్య నాగళ్ల నటించిన 'పొట్టేల్' ఎలా ఉందంటే..
ABN , Publish Date - Oct 25 , 2024 | 01:21 AM
విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన అద్భుత చిత్రమిదని, రంగస్థలం తర్వాత అలాంటి సినిమా అని వేదికపై విపరీతంగా పొగిడేశారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సైతం సినిమా బావుందని చెప్పడంతో సినిమాలో ఏదో విషయం ఉందని ప్రేక్షకుల్లో నమ్మకం కలిగింది.
సినిమా రివ్యూ: 'పొట్టేల్' (Pottel Review)
విడుదల తేది: 25–10–2024
నటీనటులు: అనన్యా నాగళ్ల(Ananya Nagalla), యువ చంద్ర, అజయ్, నోయల్, శ్రీకాంత్ అయ్యంగర్, ప్రియాంక శర్మ, ఛత్రపతి శేఖర్, బేబీ తనస్వీ తదితరులు
సాంకేతిక నిపుణులు:
సినిమాటోగ్రఫీ: మోనిష్ భూపతిరాజా
సంగీతం: శేఖర్ చంద్ర
ఎడిటింగ్: కార్తిక్ శ్రీనివాస్
నిర్మాతలు: సురేష్ కుమార్ సడిగే, నిశాంక్‌రెడ్డి కుడితి
కథ – దర్శకత్వం: సాహిత్ మోత్కురి (Sahith Motkuri)
ఈ మధ్యకాలంలో ఓ చిన్న సినిమాకు విపరీతంగా ప్రమోషన్ జరిగింది అంటే అది 'పొట్టేల్’ సినిమాకే. టైటిల్ నుంచి ట్రైలర్ వరకూ ఆసక్తి కలిగించేలా ఉండడంతో జనాలు ఎక్కువగా ఈ చిత్రం గురించి మాట్లాడుకున్నారు. అంతే కాదు ప్రమోషన్‌లో భాగంగా జరిగిన ఈవెంట్‌లో దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా ఈ సినిమాపై పొగడ్తల వర్షం కురిపించారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన అద్భుత చిత్రమిదని, 'రంగస్థలం' తర్వాత అలాంటి సినిమా అని వేదికపై విపరీతంగా పొగిడేశారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సైతం సినిమా బావుందని చెప్పడంతో సినిమాలో ఏదో విషయం ఉందని ప్రేక్షకుల్లో నమ్మకం కలిగింది. అనన్యా నాగళ్ల, యువ చంద్ర (Yuva Chandra) జంటగా 'సవారి’ చిత్రంతో దర్శకుడితో పరిచయమైన సాహిత్ మోత్కురి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రంలో త్రివిక్రమ్, సందీప్‌రెడ్డి వంగా చెప్పినంత ఉందా? అన్నది రివ్యూలో చూద్దాం.
కథ: (Pottel Review)
మహారాష్ట్ర, తెలంగాణ బార్డర్ ప్రాంతంలోని విధర్భ సమీపంలో గుర్రంగట్టు గ్రామీణ ప్రాంతమది. ఆ గ్రామ దేవత బాలమ్మకు పుష్కరానికి ఓసారి జాతర చేసి పొట్టేలును బలిస్తారు. గ్రామ దేవత ఆ ఊరికి పెత్తందారుగా ఉన్న పటేల్‌కు పూనుతుందని జనాల నమ్మకం, ఆ తరం పటేల్ (అజయ్) ఒంటి మీదకు బాలమ్మ రాదు. ఏళ్లు గడిచిన అదే పరిస్థితి. దాంతో గ్రామంలో నీరు లేక, కరువు కాటకాలతో ఇబ్బంది పడుతున్న అక్కడి జనాలకు ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితి. కొద్దిరోజులకు బాలమ్మ పూనినట్టుగా నాటకం ఆడతాడు అజయ్. బాలమ్మకు సమర్పించాల్సిన పొట్టేల్ కాపరిగా ఉన్న పెద్ద గంగాధర్ (యువ చంద్ర)కు ఆ విషయం తెలిసి ఊళ్లో జనాలకు చెప్పగా ఎవరూ నమ్మరు. చదువు అంటే ఏంటో తెలియని గ్రామ వాసులను పటేల్ ఎదగనివ్వను. ఇంట్లో చిన్న పిల్లల్ని సైతం చూడనివ్వరు. పటేల్‌కు వ్యతిరేకంగా గంగాధర్ తన కూతురు సరస్వతిని చదివిస్తాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న పటేల్.. గంగాధర్ వద్ద ఉన్న పొట్టేల్‌ను మాయం చేస్తారు. జాతర టైంకి పొట్టేల్‌ను తీసుకు రావాలని లేదంటే తన కూతురుని బాలమ్మకు బలి ఇవ్వాలని పటేల్ అంటాడు. ఆ పొట్టేల్ కోసం గంగాధర్ ఏం చేశాడు. తన బిడ్డను కాపాడటానికి, ఊళ్లో పిల్లలు చదువుకోసం అతను పడ్డ తపన నిజం అయిందా? అతని జర్నీలో బుజమ్మ (అనన్య నాగళ్ల) పాత్ర ఏంటి? పటేల్ ఆగడాలకు అడ్డు కట్ట వేసేది ఎవరు అనేది కథ. (Pottel Movie Review)
విశ్లేషణ: (Pottel Review)
1980 సమయంలో పటేళ్ల వ్యవస్థ, వాళ్ల ముందు తల కూడా ఎత్తకుండా అణగారిన సాధారణ ప్రజలు, కనీసం ుఅఆ’లు అంటే ఏంటో తెలియని చిన్నారులు, చదువు లేకపోవడంతో జరిగిన అనర్థాల నేపథ్యంలో సాగే గ్రామీణ కథ ఇది. సాహిత్ మోత్కురి రాసుకున్న కథ బలమైనదే. సినిమా బ్యాక్ డ్రాప్, క్యారెక్టరైజేషన్స్ రాసుకున్న విధానం కూడా బావుంది. పటేల్‌ను ఎదురించి తన కూతుర్ని చదివించుకోవాలనుకున్న తండ్రిగా, భర్తను, బిడ్డను కాపాడుకోవాలనుకునే ఇల్లాలిగా అనన్యా పాత్రను, చదువు చెప్పే మాస్టార్‌ని ఇరకాటంలో పడేయకూడదని కుక్కలతో కరిపించినా నిజాన్ని బయటకు చెప్పకుండా ఓర్పు వహించిన గంగా పాత్రలతో దర్శకుడు చక్కగా కథ అల్లు కున్నాడు. సినిమా ప్రారంభం నుంచి చివరి దాకా పటేల్ పాత్రధారి బలహీన వర్గానికి చెందిన గంగ పాత్రను ఎంత హింసించిన బలంగా ఎదురు తిరిగిన సందర్భాన్ని ఒకటి కూడా చూపించలేకపోయాడు దర్శకుడు. కొడుతుంటే చివరి దాకా ఆ దెబ్బలు తింటూ పోరాటం చేశాడే తప్ప ఎదురు తిరిగేలా సన్నివేశాలు రాసుకోలేకపోవడం కాస్త మైనస్‌గా అనిపిస్తుంది. పలు చోట్ల లాజిక్‌లు మిస్ అయ్యాడు. స్ర్కీన్‌ప్లే పై ఇంకాస్త దృష్టి సారించి ఉంటే ఇంపాక్ట్ బావుండేది. ప్రజెంట్ చేసిన తీరులో లోటుపాట్లు ఉన్నాయి. ఈ చిత్రంలో విలువైన విషయాలు చాలానే ఉన్నాయి. వాటిని చెప్పగలడంతో దర్శకుడు ఎక్కడో తడబడినట్లు కనిపిస్తుంది. ఫస్టాఫ్ అంతా నీరసంగానే సాగుతుంది. సెకెండాఫ్‌లో కాస్త ఊపందుకుంటుంది. క్లైమాక్స్ బావుంది.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరుకొస్తే.. పటేల్‌గా అజయ్ అద్భుతంగా జీవించాడు. విక్రమార్కుడు చిత్రం టిట్ల పాత్రతో ఎంత ఇంపాక్ట్ ఇచ్చాడో ఈ సినిమాలో అంతకు మించి ఇంపాక్ట్ చూపించాడు. అయితే ఒకరిద్దరు మినహా తెలుగు మేకర్స్ అజయ్‌లోని పూర్తి స్థాయిని వాడుకోలేకపోయారనిపిస్తుంది. మంచి ఆర్టిస్ట్‌ను తెలుగు ఇండస్ట్రీలో ఉంచుకుని పరభాషా నటుల వెంట పడటం బాధాకరం. అజయ్ మాత్రం పటేల్ పాత్రలకు పూర్తిస్థాయి న్యాయం చేసి గొప్ప నటుడు అని నిరూపించుకున్నారు. పెద్ద గంగా పాత్రలో కొత్త నటుడు యువ చంద్రకు మంచి పాత్ర దక్కింది. తన బిడ్డను చదివించాలి, ఊరికి మంచి జరగాలి అన్న తాపత్రయం గల వ్యక్తిగా పాత్రలో ఒదిగిపోయాడు. అతనికిది తొలి చిత్రమే అయినా పాత్రకు తగ్గట్టు చేసుకుంటూ వెళ్లిపోయాడు. తెలుగింటి నటి అనన్య నాగళ్ల నటనకు ఆస్కారం ఉన్న పాత్ర దక్కింది. బుజెమ్మగా అలరించింది. డీగ్లామర్ పాత్రే అయినా చక్కగా నటించింది. నోయల్‌కి కూడా మంచి కారెక్టర్ పడింది. శ్రీకాంత్ అయ్యంగార్, ఛత్రపది శేఖర్ పాత్రలకు న్యాయం చేశారు. సినిమాకు మెయిన్ ఎసెట్ సంగీతం. శేఖర్ చంద్ర కథానుగుణంగా చక్కని పాటలు ఇవ్వడమే కాకుండా నేపథ్య సంగీతంతో సినిమాను నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లాడు. 1970, 80ల సమయంలో గ్రామాలు ఎలా ఉండేవో కళకు కట్టినట్లు డిజైన్ చేశారు. ఆర్ట్స్ వర్క్ పాత రోజుల్లోకి తీసుకెళ్లింది. సెట్స్, అప్పటి గ్రామాల తీరును సహజంగా తీర్చిదిద్దారు. సంగీతంతోపాటు సినిమాటోగ్రఫీ కూడా ఎసెట్‌గా నిలిచింది. సినిమా కలరింగ్ చక్కగా ఉంది. ఇక నిర్మాతలకు దర్శకుడి ఐడియాకు తగ్గట్టు నిర్మాణపరంగా అన్ని సమకూర్చారని, సినిమాకు కావలసిన బడ్జెట్ అందించారన్నది తెరపై చూస్తుంటే తెలుస్తుంది.
బలమైన పాత్రలు, ఒకనొక సమయంలో సమాజం ఎదుర్కొన్న సమస్యలు చూపిస్తూ దానికి చక్కని సందేశం జోడించి చెప్పడం మెచ్చుకోదగిన విషయం. సినిమా అంటే కమర్షియల్, ఎంటర్‌టైన్‌మెంట్‌కి మాత్రమే పరిమితం అవుతున్న తరుణంలో ఇలాంటి సినిమా తీయాలనే ఆలోచన రావడం గొప్ప విషయం. అప్పుడే కాదు.. ఇప్పటికీ కొన్ని వర్గాల్లో నిలిచిపోయిన కులం, మతం, చిన్న పెద్దా అనే అహంకారం అనే అంశాన్ని ప్రొజెక్ట్ చేసిన విధానం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. కమర్షియల్ యాంగిల్ గురించి దర్శకుడు కొంచెం కూడా ఆలోచించకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. చదువు అనేది ఒక మనిషిని కాదు సమాజాన్ని, వ్యవస్థను తీర్చిదిద్దుతుంది అనే గొప్ప సందేశాన్ని ఇచ్చారు. పటేళ్ల కాలంలో బడుగు, బలహీన వర్గాలను ఎలా అణగదొక్కారు. ఎలాంటి దారుణానికి ఒడిగట్టేవారు అనే విషయాలను చక్కగా చూపించారు. ఏ కథనైనా అందరు మెచ్చేలా తీసినప్పుడే సినిమా విజయం సాధిస్తుంది. రచయితగా సాహిత్‌కు పేరు పెట్టలేం. కానీ దర్శకుడిగా పూర్తిస్థాయి న్యాయం చేయలేకపోయాడు. కమర్షియల్ హంగులు లేకుండా కేవలం కథలో ఉన్న బలాన్ని నమ్ముకుని తీసిన ఈ చిత్రం ఓ ప్రాంతానికి చెందిన ప్రజలకే నచ్చవచ్చు.
ట్యాగ్‌లైన్: చక్కని పల్లెకథ.. అహంకారానికి అడ్డుకట్ట